-

కరోనా కలకలం

13 Apr, 2020 01:50 IST|Sakshi

జిల్లాల్లో రోజురోజుకూ విస్తరిస్తున్న కేసులు

మర్కజ్‌తో సంబంధం ఉన్న కేసులే కావడంపై ఆందోళన

కంటైన్మెంట్‌ ప్లాన్‌పై మరింత దృష్టి సారించిన సర్కారు

పరిస్థితిని సీఎంకు విన్నవించిన వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ చాపకింద నీరులా జిల్లాలకు వ్యాపిస్తోంది. మొదట్లో గ్రేటర్‌ హైదరాబాద్‌కే పరిమితమైన వైరస్‌.. ఆ తర్వాత జిల్లాలకు పాకింది. తొలుత నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌ అర్బన్‌ ప్రాంతాలకు.. తర్వాత నెమ్మదిగా మిగిలిన జిల్లాలకూ వ్యాపిం చింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 27 జిల్లాల్లో ఈ మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. కొన్ని జిల్లాల్లోనైతే రోజురోజుకూ కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. దీంతో అక్కడి ప్రజలతోపాటు ప్రభుత్వ యం త్రాంగం వణికిపోతోంది. ఆది వారం ఒక్క వికారాబాద్‌ జిల్లాలోనే ఏకంగా 11 కరోనా పాజి టివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 21కి చేరింది. సూర్యాపేట జిల్లాలోనూ కేసుల సంఖ్య వేగంగా 20కి చేరింది. ఖమ్మం జిల్లాలో మొన్నటికి మొన్న ఒక్క కేసూ లేదు. కానీ రెండ్రోజులుగా అక్కడా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా అక్కడ ఐదుగురికి పాజిటివ్‌ అని తేలింది. సిరిసిల్ల జిల్లాలోనూ ఒక కేసు నమోదైంది. మిగిలిన జిల్లాలూ ఏ మేరకు రక్షణలో ఉన్నాయన్న దానిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజామాబాద్, గద్వాల, నిర్మల్, నల్లగొండ జిల్లాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్‌ తర్వాత అత్యధిక కేసులు నిజామాబాద్‌ జిల్లాలో నమోదైన విషయం తెలిసిందే.

విదేశీ కేసులను మించి..
కరోనా వైరస్‌ రాష్ట్రానికి విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా పాకింది. మొట్టమొదటి పాజిటివ్‌ కేసు.. బెంగళూరులో పనిచేసే ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజ నీర్‌. హైదరాబాద్‌కు చెందిన అతడు విదేశాలకు వెళ్లి.. ఇక్కడికి కరోనాను మోసుకొచ్చాడు. అతడు 86 మందితో కాంటాక్ట్‌ అయినా వారిలో ఎవరికీ పాజిటివ్‌ రాకపోవడం విశేషం. మొదట్లో నమోదైన 50–60 కేసుల వరకు విదేశీయుల ద్వారా వచ్చినవే. తర్వాత ఇండొనేషియా నుంచి వచ్చిన మత ప్రచారక బృందం కరీంనగర్‌కు అంటించింది. ఆ తర్వాత మర్కజ్‌కు నేరుగా వెళ్లొచ్చిన దాదాపు 1,100 మంది, వారితో కలిపి మొత్తం 3,510 మందిని సర్కారు గుర్తించి వారందరికీ పరీక్షలు చేసింది. ఇంకా కొందరు ఉన్నట్లు చెబుతున్నారు. వారిని కూడా గుర్తించేందుకు నిఘా బృందాలు వేట సాగిస్తున్నాయి. మర్కజ్‌ వ్యవహారంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఏకంగా 500 దాటేసింది. ఇప్పటివరకు మర్కజ్‌తో సంబంధమున్నవారే 16 మంది చనిపోయారు. ఇప్పుడు అనేక జిల్లాల్లో నమోదవుతున్న కేసుల్లో దాదాపు అత్యధిక శాతం మర్కజ్‌తో సంబంధం ఉన్నవే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌లోనే అత్యధికంగా 200కు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 61 కేసులు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 37 కేసులు నమోదయ్యాయి.

వైరస్‌ వ్యాప్తిని ఆపగలమా?
స్మగ్లింగ్‌ సరుకులను చెక్‌పోస్టుల్లో ఆపినట్లుగా వైరస్‌ వ్యాప్తిని ఆపగలమా? అది సాధ్యమా? అంటే అసాధ్యం అంటున్నారు వైద్య నిపుణులు. వైరస్‌ అన్ని జిల్లాలకూ వ్యాపిస్తోందని కరోనాపై ఏర్పాటు చేసిన రాష్ట్ర ఉన్నత స్థాయి కమిటీ సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు. వైరస్‌ను కట్టడి చేయలేమని, అయితే లాక్‌డౌన్, కంటైన్మెంట్ల ద్వారా దాని వేగానికి బ్రేక్‌ మాత్రమే వేస్తున్నామని విశ్లేషించారు. వైరస్‌ వచ్చాక దాని వ్యాప్తిని ఆపలేమని, మన రోగ నిరోధకశక్తిని బట్టి అది మనపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. 90 శాతం మందిని ఈ వైరస్‌ ఏమీ చేయలేదని, అయితే వేగంగా వ్యాపించే గుణమున్న ఈ వైరస్‌ను లాక్‌డౌన్‌ చేయకపోతే ఒకేసారి దాడి చేస్తే రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారిని కాపాడటం కష్టమని అభిప్రాయపడ్డారు. నెమ్మదిగా ఆ వైరస్‌కు మన శరీరాలు అలవాటు పడతాయని పేర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో అప్రమత్తం కావడం వల్ల దేశంలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాయని వ్యాఖ్యానించారు. లేకుంటే మరో ఇటలీ, స్పెయిన్, అమెరికా లాగే మన పరిస్థితి కూడా ఉండేదన్నారు. లాక్‌డౌన్‌ వల్లే మన వద్ద వైరస్‌ ఈ మాత్రం నియంత్రణలో ఉందన్నారు. వైరస్‌ దూకుడుకు కళ్లెం వేయగలిగామని సీనియర్‌ వైద్యుడు, కీలకాధికారి అయిన ఆ కమిటీ సభ్యుడు వ్యాఖ్యానించారు. 

కంటైన్మెంట్‌ ప్రణాళికపైనే దృష్టి..
జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య చాప కిందనీరులా విస్తరిస్తుండటంపై వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇంకా ఎన్ని కేసులు నమోదవుతాయన్న ఆందోళనలో సర్కారు ఉంది. ప్రస్తుత పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించేందుకు మంత్రి ఈటల రాజేందర్‌ ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌కు వెళ్లారు. సీఎం కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కంటైన్మెంట్‌ (హాట్‌స్పాట్ల) ప్లాన్‌పైనే మరింత దృష్టి సారించాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ నెలాఖరు వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వైరస్‌ వ్యాప్తిని సాధ్యమైనంత వరకు కట్టడి చేయాలని భావిస్తోంది.

మరిన్ని వార్తలు