యూఎస్‌ వీసాలకు కోవిడ్‌ దెబ్బ!

15 Mar, 2020 05:49 IST|Sakshi

రేపటి నుంచి అన్ని ఇంటర్వూ్యలు రద్దు

ప్రకటించిన యూఎస్‌ ఎంబసీ వెబ్‌సైట్‌

ఎన్నారై భర్తలకు దూరంగా నవ వధువులు

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ ప్రపం చాన్ని వణికిస్తోన్న దరిమిలా.. ఆ ప్రభావం అమెరికా వీసాలపైనా పడింది. ఇప్పటికే నేషనల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన అమెరికా ఐరోపా దేశాలకు విమాన సర్వీ సులనూ నిలిపివేసింది. విదేశీ ప్రయాణికులతో వైరస్‌ విస్తరిస్తున్న క్రమంలో.. ఈ నెల 16 నుంచి భారత్‌లోని అన్ని అమెరికన్‌ కాన్సులేట్‌ కార్యాలయాల్లో వీసా ఇంటర్వూ్యలను నిలిపివేస్తున్నట్లు యూఎస్‌ ఎంబసీ వెబ్‌సైట్‌ ప్రకటించింది. దేశంలోని చెన్నై, ముంబై, కోల్‌కతాలోని అమెరికన్‌ సెంటర్లలోకి ప్రజల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపింది. వీసా ఇంటర్వూ్యలను తిరిగి ఎప్పటి నుంచి నిర్వహించేది మాత్రం ప్రకటించలేదు. దీంతో ఈ నెలలో ఇంటర్వూ్యలకు హాజరై, ప్రయాణాలు చేద్దామనుకున్న వారంతా అయోమయంలో పడ్డారు.

హెచ్‌1–బీ వీసాదారుల ఇబ్బందులు
అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు హెచ్‌1–బీ వీసా ఇంటర్వూ్యల కోసం ఎదురుచూస్తోన్న ఆశావహులు అమెరికా ఎంబసీ ప్రకటనతో నీరుగారిపోయారు. ఓవైపు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలో వీసా ఇంటర్వూ్యల నిలిపివేత వార్త పిడుగులా పడటంతో వీరికి ఏం పాలుపోవడం లేదు. దీంతో అమెరికాలోని పలు కంపెనీలకు ఫోన్లుచేసి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటర్వూ్యలు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో స్పష్టత లేకపోవడం వారిని గందరగోళపరుస్తోంది. ఇటీవలే పెళ్లిళ్లయిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల భార్యలకు చిక్కొచ్చి పడింది. భర్తలు అమెరికాలో, భార్యలు ఇక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు శుభకార్యాలు, వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన పలువురు ఎన్నారైలు కూడా ఇక్కడే చిక్కుకుపోయారు. ఎంబసీ ఆంక్షలపై స్పష్టత లేకపోవడంతో తమ వ్యాపారాలపై బెంగపెట్టుకున్నారు. అమెరికాలో ఉద్యోగులందరికీ వర్క్‌ఫ్రం హోం సదుపాయం కల్పించడంతో పలువురు ఇండియా నుంచే పని చేసుకుంటున్నారు.

ఏడాదిలో నాలుగుసార్లు అవకాశం
వాస్తవానికి అమెరికాకు పలు రకాల వీసాలపై ఇంటర్వూ్యకు హాజరవ్వాలనుకునేవారు అనివార్య కారణాలతో ఒక్కోసారి హాజరు కాలేకపోవచ్చు. అలాంటి వారికి 4సార్లు వీసా ఇంటర్వూ్యల తేదీని మార్చుకునే వెసులుబాటు ఉంది. వీసా ఇంటర్వూ్యల తేదీని తిరిగి ప్రకటించే వరకు వీరంతా తేదీని సర్దుబాటు చేసుకోలేని పరిస్థితి. మరోవైపు కోవిడ్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో భారత్‌ కూడా ముందుజాగ్రత్త చర్యలకు దిగింది. దేశంలోకి విదేశీయుల రాకపై నిషేధం విధించింది. ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు, దౌత్యవేత్తలు, అంతర్జాతీయ ప్రాజెక్టులలో పనిచేస్తున్న వారికి మాత్రం మినహాయింపు ఇచ్చింది.

మరిన్ని వార్తలు