గ్రేటర్‌లో పెరుగుతున్న‘కోవిడ్‌’

26 May, 2020 09:51 IST|Sakshi
మియాపూర్‌లోని కంటైన్‌మెంట్‌ జోన్‌

కింగ్‌కోఠిలో 15 మందికి.. చెస్ట్‌లో ముగ్గురికి పాజిటివ్‌

తాజాగా మరికొన్ని కేసులు నమోదు...

సాక్షి, సిటీబ్యూరో:  తెలంగాణలోని ఇతర జిల్లాలతో పోలిస్తే గ్రేటర్‌ హైదరాబాద్‌పై కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. ఇప్పటి వరకు 1,275 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా  47 మంది మృతి చెందారు.  చికిత్స తర్వాత 670 మంది కోలుకున్నారు.  తాజాగా సోమవారం కింగ్‌కోఠి ఆస్పత్రి ఓపీకి 92 మంది రాగా వీరిలో 29 మందిని ఇన్‌పేషంట్లుగా అడ్మిట్‌ చేశారు. 26 మంది నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపారు. ఐసోలేషన్‌ వార్డులో ఉన్నవారిలో 15 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా..వారిని గాంధీకి తరలించారు. నెగిటివ్‌ వచ్చిన 24 మందిని డిశ్చార్జ్‌ చేశారు. మరో ముగ్గురి రిపోర్టులు ఇంకా రావల్సి ఉంది. ఫీవర్‌ ఆస్పత్రికి కొత్తగా మరో 12 మంది అనుమానితులు వచ్చారు. ప్రస్తుతం ఇక్కడ 16 మంది ఉన్నారు. ఛాతి ఆస్పత్రి ఐసోలేషన్‌లో ఉన్న ముగ్గురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, వారిని గాంధీకి తరలించారు. తాజాగా మరో 14 మంది అనుమానితులను ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో అడ్మిట్‌ చేశారు. ఇక ఆయుర్వేద ఆస్పత్రిలో ఉన్న 11 మందిలో ఐదుగురికి నెగిటివ్‌ రావడంతో డిశ్చార్జ్‌ చేశారు. మిగిలిన వారి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది.  

ఇందిరానగర్‌లో వృద్ధుడికి..
అడ్డగుట్ట: లాలాగూడ పోలీస్‌స్టేషన్‌  పరి«ధిలోని ఇందిరా నగర్‌లో ఓ వృద్ధుడు కరోనా బారిన పడ్డాడు. నార్త్‌లాలాగూడ ఇందిరానగర్‌కు చెందిన  వ్యక్తి (81) రైల్వే రిటైర్డ్‌ ఉద్యోగి. ఈ నెల 18న తెల్లవారుజామున 3 గంటల సమయంలో బాత్‌రూమ్‌లో ప్రమాదవశాత్తు పడ్డాడు. దీంతో అతని కాలికి ఫ్రాక్చర్‌ అయింది. చికిత్స నిమిత్తం మెడికేర్‌ ఆస్పత్రికి తరలించారు. కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌ తేలింది. వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు.  దీంతో అతని కుమారుడు, కోడలు, ముగ్గురు మనవరాళ్లను ఎస్‌ఆర్‌ నగర్‌లోని ఆయుర్వేదిక్‌ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఇంట్లో అద్దెకు ఉంటున్న 8 మందిని హోం క్వారైంటన్‌ చేసినట్లు లాలాగూడ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు..
గచ్చిబౌలి:  వర్క్‌ ఫ్రం హోమ్‌లో ఉన్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. కొండాపూర్‌ డివిజన్‌లోని రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉండె సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌(38) మార్చి 22 నుంచి వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నాడు.  కొద్ది రోజులుగా దగ్గు, జలుబుతో బాధపడుతున్నాడు. అనుమానంతో ఆదివారం చెస్ట్‌ ఆస్పత్రిలో పరీక్షలు చేయగా కనోనా పాజిటివ్‌ అని తేలింది.  దీంతో అధికారులు అతని భార్య, కొడుకు, కూతురు, తమ్ముడు, భావ మరిది, చెల్లెలును పరీక్షల నిమిత్తం ఆయుర్వేద అస్పత్రికి తరలించారు.  ఇంట్లోనే విధులు నిర్వహించే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు ఎలా కరోనా పాజిటివ్‌ వచ్చిందనే కోణంలో పరిశీలిస్తున్నారు. 

