రోజురోజుకూ.. పెరుగుతున్న కరోనా కేసులు

1 Jun, 2020 08:47 IST|Sakshi
రామంతాపూర్‌ ప్రగతినగర్‌లోని కంటెయిన్‌మెంట్‌ జోన్‌ ప్రాంతం

గ్రేటర్‌లో 122 కేసులు నమోదు

జిల్లా ఆస్పత్రిలో 63 కేసుల నిర్ధారణ

జియాగూడపై కరోనా పంజా  

ఉలిక్కిపడిన కంటోన్మెంట్‌..

లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో కరోనా వికృత నృత్యం చేస్తోంది. రోజు రోజుకూ రెచ్చిపోతూ ఉగ్రరూపం దాలుస్తున్నది. ప్రతి రోజు పెరుగుతున్న కేసులతో నగరవాసులు భయకంపితులవుతున్నారు. ప్రస్తుతం నగరంలో వర్షం పడుతూ, వాతావరణం చల్లబడిన నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కాగా ఆదివారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 122  కేసులు నమోదయ్యాయి.

శేరిలింగంపల్లిలో మరో ముగ్గురు..
గచ్చిబౌలి: శేరిలింగంపల్లి సర్కిల్‌ పరిధిలో మరో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. బొటానికల్‌ గార్డెన్‌ సమీపంలోని ఓ విల్లాలో నివాసముంటున్న వ్యక్తి (45)కు కరోనా అని తేలడంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గచ్చిబౌలి ఇందిరానగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉండే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ (27)కు పాజిటివ్‌ రావడంతో కింగ్‌ కోఠి ఆస్పత్రిలో చేర్చారు. గచ్చిబౌలి టెలికాంనగర్‌లో నివాసముండే ఓ కానిస్టేబుల్‌ (28)కు కరోనా పాజిటివ్‌గా తేలింది.

అఫ్జల్‌గంజ్‌లో ఇద్దరికి..
అఫ్జల్‌గంజ్‌: అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఉస్మాన్‌గంజ్‌లో నివాసముండే ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆదివారం ఇద్దరిని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు అఫ్జల్‌గంజ్‌ ఇన్స్‌పెక్టర్‌ పీజీ రెడ్డి తెలిపారు.

క్యాబ్‌ డ్రైవర్‌కు పాజిటివ్‌ ..
మేడ్చల్‌: నాగారం మున్సిపాలిటీ పరిధిలోని వెస్ట్‌గాంధీనగర్‌కు చెందిన ఓ క్యాబ్‌ డ్రైవర్‌ (25)కు కరోనా పాజిటివ్‌గా తేలింది.  కొన్ని రోజులుగా క్యాబ్‌ నడుపుతూ అతను నగరమంతా తిరిగాడు. ఇటీవల అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఫీవర్‌ ఆసుపత్రికి తరలించారు. పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అధికారులు వెస్ట్‌ గాంధీనగర్‌ను కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు.

అడ్డగుట్టలో ఒకరు..
అడ్డగుట్ట: అడ్డగుట్టలోని అజాద్‌ చంద్రశేఖర్‌ నగర్‌లో ఓ వ్యక్తి కరోనా బారినా పడ్డాడు. ఎసీఎస్‌నగర్‌లోని పోచమ్మ దేవాలయం సమీపంలో నివాసముంటున్న వ్యక్తి(35)కి కరోనా సోకింది. ఇటీవల అతను అడ్డగుట్టలో ఓ విందుకు వెళ్లొచ్చినప్పటి నుంచి అనారోగ్యానికి గురికావడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనాగా నిర్దారణ అయింది. 

దూద్‌బావిలో యువకుడికి..
చిలకలగూడ: మెట్టుగూడ డివిజన్‌ దూద్‌బావికి చెందిన ఓ యువకుడు (25)కి కరోనా అని తేలింది. ఓ ఆన్‌లైన్‌ షాపింగ్‌ పోర్టల్‌లో అతను సేల్స్‌ ఇన్‌చార్జిగా పని చేస్తున్నాడు. ఈనెల 29న జ్వరం రావడంతో కింగ్‌కోఠి ఆస్పత్రికి వెళ్లి నమూనాలు ఇచ్చాడు. నివేదికలో కరోనా పాజిటివ్‌ అని రావడంతో గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యాడు. చిలకలగూడ ఠాణా పరిధిలో ఇప్పటి వరకు 18 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందగా, 13 మంది  డిశ్చార్జీ కాగా మిగిలిన నలుగురు చికిత్స పొందుతున్నారు. 

కూరగాయల వ్యాపారికి..
కాచిగూడ: కూరగాయలు విక్రయించే ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. హిమాయత్‌నగర్‌ డివిజన్‌ ముత్యాలబాగ్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి 45  రోజులుగా దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు నాంపల్లిలోని కేర్‌ హాస్పిటలో పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతని కుమార్తెకు సైతం కరోనా లక్షణాలు ఉండడంతో అమీర్‌పేటలోని నేచర్‌క్యూర్‌ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. భార్య, కుమారుడిని హోం క్వారంటైన్‌ చేశారు.  

మరో కానిస్టేబుల్‌కు..    
అబిడ్స్‌: నగరంలోని సీఎస్‌డబ్ల్యూ వింగ్‌లో పనిచేస్తున్న ఓ పోలీసు కానిస్టేబుల్‌ (27)కు కరోనా సోకింది. ధూల్‌పేట్‌ జిన్సీచౌరాహీలో నివసించే కానిస్టేబుల్‌ లాక్‌డౌన్‌లో పాతబస్తీలో వలస కూలీలను తరలించడంలో విధులు నిర్వహించాడు. దీంతో అతనికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని కుటుంబ సభ్యులు అధికారులకు వివరించారు. కొన్ని రోజులుగా తీవ్ర జ్వరం, గొంతునొప్పి ఉండడంతో అధికారులు అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కానిస్టేబుల్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులను  హోం క్వారంటైన్‌ చేశారు. 

గోషామహల్‌లో ముగ్గురు..
గోషామహాల్‌ జీహెచ్‌ఎంసీ సర్కిల్‌–14 పరిధిలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గోషామహల్‌ పరిధిలోని గోడేకికబర్‌ ప్రాంతంలో నివసించే ఓ మహిళ (52)కు వారం రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా తేలగా ఆమె ఇంటిలోని కుటుంబ సభ్యులను అధికారు లు క్వారంటైన్‌ చేశారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఆమె కుమారుడు, తండ్రి, కూతురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  

డాక్టర్‌కు కరోనా..  
రామంతాపూర్‌: రామంతాపూర్‌ ప్రగతినగర్‌కు చెందిన ఉస్మానియా ఆస్పత్రిలో ఆర్థోపెడిక్‌ సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్న వైద్యుడు (30)కి ఆదివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. 11 మంది కుటుంబ సభ్యులను హోం క్వారెంటైన్‌లో ఉంచిన అధికారులు, ఈ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. 

మల్లాపూర్‌ ఎస్వీనగర్‌లో..
మల్లాపూర్‌: డివిజన్‌ పరిధిలోని ఎస్వీనగర్‌లో అద్దెకు ఉంటూ మేడిపల్లిలోని ఓ కాలనీలో వాచ్‌మెన్‌గా పని చేస్తన్న ఓవ్యక్తి (35)కి కరోనా సోకింది. వారం నుంచి తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబు రావడంతో కింగ్‌ కోఠి ఆస్పత్రికి వెళ్లగా పాజిటివ్‌గా తేలింది. 

జియాగూడను వదలని మహమ్మారి..
జియాగూడ: పహాడిషరీఫ్‌లో నిలసముండే ఓ మటన్‌ వ్యాపారి ఇంటిలో జరిగిన విందులో పాల్గొన్న వారిలో జియాగూడకు చెందిన 16 మందికి కరోనా సోకింది. జియాగూడలోని ఇందిరానగర్, గంగానగర్, కేశస్వామినగర్, వాల్మీకినగర్‌కు చెందిన వారు వేడుకకు హాజరయ్యారు.  కాగా ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో వారికి కోవిడ్‌గా నిర్ధారణ అయింది. అలాగే డివిజన్‌లోని దరియాబాగ్, కార్గిళ్, న్యూ గంగానగర్‌లలో ఉంటున్న ముగ్గురు పోలీసులు, కుల్సుంపురాలోని ఓ కానిస్టేబుల్‌ కరోనా బారినపడ్డారు.

కింగ్‌కోఠి @ 63
సుల్తాన్‌బజార్‌: కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలో ఆదివారం 63 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆసుపత్రి ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ టి.శంకర్‌ తెలిపారు. ఆదివారం కరోనా లక్షణాలతో 97 మంది ఓపీకి రాగా 15 మందిని అడ్మిట్‌ చేసుకున్నారు. 22 మంది రక్త నమూనాలు సేకరించారు. గతంలో రక్త నమూనాలు సేకరించిన వారిలో 23 మందికి నెగెటివ్‌ రాగా వారిని డిశ్చార్జ్‌ చేశారు. 63 మందిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.   

ఇద్దరు వృద్ధులు మృతి
ఖైరతాబాద్‌: డివిజన్‌ పరిధిలోని గాంధీనగర్‌లో కరోనా లక్షణాలతో ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న  ఓవ్యక్తి (72) ఆదివారం మృతి చెందాడు. మూడు రోజులుగా కరోనా లక్షణాలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆయన చికిత్స పొందుతున్నాడు. ఆనంద్‌నగర్‌ కాలనీలో నివాసముండే 62 సంవత్సరాల వ్యక్తి గత కొద్ది రోజులుగా కరోనా లక్షణాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

కంటోన్మెంట్‌లో కలకలం 
కంటోన్మెంట్‌:  జోన్‌ పరిధిలో ఆదివారం నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో స్థానికులు ఉలికిపడ్డారు. కార్ఖానా పీ అండ్‌ టీ కాలనీలోని ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో కంటోన్మెంట్‌ అధికారులు ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా మార్చారు. కాలనీని పూర్తిగా సానిటైజ్‌ చేశారు.  పీ అండ్‌ టీ కాలనీలో నివాసముంటే 54 ఏళ్ల వ్యక్తి హిమాయత్‌నగర్‌లో మెడికల్‌ షాపు నిర్వహిస్తూ ఉంటాడు. రెండు వారాల క్రితం (మే 17న) ముషీరాబాద్‌లోని చేపల మార్కెట్‌కు వెళ్లి చేపలు తీసుకుని వచ్చాడు. గత సోమవారం నుంచి అతను తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. గురువారం నాటికి అతని భార్య, ఇద్దరు కుమార్తెలకు  జ్వరం సోకడంతో 100కు డయల్‌ చేసి, కరోనా లక్షణాలున్నట్లు ఫిర్యాదు చేశారు. స్పందించిన కార్ఖానా పోలీసులు కింగ్‌ కోఠి ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. ఆదివారం
వెల్లడైన ఫలితాల్లో ఆ నలుగురికీ కరోనా పాజిటివ్‌గా తేలింది.

మరిన్ని వార్తలు