మాట వినకపోతే కనిపిస్తే కాల్చివేత!

24 Mar, 2020 20:14 IST|Sakshi

మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించకుండా రోడ్లపైకి వచ్చిన వారిని కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. ప్రజలు సహకరించకుంటే షూట్‌ ఎట్ సైట్ ఆర్డర్స్‌(కనిపిస్తే కాల్చివేత) ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. పోలీసులకు సహకరించకుండా.. ఆర్మీని రంగంలోకి దించే పరిస్థితి తెచ్చుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ నివారణకు చేపట్టిన చర్యలు, లాక్‌డౌన్‌ పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ మంగళవారం ప్రగతి భవన్‌లో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..అగ్రరాజ్యమైన అమెరికాలో స్థానిక పోలీసులు కంట్రోల్ చేయలేక ఆర్మీని పిలిపించారని, రాష్ట్రంలో ప్రజలు సహకరించకపోతే 24 గంటల కర్ఫ్యూ పెట్టాల్సి ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ ఇంకా ఏమన్నారంటే..

ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు
రాష్ట్రంలో ఇప్పటి వరకు 36 కరోనావైరస్‌ కేసులు నమోదు అయ్యాయి. ఒకరి డిశ్చార్జ్‌ అయ్యారు. మిగిలిన వారంతా కోలుకుంటున్నారు. వారంతా ఏప్రిల్‌ 7 కల్లా డిశ్చార్జ్‌ అవుతారు.  రాష్ట్రంలో 114 మంది కరోనా అనుమానితులు ఉన్నారు. స్వతహాగా నియంత్రణ పాటించి ఎక్కడి వారు అక్కడ ఉండాలి. రాష్ట్రంలో 19,313 మందిపై నిఘా ఉంది. నిఘాలో ఉన్న వ్యక్తుల పాస్‌పోర్టులు సీజ్‌ చేయాలని చెప్పాం. అప్రమత్తతే మనల్ని కాపాడుతుంది. ప్రజలు వందశాతం సహకరించాలి. అమెరికా లాంటి దేశంలో కూడా ఆర్మీని రంగంలోకి దించారు. పరిస్థితి చేయిదాటితే షూట్‌ ఎట్‌ సైట్‌ ఆర్డర్‌ ఇవ్వాల్సి వస్తుంది. ప్రజలు సహకరించకుంటే ఆర్మీని దించాల్సి వస్తుంది. షూట్‌ ఎట్‌సైట్‌ ఆర్డర్స్‌ పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. జాగ్రత్తగా ఉండి ప్రభుత్వానికి సహకరించాలి.

ఏ ఊరి సర్పంచ్‌ ఆ ఊరి హీరో కావాలి
ఇలాంటి కష్టకాలంలో ప్రజాప్రతినిధులు ప్రజల కోసం పనిచేయాలి. శాసన సభ్యులు, కార్పొరేటర్లు పోలీసులకు సహాయం చేయాలి. మంత్రులంతా జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండాలి. ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లో ఉండాలి. ప్రతి చెక్‌పోస్ట్‌ వద్ద ప్రజాప్రతినిధులు ఉండాలి.  కొంత మంది మంత్రులు తప్ప అంతా జిల్లా హెడ్‌క్వార్టర్లకు వెళ్లాలి. ఏ ఊరి సర్పంచ్‌ ఆ ఊరి కథానాయకుడు కావాలి. ఎమ్మెల్యే ఆయన నియోజకవర్గానికి హీరో కావాలి. పోలీసులకు సహకరించాలి. నిబంధనలు పాటించని వారిని హెచ్చరించాలి. మన ప్రాణాలను మనమే కాపాడుకోవాలి.  మనకు కరోనా ప్రభావం అంతగాలేదు అయినా సీరియస్‌గా తీసుకుంటున్నాం. కరోనా సోకని దేశం లేదని రిపోర్టులు వచ్చాయి. అమెరికా లాంటి దేశంలో కూడా ఆర్మీని రంగంలోకి దించారు. పరిస్థితి చేయిదాటితే షూట్‌ ఎట్‌సైట్‌ ఆర్డర్‌ వస్తుంది. ప్రజలు సహకరించకుంటే ఆర్మీని దించాల్సి వస్తుంది. షూట్‌ ఎట్‌సైట్‌ ఆర్డర్స్‌ పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. 

అత్యవసరమైతే 100 కాల్‌ చేయండి
ఎదైనా అత్యవసర సమయంలో వేరే ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటే 100కు కాల్‌ చేయండి. అధికారులు స్పందిస్తారు. అవసరం అయితే పరిస్థితిని బట్టి వాహనాలు కూడా ఏర్పాటు చేస్తాం. రైతులు ఎవరూ అధైర్య పడొద్దు. ప్రతి పంటను ప్రభుత్వం కొంటుంది. మీ ఊర్లలోనే మీ పంటను అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తుంది. సహకార సంఘాలు కొనుగోలు చేస్తాయి. రైతుబంధు కమిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు అనుమతి ఇస్తాం. అక్కడ కూడా గుంపులు గుంపులుగా కాకుండా దూరం పాటించి కొనసాగించాలని చెబుతున్నాం. 

అధిక ధరలకు విక్రయిస్తే పీడీ యాక్ట్‌
అధిక ధరలకు కూరగాయలు అమ్మేవారిపై పీడీ యాక్ట్‌ పెట్టి దుకాణాలు సీజ్‌ చేసి జైలుకు పంపుతాం. దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉన్న సమయంలో వ్యాపారులు ఇలా ప్రవర్తిస్తారా? అత్యవసరం మినహా అన్ని రకాల దుకాణాలు సాయంత్రం 6 గంటల లోపే బంద్‌ చేయాలి. ఆ తర్వాత దుకాణం తెరిస్తే లైసెన్సులు రద్దు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం.

రాత్రి 7గంటల నుంచి ఉదయం 6గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ విధించాం. ఒక్కరు కూడా రోడ్డుపైకి రావడానికి వీల్లేదు. కరోనా వైరస్‌ఇప్పటికి అదుపులోనే ఉంది. మొత్తం రైలు, విమానాలు బంద్‌ అయ్యాయి.  కాబట్టి వేరే చోటు నుంచి జబ్బు వచ్చే అవకాశం లేదు. చాలా మంది తమ కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నారు. వారందరిని అభినందిస్తున్నా. 

టీవీల్లో చర్చ పెట్టాలి
కరోనావైరస్‌ కట్టడికి మీడియా కూడా చక్కగా సహకరిస్తోంది. ప్రజలను చైతన్యవంతం చేస్తోంది. కవులు, గాయకులు టీవిల్లో సమ్మెళనం పెట్టాలి. పేపర్లలో కరోనాపై కవితలు రాయాలి. ప్రజలను చైతన్యం తేచ్చే విధంగా పాటలు పాడాలని కోరుతున్నా. మీడియాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించరారు. మీడియాకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. కాబట్టి మీడియాను లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి. 

చదవండి►
తెలంగాణలో ఇంటింటి సర్వే

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు