నమూనాల సేకరణ.. రిపోర్టుల్లో తీవ్ర జాప్యం

3 Apr, 2020 07:30 IST|Sakshi

రిపోర్టు రాకముందే గత నెల 31న వ్యక్తి మృతి..

ఖననం అనంతరం కరోనా అని నిర్ధారణ

మృతుడి భార్యకూ వైరస్‌ లక్షణాలు

ఆస్పత్రి నుంచి వెళ్లిన బాధితురాలు

గుర్తించే పనిలో నిమగ్నమైన అధికారులు

ఇంకా లభించని 130 మంది జమాత్‌ అనుమానితుల ఆచూకీ

కరోనా టెస్టుల కోసం ఆస్పత్రులకు క్యూ..

అనుమానితులతో ఐసోలేషన్‌ వార్డులు కిటకిట

సాక్షి, సిటీబ్యూరో: కరోనా అనుమానిత లక్షణాలతో నిర్ధారణ పరీక్షలకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే మర్కజ్‌ నుంచి వచ్చిన అనుమానితులతో పాటు వారికి క్లోజ్‌ కాంటాక్ట్‌లో ఉన్న కుటుంబ సభ్యులు వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం క్యూ కడుతుండటంతో గాంధీ సహా ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ఐసోలేషన్‌ వార్డులన్నీ కిటకిటలాడుతున్నాయి. వీరికి స్క్రీనింగ్‌ టెస్టులు చేస్తున్నారు. లక్షణాలు ఎక్కువగా కన్పించే వారిని ఐసోలేషన్‌ వార్డులకు తరలిస్తున్నారు. ఐసోలేషన్‌ వార్డుల్లో రోగుల నిష్పత్తికి తగినంత సిబ్బంది లేకపోవడంతో నమూనాల సేకరణలో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. పెద్దమొత్తంలో వస్తున్న శాంపిళ్లను పరీక్షించే సామర్థ్యం గాంధీ వైరాలజీ ల్యాబ్‌లో లేకపోవడంతో టెస్టులు, రిపోర్టు జారీలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుంది. 

చనిపోయిన తర్వాత రిపోర్టులు..
వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిన వారిని హోం ఐసోలేషన్‌కు పంపుతుండగా, పాజిటివ్‌ వచ్చిన వారిని గాంధీ, ఛాతి ఆస్పత్రి ఐసీయూకి పంపి చికిత్సలు అందిస్తున్నారు. రిపోర్టుల జారీలో ఆలస్యం జరుగుతోంది. అప్పటికే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అడ్మిటైన రోగులు మృత్యువాత పడుతున్నారు. తీరా వారు చనిపోయి, మృతదేహాన్ని ఖననం చేసిన తర్వాత కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతుండటంపై సర్వత్రా ఆందోâళæన వ్యక్తమవుతోంది. జమాత్‌కు వెళ్లి వచ్చిన న్యూ మలక్‌పేటకు చెందిన 73 ఏళ్ల వృద్ధుడు కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో బంధువులు ఆయనను మార్చి 28న మలక్‌పేటలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో అడ్మిట్‌ చేశారు. ఆ తర్వాత ఆయన భార్య (60) కూడా ఇదే లక్షణాలతో ఆస్పత్రిలో చేరింది. వృద్ధుడు మంగళవారం రాత్రి  చనిపోగా, బుధవారం రాత్రి పాజిటివ్‌ ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. అప్పటికే భర్త చనిపోవడంతో భార్య కూడా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయించుకుని వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె మరో ఆస్పత్రిలో చేరిన దాఖలా కూడా లేదు. ఆ దంపతుల నుంచి ఇతరులకు వైరస్‌ సోకే అవకాశం ఉండటంతో ఆందోళనకలిగిస్తోంది. 

ఆ 130 మంది ఎక్కడ?
మార్చిలో విదేశాల నుంచి 74 వేల మందికిపైగా శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో దిగారు. వీరిలో 25 వేల మందిని ప్రభుత్వ, హోం క్వారంటైన్‌లో ఉంచారు. వీరిలో ఇప్పటికే 15 వేల మందికిపైగా క్వారంటైన్‌ టైమ్‌ ముగిసిపోయింది. మరో పది వేల మందికి క్వారంటైన్‌లో ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు మార్చి 13 నుంచి 15 మధ్య జమాత్‌కు హాజరైన వారు 1030 మంది ఉండగా వీరిలో 603 మంది గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులే ఉన్నారు. బుధవారం వరకు 443 మంది ఆచూకీ గుర్తించారు. 160 మంది మిగిలిపోగా, వీరిలో గురువారం మరో 30 మందినిగుర్తించారు. ఇంకా 130 మందిని గుర్తించాల్సి ఉంది. వీరు ఎక్కడున్నారో? ఇప్పటికే వీరు మరెంత మందికి వైరస్‌ విస్తరింపజేశారో? గుర్తించడం అధికారులకు తలకు మించిన భారంగా మారింది. ఈ 130 మందిని మినహా మిగిలిన వారందరినీ అధికారులు గుర్తించి ఐసోలేషన్‌కు తరలించారు. వీరిలో కొంత మంది తప్పుడు అడ్రస్‌లు ఇవ్వగా, మరికొంత మంది సర్వేలెన్స్‌ సిబ్బందికి పట్టుబడకుండా పారిపోతున్నట్లు తెలిసింది. తాజాగా అడ్డగుట్టలో కొంత మంది వైద్య ఆరోగ్యశాఖకు చెందిన సిబ్బందికి చిక్కకుండా పారిపోయినట్లు సమాచారం.

ఐసోలేషన్‌ వార్డులన్నీ ఫుల్‌..
గాంధీ నోడల్‌ కేంద్రంలోని ఏడు, ఎనిమిదో అంతస్తుల్లో ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేశారు. 1500 పడకల్లో 500 పడకలను ఐసీయూలో ఉంచారు. మిగిలినవాటిని ఐసోలేషన్‌ వార్డులుగా రూపొందించారు. ప్రస్తుతం ఆస్పత్రి రెండు వార్డుల్లోని పడకలన్నీ రోగులతో నిండిపోయినట్లు తెలిసింది. సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులో 200 పడకలు, కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రిలో 350 పడకల్లో సగానికిపైగా, ఫీవర్‌ ఆస్పత్రిలో 82 పడకలు సగానికిపైగా రోగులతో నిండిపోయాయి. ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో 200 పడకలు ఉండగా, వీటిలో ఇప్పటికే వంద మందికిపైగా అనుమానితులు ఉన్నట్లు తెలిసింది. తాజాగా గురువారం సుమారు 500 మంది నుంచి నమానాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపించారు. వీటి రిపోర్టులు రావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు