జూన్‌కు చెప్పలేం... నవంబర్‌కు ఏమో..! 

23 May, 2020 05:39 IST|Sakshi

కరోనా ప్రభావంతో ముందుకు సాగని చెక్‌డ్యామ్‌ల నిర్మాణ ప్రక్రియ

లాక్‌డౌన్‌తో పూర్తికాని టెండర్లు..మొదలుకాని పనులు

600 చెక్‌డ్యామ్‌ల్లో పనులు మొదలైనవి కేవలం 60 మాత్రమే

ఇసుక, సిమెంట్, కార్మికులు లేక పనులు మరింత ఆలస్యం

నేడు సమీక్షించనున్న ఇరిగేషన్‌ శాఖ ముఖ్య కార్యదర్శి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నదులు, వాగులు, వంకలపై నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. వీటి నిర్మాణ పనులు వర్షాకాలం ఆరంభానికి జూన్‌కు ముందే పూర్తి కావాల్సి ఉండగా ఇంతవరకు కనీసం పూర్తిస్థాయి టెండర్లకు నోచుకోలేదు. అవి పూర్తయిన చోట్ల సైతం పనులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నా, కార్మికులు, ఇసుక, సిమెంట్‌ కొరత, రవాణాలో జాప్యం ఆ పనులకు అడ్డుగా నిలుస్తున్నాయి.

ఆరు నెలల సమయం అవసరం.. 
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 1,235 చెక్‌డ్యామ్‌లను నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం కాగా, వీటికి రూ.4,920 కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉంది. తొలి విడతగా ఈ ఏడాది గోదావరి బేసిన్‌లో 400, కృష్ణాబేసిన్‌లో 200 చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలను రూ.2,681కోట్లతో చేపట్టాలని తలపెట్టి ఇప్పటికే సాంకేతిక అనుమతుల ప్రక్రియ పూర్తి చేశారు. అనుమతులిచ్చిన వాటిలో గోదావరి బేసిన్‌ పరిధిలో ఇప్పటివరకు 359 చెక్‌డ్యామ్‌లకు టెండర్లు పిలవగా, 40 చెక్‌డ్యామ్‌లపై ఏజెన్సీలతో ఒప్పందాలు జరిగాయి. అవి జరగకున్నా, కొన్ని చోట్ల టెండర్లు దక్కించుకున్న ఏజెన్సీలకు పనులు కొనసాగించేందుకు అనుమతించడంతో మొత్తంగా 46చోట్ల మాత్రమే పనులు ఆరంభమయ్యాయి. కృష్ణా బేసిన్‌లోనూ కేవలం 132 చోట్ల టెండర్లు పిలవగా, 25చోట్ల ఒప్పందాలు జరిగి, 18 చోట్ల పనులు ఆరంభించారు. మొత్తంగా 64చోట్ల పనులు ఆరంభమైనా అవి ప్రారంభ దశలోనే ఉన్నా యి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యం లో పనులు వేగిరం చేసినా, కనిష్టంగా వీటిని పూర్తి చేసేందుకు 6 నెలలు.. అంటే నవంబర్‌ వరకు సమయం పట్టే అవకాశం ఉంది. వానాకాలం వర్షాలు తీవ్రంగా ఉండి ఉధృత ప్రవాహాలు కొనసాగితే చెక్‌డ్యామ్‌ల నిర్మాణం కష్టతరమే కానుంది. దీంతో మళ్లీ వేసవి వస్తేకానీ పనులు పూర్తి చచేసే అవకాశం లేదని నీటి పారుదల వర్గాలే చెబుతున్నాయి.

సీజన్‌లో సందేహమే... 
ఇక పనులు ఆరంభించిన చాలా చోట్ల మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. దీంతో కొత్త కూలీలు దొరకడం గగనంగానే ఉంది. దీనికి తోడు ఇసుక లభ్యత తగ్గిపోయింది. లభ్యత ఉన్నా, వాటి ధరలు అధికంగా ఉండటం కాంట్రాక్టర్లకు కష్టాలు తెస్తోంది. దీంతో పాటే మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ దృష్ట్యా సిమెంట్‌ బస్తాపై రూ.100 నుంచి రూ.150 వరకు పెంచి బస్తా రూ.450 వరకు విక్రయిస్తున్నారు. ఇది కూడా పనుల కొనసాగింపునకు పెద్ద సమస్యగా మారిందని నీటి పారుదల అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు ఈ సీజన్‌లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పనులు వేగిరం చేసే అంశమై శనివారం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌ శాఖ ఇంజనీర్లతో సమీక్షించనున్నారు. పనుల వేగిరంపై మార్గదర్శనం చేయనున్నారు.

మరిన్ని వార్తలు