ఆకాశవీధిలో..నో టూర్స్‌

3 Mar, 2020 07:59 IST|Sakshi

నగరం నుంచి తగ్గిన విదేశీ ప్రయాణాలు

టూర్‌ ప్లాన్‌లు సైతం రద్దు చేసుకుంటున్న సిటీజనులు

అన్ని ప్యాకేజీలను నిలిపివేసినఐఆర్‌సీటీసీ

రోజుకు పది వేల నుంచి 5 వేలకు తగ్గిన టూరిస్టులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ‘కరోనా’ అలర్ట్‌

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ నుంచి వివిధ దేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇక వేసవి సెలవుల్లోఇంటిల్లిపాది కలిసి తమకు నచ్చిన దేశంలో పర్యటించేందుకు  ప్రణాళికలను రూపొందించుకున్న నగర వాసులు తమ పర్యటనలను పూర్తిగా రద్దు చేసుకున్నారు.ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కోవిడ్‌–19ప్రభావంతో ఇప్పటికే  అంతర్జాతీయ పర్యాటక రంగం అతలాకుతలమైంది. హైదరాబాద్‌  నుంచి  సాధారణంగా  ప్రతిరోజు సుమారు 10 వేలమందికి పైగా ప్రయాణికులు వివిధ దేశాలకు రాకపోకలుసాగిస్తారు. కోవిడ్‌–19  ప్రభావంతో ఈ  ప్రయాణికుల సంఖ్య  సగానికి  పడిపోయినట్లు  
అధికారవర్గాలుఅంచనా వేస్తున్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార, తదితర తప్పనిసరైతే  కానీ ఎవరూ విదేశాలకు వెళ్లడం లేదని నగరానికి చెందిన  ప్రముఖ  ట్రావెల్‌  ఏజెన్సీ ప్రతినిధి ఒకరు  తెలిపారు. ఇప్పటికే చైనా, హాంకాంగ్, దక్షిణకొరియా, ఇరాన్‌ తదితర దేశాలకు ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోగా, హైదరాబాద్‌ నుంచి ఎక్కువ మంది పర్యాటకులు వెళ్లే మలేషియా, సింగపూర్, థాయ్‌లాండ్, దుబాయ్, యూరోప్‌ దేశాలకు సైతం రాకపోకలు దాదాపు స్తంభించినట్లు ట్రావెల్స్‌ సంస్థలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పలు ఎయిర్‌లైన్స్‌ సైతం తమ విమాన సర్వీసులను రద్దు చేసుకుంటున్నాయి. హైదరాబాద్‌ నుంచి విదేశాలకు వెళ్లేవాళ్లు మాత్రమే కాకుండా  వివిధ దేశాల నుంచి ఇక్కడికి వచ్చేవాళ్లు కూడా తగ్గుముఖం పట్టడంతో   పర్యాటక రంగంపైనే ఆధారపడి ఉన్న ట్రావెల్స్‌ సంస్థలతో పాటు, హోటళ్లు  ఆర్ధికంగా తీవ్ర నష్టాన్ని చవి చూస్తున్నాయి. 

కోవిడ్‌–19 షాక్‌....
ప్రపంచాన్ని  చుట్టేసిన కోవిడ్‌–19  తాజాగా హైదరాబాద్‌ను  కూడా తాకడంతో నగరం   ఒక్కసారిగా  షాక్‌గురైంది.  ఇప్పటికే  అంతర్జాతీయ ప్రయాణాలు తగ్గుముఖం పట్టగా, రానున్న ఒకటి, రెండు నెలల కోసం  టిక్కెట్‌లు బుక్‌ చేసుకున్న వాళ్లు సైతం ముందు జాగ్రత్తగా తమ బుకింగ్‌లను రద్ద చేసుకుంటున్నారు. సాధారణంగా హైదరాబాద్‌ నుంచి ప్రతి రోజు సుమారు 55 వేల మంది  జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వారిలో 10 వేల మందికి పైగా విదేశాలకు వెళ్లే వారు ఉన్నారు. దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్‌  వెళ్లే  ప్రయాణికులే  సుమారు 3500 మంది ఉంటారు. ఆ తరువాత అమెరికా, యురోప్‌  దేశాలకు, శ్రీలంక,తదితర దేశాలకు ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి  25 అంతర్జాతీయ నగరాలకు నేరుగా విమాన సదుపాయం ఉంది. అంతర్జాతీయ ప్రయాణాలపైన  పలు విమానయాన సంస్థలు చార్జీలను గణనీయంగా తగ్గించినప్పటికీ ఎవరూ ఆసక్తి చూపడం లేదు. బ్యాంకాక్, సింగపూర్‌ వంటి దేశాలకు హైదరాబాద్‌ నుంచి వెళ్లి తిరిగి వచ్చేందుకు రూ.20 వేల వరకే ఉండడం గమనార్హం. సాధారణంగా అయితే ఈ చార్జీలు రూ.30 వేల పైనే ఉంటాయి.

ఎయిర్‌పోర్టులో అలర్ట్‌...
కరోనా నేపథ్యంలో శంషాబాద్‌ విమానాశ్రయంలో  కొంతకాలంగా  క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్న వైద్యాధికారులు తాజా  పరిణామాలతో మరింత అమ్రపత్తమయ్యారు. ప్రతి ప్రయాణికుడికి థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రయాణికులకు  తప్పనిసరిగా  ఈ  పరీక్షలు చేయడంతో పాటు, స్వచ్చందంగా ముందుకు వచ్చే వారికి సైతం పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

>
మరిన్ని వార్తలు