బోరబండలో మహిళకు..
వెంగళరావునగర్‌: బోరబండ డివిజన్‌ పరిధిలోని బంజారానగర్‌బస్తీలో ఓ మహిళ (41)కు పాజిటివ్‌ వచ్చింది.  మూడు రోజుల  క్రితం ఈమె కుమారుడికి పాజిటివ్‌ రాగా అతనిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులకు ఛాతీ ఆస్పత్రిలో చికిత్స చేస్తుండగా తల్లికి సోమవారం పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 

ఎర్రగడ్డ డివిజన్‌లో మహిళకు  కరోనా పాజిటివ్‌
జూబ్లీహిల్స్‌: ఎర్రగడ్డ డివిజన్‌లో  ఓ మహిళకు   కరోనా సోకింది. దీంతో అధికారులు ఆమె కుటుంబంలోని 12మంది సభ్యులకు పరీక్షలు నిర్వహించారు.   

వాచ్‌మెన్‌ దంపతులకు..
హఫీజ్‌పేట్‌ : మియాపూర్‌ మాతృశ్రీనగర్‌కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్,  ఆయన భార్యకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.దీంతో అధికారులు ఆ అపార్ట్‌మెంట్‌ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. పరిసరాలను సోడియం హైపోక్లోరైడ్‌ను ట్యాంకర్‌ ద్వారా రోడ్లపై చల్లారు.  అపార్ట్‌మెంట్‌ వాసులందరిని హోం క్వారంటైన్‌ కింద ఇంట్లోనే ఉండాలని వైద్యాధికారులు ఆదేశించారు. వారి కుటుంబసభ్యులు ఏడుగురిని ఛాతీ ఆస్పత్రికి తరలించారు.  

గోషామహాల్‌ 14వ సర్కిల్‌లో ఓ ఉద్యోగికి
అబిడ్స్‌: గోషామహాల్‌ జీహెచ్‌ఎంసీ 14వ సర్కిల్‌ పరిదిలో ఓ ఉద్యోగి(60)కి కరోనా పాజిటీవ్‌ నిర్ధారణ అయ్యింది. బేగంబజార్‌ బేజర్‌వాడిలో నివసించే అతను నాంపల్లి సమీపంలో ఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. అతనికి కరోనా పాజిటివ్‌ రావడంతో అతని కుటుంబ సభ్యులందరినీ అధికారులు హోం క్వారంటైన్‌ చేశారు. 

జియాగూడలో ఒకరు మృతి
జియాగూడ:  జియాగూడలో సోమవారం ఓ వృద్ధురాలు కరోనాతో మృతి చెందారు. జియాగూడలోనే లక్ష్మీనరసింహానగర్‌లో ఓ వృద్ధురాలు(75) కరోనా పాజిటీవ్‌తో చికిత్సలు పొందుతూ మృతిచెందింది. అలాగే మరొకరికి పాజిటీవ్‌ రావడంతో గాంధీలో చికిత్సలు పొందుతున్నారు. కార్వాన్‌లోని కుమ్మరివాడిలో కూడా ఒకరికి పాజిటివ్‌ వచ్చింది.  

అంబర్‌పేటలో ఆరుగురికి పాజిటివ్‌
అంబర్‌పేట: అంబర్‌పేట సర్కిల్‌లో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.  ముంబయ్‌ వెళ్లి వచ్చిన కానిస్టేబుల్‌ కుటుంబం అతనితో సన్నిహితంగా మెలిగినవారికి కరోనా సోకింది.వీరిని గాంధీకి తరలించారు.

పోలీస్‌ కానిస్టేబుల్‌కు..
చాంద్రాయణగుట్ట:  శివగంగానగర్‌లో నివాసం ఉంటున్న సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌ గాంధీ ఆసుపత్రి వద్ద విధి నిర్వహణలో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే కరోనా లక్షణాలతో రెండు రోజుల క్రితం కింగ్‌ కోఠి ఆసుపత్రిలో చేరాడు. అతన్ని పరీక్షించగా చివరకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆదివారం అతన్ని గాంధీకి తరలించారు. అతని  కటుంబ సభ్యులందరిని హోం క్వారంటైన్‌ చేశారు.ఇదిలా ఉండగారక్షాపురం కుమ్మర్‌వాడీలో ఓ పోలీస్‌అధికారికి, రాజనర్సింహ్మానగర్‌లోనిఓ వ్యక్తికి, జహంగీరాబాద్‌లోని ఓ కుటుంబం కూడా కరోనా బారిన పడింది.

మరిన్ని వార్తలు