ఇజ్రాయిల్‌లో మనోళ్లకు కష్టాలు

20 Mar, 2020 11:25 IST|Sakshi

వారం రోజులుగా పనులు లేక ఇక్కట్లు 

కరోనా’తో గదులకే పరిమితమైన కార్మికులు  

ఆర్మూర్‌: ఉపాధి కోసం ఇజ్రాయిల్‌ వెళ్లిన తెలుగు వారు కరోనా వైరస్‌ కారణంగా ఇక్కట్లు పడుతున్నారు. ఇజ్రాయిల్‌ ఇమ్మిగ్రేషన్‌ అథారిటీ నిబంధనల ప్రకారం ఉపాధి కోసం వెళ్లిన తెలుగు వారి సంఖ్య వెయ్యికి పైగా ఉండగా భారతీయులు మొత్తం పది వేల మందికి పైగా ఉంటారు. అనధికారికంగా విజిట్‌ విసాపై వెళ్లి అక్కడే ఉపాధి వెతుక్కుంటున్న వారి సంఖ్య సైతం అధికంగానే ఉంటుంది. అయితే కరోనా వైరస్‌ విస్తరిస్తున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు వారు ‘సాక్షి’తో తమ కష్టాలను పంచుకున్నారు. కరోనా వైరస్‌ ఇజ్రాయిల్‌లో సైతం విస్తరిస్తుండటంతో అక్కడి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది.

అందులో భాగంగా షాపింగ్‌ మాల్స్, థియేటర్లు, హోటళ్లు, బేకరీలు మూసివేసింది. బస్సులను సైతం నిలిపి వేశారు. కార్యాలయాల్లో విధులు నిర్వహించే వారికి హోంటు వర్క్‌కు అవకాశం కల్పించారు. కానీ అధికంగా తెలుగు వారు ఇక్కడ ఇళ్లలో కార్మికులుగా, వృద్ధులను, వికలాంగులను చూసుకొనే కేర్‌ టేకర్లుగా పని చేస్తుంటారు. వారం రోజులుగా వీరిని పనుల్లోకి రావద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. వారి గదుల్లోనుంచి బయటకు రావొద్దని సూచించారు.  దీంతో వారం, పది రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను కొనుగోలు చేసి గదులకే పరిమితమయ్యామని వారు ఆదేవన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రతి నెల డబ్బులను ఇంటికి పంపిస్తామని, ఇప్పుడు డబ్బులు లేక తమకు రోజు గడవడమే కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు