ఆషాఢ బోనం.. ఇంటికే పరిమితం

26 Jun, 2020 12:50 IST|Sakshi
నగరంలో బోనాల ఊరేగింపు(ఫైల్‌)

బోనాల పండుగపై కరోనా ఎఫెక్ట్‌ 

ఇళ్లలోనే వేడుకలు జరుపుకోవాలని ప్రభుత్వ సూచన

నిజామాబాద్‌ కల్చరల్‌: అమ్మవారికి ప్రీతికరమైన ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం సంప్రదాయం. ప్రతి ఇంటి నుంచి ఆడపడుచులు పసుపు కుంకుమతో అలంకరించిన పాత్రలో అగ్ని సాక్షిగా నైవేద్యం(బోనం) సమర్పించడం అమ్మవారికి ఎంతో ఆనందాన్నిస్తుంది. గ్రామ పొలిమేరల్లో ఉండే అమ్మవార్లకు ఈ మాసం మొత్తం బోనాలు సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే కరోనా ప్రభావం బోనాల పండుగపై కూడా తీవ్రంగా పడింది. బోనాలను ఇళ్లకే పరిమితం చేసుకోవాలని సూచించారు.

దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం
విస్తారంగా కురిసే వర్షాలతో ఈ మాసంలో కలరా, మలేరియా లాంటి వ్యాధులు వ్యాప్తిస్తుంటాయి. ఈ సీజన్‌లో వచ్చే వ్యాధులు మనుషులపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. ఇలా వ్యాధులు రాకుండా, ప్రకృతి వైపరీత్యాలు కలగకుండా, పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ గ్రామదేవతలను వేడుకొని భక్తులు బోనాలు సమర్పిస్తారు. బోనాల సందర్భంగా మహిళలు కాళ్లకు రాసుకునే పసుపుతో వానాకాలంలో అరికాళ్లు చెడకుండా ఉంటాయి. దీంతో పాటు ఈ పండుగకు అలంకారంగా ప్రతి ఇంటి గుమ్మానికి, వీధి వీధికి వేపాకు మండలు కడతారు. వేపాకులో ఉండే ఔషధగుణం ద్వారా క్రిమికీటకాలు నాశనం అవడంతో పాటు అంటువ్యాధులు దరికి చేరవు.

సాదాసీదాగా..
ప్రతి ఇంటా సంతోషంగా జరుపుకునే బోనాల వేడుకలు ఈ సంవత్సరం కోవిడ్‌ –19 కరోనాతో బోనాలను ఇళ్లకే పరిమితం చేసుకోవాలని, సాదసీదగా జరుపుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆలయాలలో పూజారుల ఆధ్వర్యంలో బోనాల తంతు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు మాత్రం తమ ఇళ్లలోనే అమ్మవార్లకు బోనం సమర్పించి అందరిని సల్లగా చూడాలని కోరుతూ మొక్కులు చెల్లించాలని చెప్పింది.

కరోనా కట్టడి కోసం ప్రభుత్వ నిర్ణయం
వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆషాఢ బోనంకు కరోనా గ్రహణం పట్టింది. దీంతో బోనాల పండుగను ఇంటికే పరిమితం చేసుకోవాలని ప్రభుత్వం సూచించడం ఆందోళన కలిగిస్తుంది. కరోనా వ్యాధి కట్టడి చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం సరైనదే. ఎల్లమ్మ అనుగ్రహంతో కరోనా వ్యాధి త్వరగా వెళ్లిపోవాలని కోరుకుంటాను.– పంచరెడ్డి ఎర్రన్న, అధ్యక్షుడు, ఎల్లమ్మ ఆలయం, ఎల్లమ్మగుట్ట

మరిన్ని వార్తలు