ఇందూరులో పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

17 Apr, 2020 17:24 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : జిల్లాలో కరోనా వైరస్‌ (కోవిడ్‌–19) కేసులు రోజుకు కొన్ని నమోదవుతున్నాయి. తాజాగా మరో మూడు కేసులు పాజిటివ్‌గా తేలగా, జిల్లాలో మొత్తం కోవిడ్‌ కేసుల సంఖ్య 58కి చేరింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం 63 శాంపిల్స్‌ను పరీక్షల కోసం పంపగా వాటిలో 57 నెగిటివ్, మూడు పాజిటివ్‌గా వచ్చాయని వెల్లడించారు. మరో ముగ్గురి శాంపిల్స్‌ను తిరిగి మరోసారి పరీక్షలకు పంపనున్నట్లు తెలిపారు. అయితే  మొత్తం 63 మంది మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారుండగా, వారిలో 32 మందివి పాజిటివ్‌ వచ్చాయని, మరో 20 పాజిటివ్‌ వారి కుటుంబ సభ్యులవని,  ఐదు ఇతర కుటుంబ సభ్యులకు, మరొకటి దుబాయ్‌ వెళ్లి వచ్చినవి ఉన్నాయని తెలిపారు. జిల్లాలో గురువారం వరకు  మొత్తం 527 మందివి శాంపిల్స్‌ పంపడం జరిగిందని చెప్పారు.  జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు పెద్ద ఎత్తున పెరుగుతుండటంతో అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు.

ప్రాణాలను పణంగా పెట్టి పోలీసు..
లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయడం వల్లనే జిల్లాలో కరోనా వైరస్‌ కమ్యూనిటీ వ్యాప్తి జరగకుండా అరికట్టడానికి అవకాశం ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు. జిల్లా ప్రజలనుద్దేశించి కలెక్టర్‌ ఒక వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. జిల్లాను కేంద్ర ప్రభుత్వం రెడ్‌జోన్‌గా ప్రకటించిందన్నారు. రెడ్‌జోన్‌ నుంచి తప్పించుకోవాలంటే ప్రజలు పూర్తిగా సహకారం అందించాలని, లాక్‌డౌన్‌ను కఠినంగా పాటించాలని కోరారు. ఇలాంటి పరిస్థితుల్లో వైరస్‌ కమ్యూనిటీ వ్యాప్తి జరగకుండా చూస్తేనే మనం సేఫ్‌జోన్‌లో ఉంటామన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి పోలీసు, వైద్య శాఖ సిబ్బంది పూర్తిస్థాయిలో పని చేస్తున్నారని అన్నారు. నిర్లక్ష్యం వహించి ఇష్టమొచ్చినట్లుగా బయట తిరిగి వ్యాధిని ఇతరులకు వ్యాప్తి చేయడం, ఇంటికి తీసుకెళ్లడం వలన మనకు మనమే ప్రమాదంలోకి నెట్టివేయబడుతామన్నారు. పాజిటివ్‌ వ్యక్తులు తిరిగిన చోటికి తెలియకుండానే వెళితే వ్యాధి బారిన పడకతప్పదనే విషయాన్ని గుర్తుంచుకుని ఎంతో జాగ్రత్తగా ఉండాలన్నారు.

మరిన్ని వార్తలు