కొత్తగూడెంలో ప్రమాద ఘంటికలు!

26 Mar, 2020 02:38 IST|Sakshi

జిల్లాలో కరోనా కేసులు 4కాగా.. కొత్తగూడెంలోనే 3.. 

మరో 30 మంది రిపోర్టులపై ఉత్కంఠ 

డీఎస్పీపై కేసు నమోదుకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదేశం 

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇప్పటికే హైరిస్క్‌ జాబితాలో ఉన్న ఈ జిల్లాను వైరస్‌ వణికిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు మారుమూలన ఉన్న భద్రాద్రి జిల్లాలో తీవ్ర ప్రభావం చూపడం పట్ల జిల్లావాసుల్లో ఆందోళన నెలకొంది. 4 కోవిడ్‌ కేసులు పాజిటివ్‌ కాగా.. వాటిలో ఏకంగా మూడు కేసులు కొత్తగూడెం పట్టణంలోనే నమోదు కావడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అవి కూడా ఒకేచోట నమోదు కావడంతో ప్రజల్లో కలవరం మొదలైంది. జిల్లాలో మొదటి కేసు ఇటలీ నుంచి అశ్వాపురం వచ్చిన ఓ యువతికి వచ్చింది. తర్వాత లండన్‌ నుంచి వచ్చిన కొత్తగూడెం డీఎస్పీ కుమారుడు ఆవాజ్‌కు పాజిటివ్‌ వచ్చింది.  

లండన్‌ నుంచి వచ్చి బయట తిరగడంతోనే.. 
లండన్‌ నుంచి వచ్చిన ఆవాజ్‌ క్వారంటైన్‌లో ఉండకుండా యథేచ్ఛగా  తిరగడం వల్ల ఇక్కడ కొత్తగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. డీఎస్పీకి, వాళ్లింటి వంట మనిషికి సైతం కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. ఈ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగే ఆస్కారం ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. లండన్‌ నుంచి వచ్చిన ఆవాజ్‌ డీఎస్పీ కార్యాలయం సిబ్బందితో పాటు, బయట స్నేహితులు సుమారు 30 మందితో కలిశాడు. డీఎస్పీ స్వగ్రామం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లికి వెళ్లి అక్కడ కూడా పలువురిని కలిశాడు. సరిహద్దు ఏపీలోని పశ్చి మగోదావరి జిల్లా చింతపూడిలో ఓ శుభకార్యానికి హాజరయ్యాడు. అక్కడ 36 మందితో కరచాలనం చేసినట్లు తెలుస్తోంది. దీనికి గతంలో జిల్లాలో ఉండి ప్రస్తుతం ఏపీలోకి వెళ్లిన వేలేరుపాడు మండలానికి చెందినవారు కూడా వెళ్లారు.

వారూ ఆవాజ్‌ను కలిశారు. దీంతో పశ్చిమగోదావరి జిల్లాలోనూ కలిసిన వారి గురించి అక్కడి అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక కొత్తగూడెంలో కటింగ్‌ షాప్‌కు వెళ్లడంతో సదరు వ్యక్తిని, తాజాగా కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వంట మనిషి కుటుంబీకులను కూడా పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తల్లాడ మండలం మిట్టపల్లిలోనూ 14 మందిని వైద్య పరీక్షలకు తరలించారు. వీరంతా రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఆవాజ్‌ను కలసిన వ్యక్తులంతా ఇంకా ఎవరెవరిని కలిశారనే విషయమై ఆరా తీస్తున్నారు. మొత్తం వంద మందికి పైగా అబ్జర్వేషన్‌లో పెట్టారు. మరోవైపు అధికారులు ఇంటింటి సర్వే చేయిస్తున్నారు. విదేశాల్లో కోవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మనదేశానికి వచ్చినవారు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండకుండా  విచ్చలవిడిగా తిరిగి విపత్కర స్థితి తీసుకు రావడం పట్ల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. 

విరుద్ధ ప్రకటనలపై విమర్శలు 
కాగా కొత్తగూడెం డీఎస్పీకి కోవిడ్‌ నెగెటివ్‌ వచ్చినట్లు మంగళవారం మధ్యాహ్నం ఎస్పీ ప్రకటించారు. తీరా రాత్రి తెలంగాణ డైరెక్టరేట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఇచ్చిన బులెటిన్‌లో డీఎస్పీకి, వంట మనిషికి పాజిటివ్‌ ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. ఈ పరిస్థితుల్లో జిల్లా పోలీసులు ఆదరాబాదరాగా నెగెటివ్‌ ఉన్నట్లు ప్రకటించడం పట్ల పలు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే కొత్తగూడెం డీఎస్పీ, ఆయన కుమారుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డీఎస్పీపై 307 సెక్షన్‌ కింద కేసు పెట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శాంతకుమారి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. ఈ మేరకు డీఎంఎహెచ్‌ఓ కొత్తగూడెం వన్‌టౌన్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  

నిబంధనలు అతిక్రమించిన సీఐ 
జిల్లాలోని అశ్వారావుపేట సీఐ అబ్బయ్య గత సోమవారం లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి అక్కడ ఉన్న కెమిలాయిడ్స్‌ గెస్ట్‌హౌజ్‌లో సుమారు 200 మందికి పైగా భోజనాలు పెట్టారు. దీంతో ఫిర్యాదు అందుకున్న ఎస్పీ సునీల్‌దత్‌ సీఐ అబ్బయ్యను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేశారు.   

12 దేశాల నుంచి 136 మంది.. 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటి వరకు 12 దేశాల నుంచి 136 మంది వచ్చారు. వీరిని హోం క్వారంటైన్‌లో ఉంచి వైద్య, రెవెన్యూ, పోలీసు శాఖల పర్యవేక్షణలో ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 21 మంది క్వారంటైన్‌ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఇక ఇటలీ నుంచి వచ్చిన అశ్వాపురం యువతికి పాజిటివ్‌ రావడంతో ఆమెను కలసిన 48 మందిని అధికారులు అబ్జర్వేషన్‌లో పెట్టారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా