మరో ఆరుగురికి కోవిడ్‌..

24 Mar, 2020 01:47 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా 33కు చేరిన కోవిడ్‌ కేసులు

ఇద్దరు స్థానికులకు వైరస్‌

ప్రజారోగ్యానికి భంగం కలిగిస్తే జైలుకే.. 

మంత్రి ఈటల హెచ్చరిక

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో సోమవారం మరో ఆరు కొత్త కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం వైరస్‌ సోకిన వారి సంఖ్య 33కు చేరింది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పరిస్థితి ఏమవుతుందా అన్న ఆందోళన వైద్య ఆరోగ్య శాఖ అధికారుల్లో నెలకొంది. తాజాగా కరీంనగర్‌ జిల్లాలో ఒకరి ద్వారా మరొకరికి సోకడం కలకలం రేపుతోంది. రాష్ట్రంలో ఇలా సోకడం రెండో కేసు ఇది. ఇండొనేసియా నుంచి కరీంనగర్‌ వచ్చిన మత ప్రచార బృందంలోని 10 మంది సభ్యులకు కోవిడ్‌ పాజిటివ్‌ రాగా.. వారితో కలసి తిరిగిన కరీంనగర్‌ కశ్మీరగడ్డకు చెందిన యువకుడి (23)కి కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ బృందంతో ఉన్న ప్రైమరీ కాం టాక్టులు మొత్తం 37 మందిని గుర్తించగా, ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. (రాత్రి 7 నుంచి ఉదయం 6 దాకా కర్ఫ్యూ)

సోమవారం నమోదైన ఆరు కేసుల్లో ఈ ఒక్కటి మినహా మిగిలినవన్నీ ఇతర దేశాల నుంచి వచ్చినవే. వీరంతా కూడా హైదరాబాద్‌కు చెందినవారే. ఫ్రాన్స్‌ నుంచి వచ్చిన 21 సంవత్సరాల ఓ యువకుడికి కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. అతడి కుటుంబం బల్కంపేటలో నివసిస్తుంది. సైదాబాద్‌ శాంతినగర్‌కు చెందిన 30 ఏళ్ల వ్యక్తి లండన్‌ నుంచి వచ్చాడు. అతడికి కూడా పాజిటివ్‌ వచ్చింది. ఇటీవల న్యూయార్క్‌ నుంచి వచ్చిన సోమాజిగూడకు చెందిన 20 ఏళ్ల యువకుడికి కూడా పాజిటివ్‌ వచ్చింది. గచ్చిబౌలికి చెందిన 25 ఏళ్ల వ్యక్తికి కూడా పాజిటివ్‌ తేలింది. కూకట్‌పల్లికి చెందిన 56 ఏళ్ల వ్యక్తికి కూడా కోవిడ్‌ సోకింది. వీరందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.

తొలి బాధితుడు ఇప్పటికే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా మిగిలిన 32 మంది గాంధీ, ఛాతీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కోవిడ్‌ రెండో దశ ప్రారంభం కావడంతో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఇటీవలే దుబాయ్‌ నుంచి వచ్చిన సికింద్రాబాద్‌ వ్యాపారికి, ఆయన భార్యకు కోవిడ్‌ సోకగా.. వారి నుంచి వారి కుమారుడికి కూడా వైరస్‌ సోకింది. దీంతో లోకల్‌ కాంటాక్ట్‌ మొదలైతే, అది మూడో కాంటాక్ట్‌కు దారితీసే ప్రమాదం పొంచి ఉంది.

ప్రజారోగ్యానికి భంగం కలిగిస్తే జైలుకే..
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరూ 14 రోజుల పాటు కచ్చితంగా ఐసోలేషన్‌లో ఉండాల్సిందేనని, అలా కాకుండా ప్రజారోగ్యానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ హెచ్చరించారు. కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలో కోవిడ్‌తో ఒక్కరూ చనిపోలేదని, ఎవరు కూడా వెంటిలేటర్‌పై లేరని తెలిపారు. అందరి ఆరోగ్యం బాగుందని, కోలుకుంటున్నారని చెప్పారు. 14 రోజుల తర్వాత మళ్లీ పరీక్షలు నిర్వహించి, నెగెటివ్‌ వచ్చిన తర్వాత డిశ్చార్జ్‌ చేస్తామన్నారు. చికిత్స జరుగుతున్న చోట కూడా కొందరు సౌకర్యాలు మరిన్ని కావాలని కోరుతున్నారని, ఇదేం ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ కాదని పేర్కొన్నారు.(లాక్‌డౌన్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు)

రోగికి ఏది అవసరమో అది అందజేస్తామన్నారు. ఆర్థికంగా నష్టపోతున్నా, ఇబ్బంది కలుగుతున్నా అందరూ ఇళ్లలోనే ఉండాలని సీఎం కోరినట్లు పేర్కొన్నారు. కానీ కొందరు బయటకు వస్తున్నారని, జీవితం ముఖ్యమో.. ప్రాణం ముఖ్యమో.. రాష్ట్రాన్ని రక్షించుకోవడం ముఖ్యమో.. బయటకెళ్లి పనిచేసుకోవడం ముఖ్యమో తేల్చుకోవాలని మండిపడ్డారు. విదేశాల నుంచి వచ్చినవారికి చేతిపై ముద్ర వేశామన్నారు. వారు ఇంట్లో ఉండకుండా బయట తిరుగుతున్నారని చెప్పారు. కొత్తగూడెం డీఎస్పీ కుమారుడు బయట తిరిగినట్లు గుర్తించామన్నారు. ప్రజల మధ్య తిరిగి వారికి అంటించే ప్రయత్నం చేయడం సరికాదని చెప్పారు. ఆరు వేల బృందాలను పెట్టి వారి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నామని వివరించారు. అలాంటి వారు బయట తిరిగితే చుట్టుపక్కల వారు, ప్రజలు అడ్డుకుని, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్‌ చేస్తున్నట్లు తెలిపారు. సాధారణ సర్జరీలు కూడా ఆపేశామని చెప్పారు. అత్యవసర సేవలు కొనసాగుతాయని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేస్తున్న డాక్టర్ల నుంచి క్లాస్‌ 4 కార్మికుల దాకా అందరూ విధుల్లో ఉండాలని కోరారు. గాంధీ, సీసీఎంబీ సహా మరో 5 ల్యాబుల్లో కోవిడ్‌ పరీక్షలు చేసేందుకు అనుమతి వచ్చిందని తెలిపారు. ఫీవర్‌ హాస్పిటల్, సీసీఎంబీలో ట్రయల్‌ కూడా మొదలైందని, కిట్లు వస్తే పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయన్నారు.

కార్పొరేట్‌ ఆస్పత్రుల సహకారం అవసరం..
కోవిడ్‌ నివారణలో కార్పొరేట్‌ ఆస్పత్రులు కూడా సహకరించాలని మంత్రి ఈటల కోరారు. సోమవారం తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం (టీషా) ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బంది కూడా సెలవులు పెట్టొద్దని, సహకరించాలని కోరామని, వారు ఆస్పత్రులకు రావడానికి అన్ని రకాల రవాణా వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. సమావేశంలో కిమ్స్‌ ఆస్పత్రి నుంచి డాక్టర్‌ భాస్కర్‌రావు, సన్‌షైన్‌ ఆస్పత్రి నుంచి డాక్టర్‌ గురువారెడ్డి హాజరయ్యారు. (కరోనా కరాళ నృత్యం)

మరిన్ని వార్తలు