గ్రేటర్‌లో డేంజర్‌ బెల్స్‌

4 Apr, 2020 07:44 IST|Sakshi

పట్నంలో 100 దాటిన కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు

గ్రేటర్‌లో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

రాష్ట్రంలో 229 కేసులు..వీటిలోవందకుపైగా సిటీలోనే...

హైదరాబాద్‌లో 75, రంగారెడ్డిలో 16, మేడ్చల్‌లో 15 పాజిటివ్‌

ఇప్పటి వరకు 11 మంది మృతి..వీరిలో ఎనిమిది మంది ఇక్కడి వారే

పాజిటివ్‌ కేసులు పెరిగే అవకాశం.. వివరాల వెల్లడిపై గోప్యత

సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం రాత్రి వరకు 229 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. వీటిలో 100కు పైగా కేసులు గ్రేటర్‌లోనేనమోదయ్యాయి. ఈమేరకు హైదరాబాద్‌ జిల్లాలో 75..రంగారెడ్డి జిల్లాలో 16, మేడ్చల్‌ జిల్లాలో 15 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఇప్పటికే 11మంది మృతి చెందగా, వీరిలో ఎనిమిది మంది గ్రేటర్‌ వాసులే. ఒక వైపు వైరస్‌ ఒకరి నుంచి మరొకరికిచాపకింద నీరులా విస్తరిస్తుండటం..మరో వైపు గత నాలుగు రోజుల నుంచి రోజుకు సగటున 20 నుంచి 30పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తుండటంతో మహానగరంలో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రోగుల విషయంలో అత్యంత గోప్యతనుపాటిస్తూ...వివరాలు వెల్లడించడం లేదనేఅనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ సమీపిస్తోంది...
మార్చి రెండో తేదీన తెలంగాణలో తొలి కరోనా పాజిటివ్‌కేసు వెలుగు చూసింది. ఆ తర్వాత 30వ తేదీ వరకు 77 కేసులు నమోదైతే...ఆ తర్వాత కేవలం మూడు రోజుల్లోనే మరో 77 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో 60 శాతం కేసులు హైదరాబాద్‌ జిల్లావే.  వైరస్‌ ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ దగ్గర పడుతున్న కొద్దీ కేసుల సంఖ్య పెరుగుతుండటం, వైరస్‌ మరింత బలపడి విస్తరించే ప్రమాదం ఉండటంతో గ్రేటర్‌ వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వచ్చే వారం రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.  

గ్రేటర్లో కరోనాతో మృతులు వీరే..
తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 11 మంది మృతి చెందారు. వీరిలో ఒకరు నిజామాబాద్, ఇంకొకరు గద్వాల్, మరొకరు నిర్మల్‌కు చెందిన వారు కాగా, మిగిలిన ఎనిమిది మంది గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని వారే. పాజిటివ్‌ కేసుల్లోనే కాదు..మరణాల్లోనూ గ్రేటరే టాప్‌లో ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఇదిలా ఉంటే మార్చి 28వ తేదీన తెలంగాణలో తొలి కరోనా మరణం నమోదైంది. ఖైరతాబాద్‌ గ్లోబల్‌ ఆస్పత్రిలో అదే ప్రాంతానికి చెందిన వృద్ధుడు(74) కరోనాతో చనిపోయాడు. ఆ తర్వాత రెండు రోజులకు గాంధీ ఆస్పత్రిలో చంచల్‌గూడకు చెందిన ఉర్దూ పత్రిక జర్నలిస్టు(58) సహా దారుషిఫాకు చెందిన వృద్ధుడు (65) మృతి చెందాడు. అపోలో ఆస్పత్రిలో యూసఫ్‌గూడకు చెందిన వ్యక్తి(55) చనిపోయాడు. మార్చి 31నæ న్యూ మలక్‌పేటకు చెందిన 73 ఏళ్ల వృద్ధుడు యశోద ఆస్పత్రిలో మృతి చెందాడు. ఏప్రిల్‌ ఒకటో తేదీన కుత్బుల్లాపూర్‌కు చెందిన వ్యక్తి (56) గాంధీ ఆస్పత్రిలో చనిపోయాడు. వీరిలో ఒక్క జర్నలిస్టు మినహా మిగిలిన వారంతా ఢిల్లీలో జమాత్‌కు వెళ్లి వచ్చిన వారే.

మరిన్ని వార్తలు