గ్రేటర్‌లో అదే కలవరం

27 May, 2020 08:38 IST|Sakshi
గొల్లకిడికి ప్రాంతాన్ని మూసివేసిన అధికారులు

మంగళవారం మరో 38 పాజిటివ్‌ కేసులు

బీజేఆర్‌ నగర్‌లో కరోనాతో వృద్ధురాలి మృతి

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ పరిధిలో కరోనా విజృంభణ ఆగడం లేదు. ప్రతి రోజూ పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో వైరస్‌ శరవేగంగా విస్తరిస్తోంది. మంగళవారం తాజాగా మరో 38 కేసులు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే..

గౌలిపురాలో మరో మూడు పాజిటివ్‌ కేసులు   
యాకుత్‌పురా: పాతబస్తీ గౌలిపురా డివిజన్‌లో మంగళవారం మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అధికారుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గౌలిపురా బుజ్జొల బావి బుడిదగడ్డ ప్రాంతానికి చెందిన వ్యక్తి (50), అతని భార్య (45), కుమారుడు (21) ఇటీవల బొరబండలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లి వచ్చారు. అయితే గత రెండు రోజులుగా వారు ముగ్గురికి తీవ్ర జ్వరం రావడంతో ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రికి వెళ్లారు. మంగళవారం పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యులు వీరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

కింగ్‌కోఠి ఆసుపత్రిలో ఇద్దరికి..
సుల్తాన్‌బజార్‌: కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలో మంగళవారం 97 మంది ఓపీలో స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహించిన అధికారులు 19 మందికి వైద్యులు అడ్మిషన్లు ఇచ్చారు. రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌ రావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు.  

గోషామహల్‌లో మరొకరికి...  
అబిడ్స్‌: గోషామహల్‌ జీహెచ్‌ఎంసీ 14వ సర్కిల్‌లో మరో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మచిలిపురా ప్రాంతానికి చెందిన యువకుడు(20) గత కొన్ని రోజులుగా తీవ్ర జ్వరం, గొంతు నొప్పి, జలుబుతో బాధపడుతూ గాంధీ ఆసుపత్రికి వెళ్లాడు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా అతడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అతడిని ఆసుపత్రిలో చేర్చుకున్న అధికారులు కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌ చేశారు. 

మల్కాజిగిరిలో మహిళకు..
మల్కాజిగిరి: మల్కాజిగిరి వసంతపురి కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న మహిళ(48) గత కొంత కాలంగా దగ్గు, జలుబుతో బాధపడుతోంది. సోమవారం ప్రభుత్వ చెస్ట్‌ ఆస్పత్రికి వెళ్లగా పరీక్షించిన వైద్యులు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు సదరు మహిళ ఉంటున్న అపార్ట్‌మెంట్‌ను కంటైన్‌మెంట్‌గా ప్రకటించారు.  

గొల్లకిడికిలో మహిళకు..
దూద్‌బౌలి: పాతబస్తీలోని గొల్లకిడికి దేవిబాగ్‌ ప్రాంతానికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.  స్థానిక పోచమ్మ దేవాలయం ప్రాంతానికి చెందిన మహిళ (70) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌గా ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులను హోమ్‌ క్వారంటైన్‌ చేశారు.  

గుడిమల్కాపూర్‌ హీరానగర్‌లో గర్భిణికి..
అబిడ్స్‌: గుడిమల్కాపూర్‌ హీరానగర్‌కు చెందిన గర్భిణి(29)కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. సోమవారం ఆమె నిలోఫర్‌ ఆసుపత్రికి  వెళ్లి పరీక్షలు చేయించుకుంది. మంగళవారం ఆమెకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో  అధికారులు ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యులు ఐదుగురిని క్వారంటైన్‌ కోసం సరోజిని ఆసుపత్రికి తరలించారు.

నాచారం రాఘవేంద్రనగర్‌లో ఒకరికి..
మల్లాపూర్‌: నాచారం రాఘవేంద్రనగర్‌కు చెందిన ఓ వ్యక్తి (40)కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు కాప్రా సర్కిల్‌ అధికారులు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలోని స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న అతను రెండు రోజులుగా  జలుబు, జ్వరంతో బాధపడుతుండటంతో గాంధీకి తరలించారు. పరీక్షలునిర్వహించగా కరోనా పాజి టివ్‌గా నిర్ధారణ అయింది. అతడి కుటుంబ సభ్యులను కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.  

బీజేఆర్‌నగర్‌లో వృద్ధురాలి మృతి
ఖైరతాబాద్‌: ఖైరతాబాద్‌ డివిజన్‌ బీజేఆర్‌నగర్‌లో ఓ వృద్ధురాలు(62) కరోనాతో మృతి చెందింది. బీజేఆర్‌నగర్‌కు చెందిన వృద్ధురాలు మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఫీవర్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వైద్యుల సూచనమేరకు ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందినట్లు సైఫాబాద్‌ పోలీసులు తెలిపారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పది మందిని  హోం క్వారంటైన్‌ చేశారు.

మరిన్ని వార్తలు