నెవర్‌ బిఫోర్‌.. ఎవర్‌ ఆఫ్టర్‌

25 Mar, 2020 03:30 IST|Sakshi

రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి: 48 గంటల కన్నా ఎక్కువ సమయం లిక్కర్‌ షాపుల బంద్‌

1995–97 మద్యనిషేధం తర్వాత ఇప్పుడే మద్యం దుకాణాల బంద్‌

వ్యసనపరులు విముక్తి పొందేందుకు మంచి అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర చరిత్రలో తొలిసారి మద్యం అమ్మకాలు 48 గంటల కన్నా ఎక్కువ సమయం నిలిచిపోయాయి. 1995–97లో మద్యనిషేధం అమల్లో ఉన్నప్పుడు మినహా రాష్ట్రంలో ఎప్పుడూ ఇన్ని రోజులు లిక్కర్‌ అమ్మకాలు జరగ కుండా ఉన్న సందర్భాల్లేవని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. ఎన్నికల సందర్భాల్లో పోలింగ్‌కు 48 గంటల ముందు వైన్ షాపులు, బార్లు బందయ్యేవి. కానీ, ఇప్పుడు ఆరోగ్య అత్యయిక పరిస్థితుల నేపథ్యంలో గత 8 రోజులుగా బార్లు, మూడు రోజులుగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దీంతో రాష్ట్రంలోని మందుబాబులకు కరోనా ‘చుక్కలు’కనిపిస్తున్నాయి. 

వెసులుబాట్లు కూడా లేవు...
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మద్య నిషేధం అమల్లో ఉన్నప్పుడు కల్లు, అనధికారికంగా గుడుంబా అందుబాటులో ఉండేవి. సరిహద్దు రాష్ట్రాల్లో నిషేధం లేకపోవడంతో గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్రానికి అరకొరగా మద్యం వచ్చేది. ఇప్పుడు అలాంటి వెసులుబాట్లు కూడా లేకుండాపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా గుడుంబాను దాదాపు నిర్మూలించగా, కల్లు దుకాణాలు కూడా కరోనా దెబ్బకు మూతపడ్డాయి. గ్రామాల్లో చెట్ల నుంచి తీసిన కల్లు మాత్రమే లభిస్తోంది. రాష్ట్ర సరిహద్దులను మూసివేయడంతో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం వచ్చే అవకాశం లేకుండా పోయింది. పొరుగు రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్  విధించడంతో అక్కడ కూడా మద్యం లభించడం లేదు. దీంతో రాష్ట్రంలో త్వరలోనే పూర్తిస్థాయిలో మద్యం కొరత ఏర్పడనుందని ఎక్సైజ్‌ వర్గాలంటున్నాయి. కరోనా దెబ్బకు ఇప్పట్లో లాక్‌డౌన్ ఎత్తేసే అవకాశం లేదని, కనీసం మరో నెలైనా ఇదే పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది. 

బ్లాక్‌లో ధర ‘చుక్కలే’...
బార్లు, వైన్ షాపులు మూతపడటంతో బ్లాక్‌ మార్కెట్‌లో మద్యం అమ్మకాలు అక్కడక్కడా జరుగుతున్నాయి. బ్లాక్‌లో కొని తాగాలనుకునే మందుబాబులకు వాటి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సాధారణ బ్రాండ్‌ మద్యం కూడా క్వార్టర్‌కు రూ.350 వరకు అమ్ముతున్నారు. ప్రీమియం బ్రాండ్ల మద్యమైతే ఇష్టారాజ్యంగా అమ్ముతున్నారు. అంత ధర పెట్టి తాగేకన్నా మందు మానడమే ఉత్తమమని కొందరు సర్దుకుంటుండగా, మరికొందరు బేరాలాడి కొనుక్కొంటున్నారు. మద్యానికి బానిసలైన వారు మాత్రం ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. అయితే, ఈ పరిస్థితి కొంత మేలు చేస్తుందని, అనధికార మద్యనిషేధం వ్యసనపరులకు ఉపయోగపడుతుందని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితులను వ్యసనపరులు సద్వినియోగం చేసుకుని మద్యానికి దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలని, లేదంటే మద్యం నుంచి పూర్తిగా విముక్తి పొందేందుకు సువర్ణావకాశమని అంటున్నారు. ఏదేమైనా తాగి అందరికీ చుక్కలు చూపించే మందుబాబులకు ‘కరోనా’నిజంగానే చుక్కలు చూపిస్తోంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా