మరో 74 కేసులు నమోదు 

31 May, 2020 02:39 IST|Sakshi

 ఒక్కరోజే ఆరుగురు మృతి..

మొత్తం 77కు చేరిన మరణాల సంఖ్య

మొత్తం ఇప్పటివరకు 2,499కు చేరిన కేసులు

వనపర్తి జిల్లాలో నమోదైన తొలి కేసు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో శనివారం 74 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య ఇప్పటివరకు 2,499కు చేరుకుంది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీకి చెందిన 41, రంగారెడ్డి జిల్లాకు చెందిన 5 సహా ఇతర జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలసదారులు 9 మంది, సౌదీ అరేబియాకు చెందిన ఐదుగురు ఉన్నారు. ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాని వనపర్తి జిల్లాలో ఒక కేసు నమోదైందని ప్రజారోగ్య డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన బులెటిన్‌ విడుదల చేశారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో తెలంగాణకు చెందిన కేసులు 2,068 ఉండగా, వలస కార్మికులు, సౌదీ అరేబియా, ఇతర దేశాల నుంచి వచ్చిన వారి ద్వారా నమోదైన కేసులు 431 ఉన్నాయి. అందులో వలస కార్మికులకు సంబంధించినవి 189, సౌదీ అరేబియా నుంచి వచ్చినవి 212 కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 77 మంది చనిపోయారు. మొత్తం 1,412 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు. ప్రస్తుతం 1,010 మంది చికిత్స పొందుతున్నారు. వరంగల్‌ రూరల్, యాదాద్రి జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదుకాని జిల్లాలు సిరిసిల్ల, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, సిద్ధిపేట, భద్రాద్రి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, గద్వాల, నల్లగొండ, జనగాం, మహబూబాబాద్, నిర్మల్‌ ఉన్నాయి. 

ఇద్దరు పీజీ వైద్య విద్యార్థులకు కరోనా..
సుల్తాన్‌బజార్‌: ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో ఉంటున్న ఇద్దరు పీజీ డాక్టర్లకు కరోనా లక్షణాలు కన్పించాయి. దీంతో స్థానిక వైద్యులు వారిని పరీక్షించి గాంధీ ఆసుపత్రికి తరలించారు. భయాందోళనకు గురైన హాస్టల్‌ విద్యార్థులు వెంటనే తమ గదులను ఖాళీ చేసి వెళ్లిపోయారు. 

ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా కలకలం
అఫ్జల్‌గంజ్‌: ఉస్మానియా ఆసుపత్రిలోని డైట్‌ క్యాంటీన్‌లో పనిచేసే ఓ యువకుడికి కరోనా సోకింది. ఆ యువకుడు వారం కిందటే మహబూబ్‌నగర్‌ జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లి వచ్చాడు. తిరిగి విధుల్లో చేరిన అతడు జ్వరం, జలుబుతో బాధపడుతుండటంతో వైద్యులు కరోనా పరీక్షలు చేయించగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా, ఆసుపత్రిలోని డైట్‌ క్యాంటీన్‌లో చికిత్సలు పొందే రోగులతో పాటు సూపరింటెండెంట్, ఆర్‌ఎంవోలు, డ్యూటీ డాక్టర్లు భోజనం చేస్తుంటారు.  

మరిన్ని వార్తలు