కుక్క బొచ్చు ద్వారా మనిషికి ‘కరోనా’

6 Jul, 2020 08:13 IST|Sakshi

కుక్కల్లో వచ్చేది ‘అల్ఫా’ వెరైటీకి చెందిన కరోనా వైరస్‌

ఇది కుక్కల్లోని పేగులపై ప్రభావం చూపుతుంది

సుమారు 15ఏళ్లుగా ‘కెనైన్‌ ‘కరోనా’ వైరస్‌ వ్యాక్సిన్‌ వినియోగం

న్యూయార్క్‌లో మనిషి నుంచి మూడు పులులకు ‘కరోనా’

కుక్కబొచ్చుపై ఉన్న వైరస్‌ ద్వారా మనిషికి ‘కరోనా’ వచ్చే అవకాశం

మనుషుల్లో శ్వాసకు సంబంధించిన వ్యాధి

సూపర్‌ స్పెషాలిటీ వెటర్నరీ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌  

హిమాయత్‌నగర్‌: సహజంగా కుక్కల నుంచి మనుషులకు మనుషుల నుంచి కుక్కలకు వ్యాధులు సంక్రమిస్తుంటాయి. ఈ తరుణంలో చాలా వరకు అనుమానాలు సైతం రేకెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ‘కరోనా’ పంజా విసిరింది. మరో పక్క కుక్కల నుంచి ‘కరోనా’ వస్తుందనే ప్రచారం సైతం ఎక్కువ అవుతోంది. ఈ క్రమంలో మనుషుల నుంచి కుక్కలకు, కుక్కల నుంచి మనుషలకు అసలు ‘కరోనా’ సోకే చాన్సే లేదంటున్నారు నారాయణగూడలోని ‘సూపర్‌ స్పెషాలిటీ వెటర్నరీ’ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.ప్రవీణ్‌కుమార్‌. వివరాలు ఆయన మాటల్లోనే..

20 ఏళ్ల క్రితమే ‘కుక్క’కు కరోనా
సుమారు 20 ఏళ్ల క్రితమే కుక్కకు ‘కరోనా’ వైరస్‌ సంక్రమించింది. కుక్కల్లో వ్యాపించే ‘కరోనా’ వైరస్‌ ‘అల్ఫా’ వెరైటీకి చెందిన ‘కరోనా’ వైరస్‌. ఇది పేగులకు సంబంధించిన వ్యాధి. తాము అప్పటి నుంచి ఇప్పటికీ ‘కెనైన్‌ కరోనా వైరస్‌’ వ్యాక్సిన్‌ను కుక్కలకు వేస్తున్నాం. మనుషుల్లో వ్యాపించే ‘కరోనా’ వైరస్‌ ‘బీటా’ టైప్‌ వైరస్‌. ఇది ప్రధానంగా శ్వాసకోశ వ్యాధి. కాబట్టి కుక్కల నుంచి మనుషులకు ‘కరోనా’ వ్యాపించే ఆస్కారం అసలు లేనే లేదు. దీనిపై హాంగ్‌కాంగ్, సింగపూర్‌లలో రీసెర్చ్‌ సైతం చేస్తున్నారు. ఇంతవరకు ఆ విధమైన ఛాయలేవీ వెలుగుచూడలేదని అక్కడి శాస్త్రవేత్తలు సైతం వివరిస్తున్నారు. (కుక్కలకు ఆహారంగా కరోనా మృతదేహాలు )

మనిషి నుంచి మూడు పులులకు ‘కరోనా’
న్యూయార్క్‌లో జూలో పనిచేసే ‘హ్యాండ్లర్‌’కు ‘కరోనా’ పాజిటివ్‌ సోకింది. అది తెలియని ఆ వ్యక్తి ప్రతిరోజూ ఆ పులికి ఆహారం పెట్టడం, యోగ క్షేమాలు చూసుకోవడం జరిగింది. ఈ క్రమంలో అతడి నుంచి మూడు పులులకు ‘కరోనా’ రావడం ప్రపంచంలోనే తొలికేసుగా పేరుగాంచింది. అయితే జంతువు నుంచి జంతువుకు ఏమైనా ఈ ‘కరోనా’ సోకుతుందా అనే విషయాలు కూడా ఇంకా బయటకి రాలేదు. దీనిపై న్యూయార్క్‌లో వేగవంతంగా రీసెర్చ్‌ జరుగుతుంది. కాబట్టి మన నుంచి జంతువులకు వ్యాపించే అవకాశాలు ఉన్న కారణంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ప్రతిరోజూ ఇంట్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం చాలా ఉంది. ఇంట్లో పాల ప్యాకెట్లను ఏ విధంగా అయితే వాటర్‌లో శుభ్రం చేసిన తర్వాత వాడుకుంటున్నారో.. అదేవిధంగా కుక్కలను కూడా శుభ్రంగా చూసుకోవాలి. కుక్కని తాకిన ప్రతి పది నిమిషాలకు సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా మనం వాడే శానిటైజర్‌ను చేతులకు రాసుకోవాలి. తడిచేతులతో కుక్కలను తాకడం వంటివి చేయవద్దు. తద్వారా వాటికి దురదలు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఈ కరోనా సమయంలో కుక్కలను కూడా శుభ్రంగా ఉంచాలి. – డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్, సూపర్‌ స్పెషాలిటీ వెటర్నరీ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌

కుక్క బొచ్చు ద్వారా మనిషికి ‘కరోనా’
మనం అల్లారుముద్దుగా పెంచుకునే కుక్కల ద్వారా మనకు ప్రమాదం లేదు. అయితే ఎవరైనా వైరస్‌కు గురైన వారు తుమ్మినప్పుడు ఆ తుంపర కుక్కబొచ్చుపై పడితే.. అది అలాగే ఉంటుంది. మనకు తెలియకుండా మనం కుక్కను అక్కున చేర్చుకుంటాం కాబట్టి తద్వారా మనకు ‘కరోనా’ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుక్కలను ప్రతి గంటకోసారి మార్కెట్లో దొరికే ‘ఫ్రెష్‌ కోట్, టాపిక్యూర్‌’ స్ప్రేలు లాంటివి వాటితో స్ప్రే చేసి ఓ పది నిముషాల ద్వారా తుడిచేస్తే వైరస్‌ అంతమవుతుంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు