నిమ్స్‌లో ట్రయల్స్‌ షురూ

21 Jul, 2020 01:49 IST|Sakshi

తొలిరోజు ఇద్దరికి వ్యాక్సిన్‌.. రేపు మరో ఆరుగురికి.. 

24 గంటల పాటు ఐసీయూలో ఉంచి వైద్యుల పర్యవేక్షణ

ఆపై వ్యాక్సిన్‌ పనితీరు, యాంటీబాడీస్‌ వృద్ధిపై అంచనా

14 రోజుల తర్వాత రెండో డోస్‌ ఇవ్వనున్నట్లు వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌కు దేశీయంగా తొలి వ్యాక్సిన్‌ తయారీలో ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ ఇంట ర్నేషనల్‌ మరో ముందడుగు వేసింది. తాము అభి వృద్ధి చేస్తున్న ‘కోవాగ్జిన్‌’ను మనుషులకు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే ఎయిమ్స్‌ (పాట్నా) సహా రోహతక్‌ (హరియాణా)లో హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించిన ఆ సంస్థ తాజాగా సోమవారం హైదరాబాద్‌లోని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌)లోనూ మనుషులపై టీకాను ప్రయోగిం చింది. సోమవారం ఇద్దరు వలంటీర్లకు మూడు మైక్రోగ్రాముల చొప్పున వ్యాక్సిన్‌ ఇచ్చారు.

24 గంటల పాటు వీరిని ఆస్పత్రి ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, ఆ తర్వాత డిశ్చార్జి చేస్తారు. బయట తిరిగితే ఇన్‌ఫెక్షన్‌ బారినపడే ప్రమాదం ఉండటంతో వీరిని పూర్తిగా ఇంటికే పరి మితం చేయనున్నారు. వైద్యులు వీడియో కాల్‌లో రోజూ వలంటీర్ల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తారు. ఈ సమయంలో వీరికి అవసరమైన పౌష్టికాహారం సహా అన్ని రకాల మందులను అందజేస్తారు. 14 రోజుల తరువాత శరీరంలో యాంటీబాడీస్‌ ఏ మేరకు వృద్ధి చెం దాయి? వ్యాక్సినేషన్‌ తర్వాత ఏమైనా అనారోగ్య సమస్యలు తలెత్తాయా? వంటివి విశ్లేషించి, వచ్చే ఫలితాలను బట్టి వీరికి అదే బ్యాచ్‌కి చెందిన ఆరు మైక్రో గ్రాముల చొప్పున రెండో డోస్‌ ఇవ్వనున్నారు. మంగళవారం మరో ఆరుగురికి వ్యాక్సిన్‌ ఇచ్చే అవకాశం ఉంది.

ఇక్కడ మూడో ప్రయోగం..
కరోనా వైరస్‌కు విరుగుడుగా వ్యాక్సిన్‌ తెచ్చేందుకు అంతర్జాతీయంగా వందకుపైగా ఫార్మా కంపెనీలు పోటీపడుతున్నాయి. ఆయా దేశాలు వ్యాక్సిన్ల తయారీపై చేస్తున్న పరిశోధనలు వివిధ దశల్లో ఉన్నాయి. చైనా, బ్రిటన్‌ తదితర దేశాలకు చెందిన ఫార్మా కంపెనీలు సెప్టెంబర్‌లోగా వ్యాక్సిన్‌ తేనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. దేశీయ ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్స్‌ మాత్రం అంతకంటే ముందే (అక్టోబర్‌) వ్యాక్సిన్‌ తీసుకొస్తామని ప్రకటించింది. భారత వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్‌), పూణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) సహకారంతో భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ టీకాను అభివృద్ధి చేస్తోంది.

ఇందుకోసం నిమ్స్‌ సహా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 12 పరిశోధన కేంద్రాల్లో ఇప్పటికే 375 మంది వలంటీర్లపై ర్యాండమైజ్డ్‌ డబుల్‌ బ్లెండ్, ప్లాసిబో కంట్రోల్డ్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను ప్రారంభించింది. జూలై 15న పాట్నా ఎయిమ్స్‌లో, 17న హరియాణాలోని రోహతక్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ముగ్గురికి వ్యాక్సిన్‌ ఇవ్వగా, ఎలాంటి దుష్ఫలితాలు కనిపించలేదు. దీంతో తాజాగా నిమ్స్‌లో ఇద్దరు వలంటీర్లకు తొలి డోస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు కోవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ సి.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మిలీనియం బ్లాక్‌ 6వ అంతస్తులోని నిమ్స్‌ క్లినికల్‌ ఫార్మాకాలజీ విభాగం ఈ టీకా ప్రయోగాన్ని నిర్వహిస్తోంది. కాగా, నిమ్స్‌లో ప్రయోగానికి ఇప్పటి వరకు 60 మంది వలంటీర్లను ఎంపిక చేశారు. వీరికి కరోనా సహా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న వారి పేర్లను ఐసీఎంఆర్‌కు పంపి, ఫిట్‌నెస్‌ అనుమతి వచ్చాకే వారికి వ్యాక్సిన్‌ డోస్‌ ఇస్తారు.