జిల్లాల్లోనూ ‘వైరస్‌’ సైరన్‌

12 Jul, 2020 03:36 IST|Sakshi

ఇప్పటివరకు గ్రేటర్, శివారు 3 జిల్లాల్లోనే కరోనా ఉగ్రరూపం

కొన్ని రోజులుగా మరో ఆరు జిల్లాల్లోనూ ప్రమాద ఘంటికలు

నగరం నుంచి సొంతూళ్లకు వలసలతో గ్రామీణ జిల్లాల్లో పెరిగిన వ్యాప్తి

జిల్లాల్లో విచ్చలవిడిగా జనసంచారం..

మాస్కులు, భౌతికదూరం గాలికి..

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ రాష్ట్రమంతటా చుట్టబెట్టేస్తోంది. ఇంతకాలం హైదరాబాద్‌ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే అధిక సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కొన్ని రోజులుగా జిల్లాల్లో సైతం గణనీయ సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోనే ఇప్పటి వరకు వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉండగా, వరంగల్‌ అర్బన్, కరీంనగర్,  నల్లగొండ, కామారెడ్డి, మెదక్, సూర్యాపేట, మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, భద్రాద్రి–కొత్తగూడెం, నిజామాబాద్,æ మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోనూ క్రమంగా వ్యాప్తి పెరుగుతోంది.

రోజూ జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి/మేడ్చల్‌ జిల్లాల పరిధిలో మూడంకెల పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండగా, దాదాపు మరో 10 జిల్లాల్లో రెండంకెలు, 15 జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌ కేసులు నమోదవుతున్నాయి. క్రమంగా వైరస్‌ గ్రామీణ జిల్లాలకు సైతం పాకుతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా వ్యాప్తి నియంత్రణకు మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారంటూ గత నెలాఖరులో వచ్చిన వార్తలతో చాలామంది నగరం నుంచి సొంతూళ్లకు వలసవెళ్లారు. ఇది కూడా కొంత వరకు జిల్లాల్లో పాజిటివ్‌ కేసులు పెరగడానికి కారణమైందని జిల్లాల్లోని అధికారులు అంటున్నారు.  

కొత్తగా 6 జిల్లాల్లో ఉధృతి
జీహెచ్‌ఎంసీతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు ఇప్పటికే హాట్‌స్పాట్‌లుగా మారాయి. నల్లగొండ, కరీంనగర్, వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ జిల్లాల్లో సైతం కరోనా పాజిటివ్‌ కేసులు ఉధృతంగా పెరుగుతున్నాయి. గడిచిన పది రోజుల్లో ఈ 6 జిల్లాల్లో వందకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. జీహెచ్‌ఎంసీ మినహాయిస్తే మరో 10 జిల్లాల్లో కరోనా వ్యాప్తి విస్తృతం అవుతోందని గణాంకాలు చెబుతున్నాయి.

మాస్కుల్లేవ్‌.. భౌతికదూరం నిల్‌
లాక్‌డౌన్‌ సడలింపులు అమల్లోకి రావడంతో బహిరంగ ప్రదేశాల్లో జనసంచారం మునుపటి స్థితికి చేరింది. లాక్‌డౌన్‌ సడలించి నెలకుపైగా గడిచి పోవడం తో ప్రజలు మళ్లీ సాధారణ జీవనానికి అలవడుతున్నారు. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడమనే నిబంధనలు గాలికొదిలి విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఓవైపు కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్నా తమకేమీ కాదనే ధీమాతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరోనా వ్యాప్తికి పరోక్షంగా కారణమవుతున్నారు.

ఉదాహరణకు గత వారం రోజులుగా నల్లగొండ జిల్లాలో గణనీయ సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నా, స్థానిక ప్రకాశంబజార్‌ మార్కెట్లో చాలామంది వ్యాపారస్తులు, వర్కర్లు మాస్కుల్లేకుండానే పనిచేస్తున్నారు. కొంతమంది ధరించినా.. వాటిని మూతిపై నుంచి కిందకి లాగి మెడకు వేలాడదీస్తున్నారు. కాగా, బయట కనిపించే వారిలో దాదాపు 50 శాతం మంది మాస్కుల్లేకుండానే తిరుగుతున్నారు. మాస్కులు ధరించకపోతే రూ.1,000 జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించినా.. కఠినంగా అమలు చేయకపోవడంతో ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిపోయిందనే విమర్శలు వస్తున్నాయి.

జూలై 1 నుంచి జిల్లాల వారీగా నమోదైన కేసులు

జిల్లా  కేసులు
రంగారెడ్డి  1,042
మేడ్చల్‌  718
సంగారెడ్డి  203
నల్లగొండ  155
కరీంనగర్‌  122
మహబూబ్‌నగర్‌  110
వరంగల్‌ అర్బన్‌  109
వరంగల్‌ రూరల్‌  108
నిజామాబాద్‌  104
మెదక్‌   85 
కామారెడ్డి  75
సూర్యాపేట   46
కామారెడ్డి  46
మంచిర్యాల  46
భద్రాద్రి కొత్తగూడెం  37
ఆదిలాబాద్‌  22  
మరిన్ని వార్తలు