కరోనా డిక్షనరీ

5 Apr, 2020 13:30 IST|Sakshi

సోషల్‌ మీడియాలో కొత్త పదాలు  

హాష్‌ టాగ్‌లుగా వైరల్‌ చేస్తోన్న యూత్‌

సాక్షి, హైదరాబాద్‌: కరోనా (కోవిడ్‌).. కరోనా.. ఇప్పుడు అందరి నోటా అదే మాట. ఎక్కడా అవే ఊసులు. లాక్‌డౌన్‌తో దేశ ప్రజానీకమంతా ఇళ్లకే పరిమితమైంది. ఆన్‌లైన్‌లోనూ ఇదే చర్చ. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో బిజీగా ఉండే కొందరు యువత కరోనా/కోవిడ్‌కు సంబంధించి కొన్ని కొత్త పదాలు సృష్టించారు. కరోనా కారణంగా ఉత్పన్నమవుతున్న పరిస్థితులను వ్యక్తీకరించేందుకు ఈ పదాలను విరివిగా వినియోగిస్తున్నారు. ఆయా పదాల ఉనికిని సులువుగా కనిపెట్టేందుకు ‘హాష్‌ట్యాగ్‌లు’ సృష్టించి వైరల్‌ చేస్తున్నారు. ఈ ‘కరోనా సమయం’లో అలా వాడుకలోకి, ప్రాచుర్యంలోకి వచ్చిన కొన్ని పదాల పరిచయం..

కోవిడియంట్‌
లాక్‌డౌన్‌ నిబంధనలను నియమం తప్పకుండా పాటించే వారిని ‘కోవిడియంట్‌’ అని పిలుస్తున్నారు. వీరి వల్ల సమాజానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కోవిడ్‌.. ఒబిడియంట్‌ అనే రెండు పదాలను కలిపి ఈ పదం పుట్టించారు నెటిజన్లు.

కోవిడియట్‌
లాక్‌డౌన్‌ను బేఖాతరు చేస్తూ.. వ్యక్తిగత శుభ్రత, భౌతికదూరం పాటించని వారిని ‘కోవిడియట్‌’గా వ్యవహరిస్తున్నారు. కోవిడ్‌ పదానికి ఇడియట్‌ను కలిపి దీన్ని సృష్టించారు.

కరోనిక్‌
కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిని ‘కరోనిక్‌’గా పిలుస్తున్నారు.

ప్రెపర్‌
కరోనా నేపథ్యంలో కుటుంబం కోసం సరంజామాను సిద్ధం చేసేందుకు కొందరు అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కారణంగా  కుటుంబంపై ఆర్థికభారం పడుతుంది. ఇలా అతిగా ముందుజాగ్రత్తలు తీసుకునే వారిని ‘ప్రెపర్‌’గా వ్యవహరిస్తున్నారు.

కరోనా ఫోబియా
కరోనా భయంతో 24 గంటలపాటు మాస్కులు ధరించడం, బయటికి వెళ్లకున్నా, ఏ వస్తువును ముట్టుకోకున్నా పదేపదే చేతులు కడుక్కుంటూ అతిశుభ్రతతో ఇతరులను ఇబ్బంది పెట్టే గుణాన్ని ‘కరోనా ఫోబియా’ అంటున్నారు. ఇది ఒకరకమైన మానసిక వ్యాధిగా అభివర్ణిస్తున్నారు.

జూమ్‌ బాంబింగ్‌
ఆన్‌లైన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లలోకి అనుమతి లేకుండా చొరబడి వారి సమావేశాన్ని.. కరోనాను బూచిగా చూపి ఉద్దేశపూర్వకంగా చెడగొట్టే వ్యవహారాన్ని ఇలా వ్యవహరిస్తున్నారు.

కరోనపోకలిప్స్‌
కరోనా మహమ్మారి కారణంగా భూమిపై మానవాళి అంతమవుతుందన్న సిద్ధాంతాన్ని నమ్మేవారు వాడే పదమిది. 

మరిన్ని వార్తలు