ఇలా పరీక్ష.. అలా ఫలితం!

16 Jun, 2020 05:09 IST|Sakshi

త్వరలో అందుబాటులోకి ‘స్టాండర్డ్‌ క్యూ కోవిడ్‌–19 యాంటిజన్‌ డిటెక్షన్‌ కిట్‌’

పదిహేను నిమిషాల్లో వైరస్‌ నిర్ధారణ, 99.3శాతం కచ్చితమైన ఫలితం 

సాక్షి, హైదరాబాద్:‌ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న క్రమంలో తక్కువ సమయంలో ఫలితం తేల్చే కిట్‌కు ఐసీఎంఆర్‌ ఆమోదం తెలిపింది. స్టాండర్డ్‌ క్యూ కోవిడ్‌–19 యాంటిజన్‌ డిటెక్షన్‌ పరీక్ష ద్వారా పదిహేను నిమిషాల్లోనే ఫలితం తెలుసుకునే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆర్‌టీ–పీసీఆర్‌ పద్ధతి ద్వారా పరీక్ష నిర్వహించడం, శాంపిల్‌ను ల్యాబ్‌కు తీసుకురావడానికి దాదాపు ఐదు గంటల సమయం పడుతుంది. వైరస్‌ వ్యాప్తి తీవ్రమవుతుండడం, కేసుల సంఖ్య ఎక్కువవుతున్న తరుణంలో వేగంగా పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తక్కువ సమయంలో వైరస్‌ను గుర్తించే వీలున్న దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ తయారు చేసిన స్టాండర్డ్‌ క్యూ కోవిడ్‌–19 యాంటిజన్‌ డిటెక్షన్‌ కిట్‌కు ఐసీఎంఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ కిట్‌పై తొలుత ఐసీఎంఆర్, ఎయిమ్స్‌లు సంయుక్తంగా పరిశీలన చేసిన తర్వాత దేశంలో వినియోగించేందుకు అంగీకారం తెలిపాయి. ఈమేరకు ఐసీఎంఆర్‌ ఈనెల 14న కిట్‌ వినియోగంపై మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఆర్టీ–పీసీఆర్‌కంటే అడ్వాన్స్‌డ్‌...
దేశంలో కరోనా వైరస్‌ పరీక్షను ఆర్టీ–పీసీఆర్‌ పద్ధతిలో నిర్ధారిస్తున్నారు. ఈ పద్ధతిలో లక్షణాలున్న వ్యక్తి ముక్కు లేదా గొంతు నుంచి తెమడ ద్వారా శాంపిల్‌ను సేకరిస్తారు. అలా సేకరించిన శాంపిల్‌ను ల్యాబ్‌కు తీసుకొచ్చిన తర్వాత పరీక్షలు చేసి వైరస్‌ను నిర్ధారిస్తారు. శాంపిల్‌ కలెక్షన్‌ మొదలు ల్యాబ్‌కు తీసుకొచ్చే వరకు సగటున 5గంటల సమయం పడుతుంది. అయితే తాజాగా అందుబాటులోకి రానున్న పరికరంతో కేవలం పదిహేను నిమిషాల్లోనే పరీక్ష నిర్వహించి ఫలితం రాబట్టొచ్చు. శాంపిల్‌ సేకరించిన తర్వాత అదే ప్రదేశంలో కిట్‌ ద్వారా పరీక్ష చేసి ఫలితం ప్రకటించవచ్చు. శాంపిల్‌ను ల్యాబ్‌కు తీసుకురావాల్సిన పని లేదు. దీంతో సమయం కలిసి వస్తుంది. ఈ పరీక్ష కోసం శాంపిల్‌ను తీసిన వెంటనే కిట్‌లో వేయడంతో వైరస్‌ నిర్వీర్యం అవుతుంది. ఫలితంగా వైరస్‌ ఇతరులకు వ్యాప్తి చెందే వీలులేదు. ఆర్టీ–పీసీఆర్‌ పద్ధతిలో శాంపిల్‌ను సేకరించి ల్యాబ్‌కు తీసుకొచ్చే క్రమంలో మధ్యలో ఇతరులకు వైరస్‌ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

లక్షణాలున్న వారికే...
తాజాగా ఐసీఎంఆర్‌ నిర్దేశించిన స్టాండర్డ్‌ క్యూ కోవిడ్‌–19 యాంటిజన్‌ డిటెక్షన్‌ కిట్‌ ద్వారా కంటైన్మెంట్‌ జోన్‌లో లక్షణాలు ఉన్న వారికి మాత్రమే పరీక్షలు నిర్వహించాలి. వీరితో పాటు పాజిటివ్‌తో కాంటాక్ట్‌ అయిన వారిలో దీర్ఘకాలిక జబ్బులున్నవారు, పేషంట్లకు వైద్య సేవలు అందించే వైద్యులు, సిబ్బంది, గొంతు, ముక్కుకు సంబంధించిన శస్త్ర చికిత్సలు చేసే సహాయకులకు ఈ కిట్‌ను వినియోగించి పరీక్షలు చేయొచ్చు.  

>
మరిన్ని వార్తలు