గాంధీ X కార్పొరేట్‌

11 Apr, 2020 02:58 IST|Sakshi

ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ మృతిపై వివాదం..

ఆ మహిళకు కరోనా పాజిటివ్‌.. సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి నుంచి చివరి నిమిషంలో గాంధీకి తరలింపు

మహిళ మృతి.. గాంధీ వైద్యులు పట్టించుకోకపోవడం వల్లే: కార్పొరేట్‌ ఆస్పత్రి అంబులెన్స్‌ టెక్నీషియన్‌

చనిపోయాకే తీసుకొచ్చారని ‘గాంధీ’ సూపరింటెండెంట్‌ వివరణ..  

సాక్షి, హైదరాబాద్‌/గాంధీ ఆసుపత్రి: కరోనా వైరస్‌తో మరో మహిళ మృతి చెందినట్లు తెలిసింది. శుక్రవారం ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన మరో మహిళ (54) హైదరాబాద్‌లో చనిపోయింది. అయితే, దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటనా రాలేదు. ఇదిలాఉండగా.. ఈమె మృతిపై వివాదం రేగింది. గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకోకపోవడం వల్లే చనిపోయిందని కార్పొరేట్‌ ఆస్పత్రికి చెందిన అం బులెన్స్‌ టెక్నీషియన్‌ చెబుతుంటే.. చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకొచ్చి అడ్మిట్‌ చేసుకొమ్మంటే ఎలా చేసుకుంటామని గాంధీ ఆస్పత్రి వర్గాలు ప్రశ్నించాయి. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి ప్రత్యేక బాక్స్‌లో భద్రపరిచారు.  

అసలేమైందంటే..? 
ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన మహిళ (54) కూకట్‌పల్లి ప్రగతినగర్‌లో ఉంటున్న తన కుమారుడి ఇంటికి లాక్‌డౌన్‌కు ముందే వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమెను చికిత్స కోసం ఇటీవల సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో అడ్మిట్‌ చేశారు. కరోనా లక్షణాలు కన్పించడంతో వైద్యులు ఆమెను ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. రెండ్రోజుల క్రితం ఆమె నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపారు. ఆమెకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు శుక్రవారం ఉదయం రిపోర్టు వచ్చింది. అప్పటికే ఆమె పరిస్థితి పూర్తిగా విషమించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉండటం శ్రేయస్కరం కాదని, గాంధీ కరోనా నోడల్‌ కేంద్రానికి తీసుకెళ్లాల్సిందిగా ఆ ఆస్పత్రి వైద్యులు ఆమె కుమారుడికి సూచించారు. ఇందుకు ఆయన అంగీకరించడంతో ఆస్పత్రికి చెందిన అంబులెన్స్‌లోనే గాంధీకి తరలించారు. ఈ సమయంలో ఆమె వెంట అంబులెన్స్‌లో బంధువులెవరూ లేరు. 

పట్టించుకోకపోవడం వల్లే మృతి: అంబులెన్స్‌ టెక్నీషియన్‌ 
గాంధీ వైద్యులు పట్టించుకోకపోవడం వల్లే రోగి మృతి చెందిందని కార్పొరేట్‌ ఆస్పత్రి అంబులెన్స్‌ టెక్నీషియన్‌ అన్నారు. ‘సికింద్రాబాద్‌లోని ఆస్పత్రి నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు పేషెంట్‌ను తీసుకుని అంబులెన్స్‌లో బయలుదేరాం. మధ్యాహ్నం ఒంటిగంటకు గాంధీ ఆస్పత్రికి చేరుకున్నాం. 2.30 గంటల వరకు ఎవరూ పట్టించుకోలేదు. దీంతో రోగి ఆయాసంతో బాధపడుతుండటంతో అప్పటికే సీపీఆర్‌ కూడా చేశాం. ఆస్పత్రి వైద్యులెవరూ రాకపోవడంతో రోగి తాలూకు మెడికల్‌ రిపోర్టులు తీసుకుని నేనే స్వయంగా డాక్టర్‌ వద్దకు వెళ్లాను. అటెండర్స్‌ ఎవరూ లేకుండా ఇలా ఎలా తీసుకొస్తారు..? పాజిటివ్‌ కేసును తీసుకురావడానికి మీరెవరూ? అంటూ ప్రశ్నించారు. సాయంత్రం 4 గంటల వరకు అక్కడే ఉన్నాను. బాడీని తీసుకునేందుకు ఎవరూ రాకపోవడంతో అంబులెన్స్‌ను అక్కడే వదిలేసి వచ్చాం..’అని చెప్పారు.

చనిపోయిన వారిని ఎలా అడ్మిట్‌ చేసుకుంటాం
‘మధ్యాహ్నం 3 గంటలకు ఆస్పత్రికి అంబులెన్స్‌ చేరుకుంది. రోగిని తరలించేందుకు వార్డు బాయ్స్‌ వెంటనే అంబులెన్స్‌ వద్దకు చేరుకున్నారు. ఎలాంటి చలనం లేనట్లు గుర్తించారు. ఇదే అంశాన్ని డ్యూటీ డాక్టర్లకు చెప్పారు. వారు కూడా వెంటనే వచ్చి చూశారు. అప్పటికే ఆమె చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని ఇక్కడికెందుకు తీసుకొచ్చారని అంబులెన్స్‌ డ్రైవర్, టెక్నీషియన్లను సదరు వైద్యులు ప్రశ్నించగా, మెరుగైన వైద్యం కోసమే తమ ఆస్పత్రి యాజమాన్యం ఆమెను ఇక్కడికి పంపినట్లు వారు అంగీకరించినట్లు తెలిసింది.

నిజానికి ఆమె ఆస్పత్రికి రాకముందే చనిపోయింది. చనిపోయిన వారి మృతదేహాలను ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డు ఎలా అడ్మిట్‌ చేసుకుంటాం? వారికేం వైద్యం చేస్తాం? కావాలనే ఆ కార్పొరేట్‌ ఆస్పత్రి సిబ్బంది మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చింది. ఒకవైపు మేం ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు చికిత్సలు అందిస్తుంటే.. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చనిపోయిన వారిని తీసుకొచ్చి.. ఇక్కడి వైద్యులను బదనాం చేయడం ఎంతవరకు సమంజసం? తప్పుడు సమాచారం ఇచ్చిన యాజమాన్యాలపైనే కాదు.. వాటిని ప్రసారం చేసిన మీడియా చానళ్లపై కూడా కేసులు పెట్టడానికి వెనుకాడబోం..’
–శ్రవణ్‌కుమార్, గాంధీ సూపరింటెండెంట్‌   

మరిన్ని వార్తలు