కరోనా కలిపింది అందరిని..

25 Mar, 2020 02:39 IST|Sakshi

కోవిడ్‌ నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితం

కుటుంబంతో సరదాగా గడుపుతున్న ప్రజలు..

ఇప్పటికే సొంతూళ్లకు భారీగా తరలిపోయిన జనాలు  

సాక్షి, హైదరాబాద్‌: యాంత్రిక జీవనం.. కుటుంబానికి కాస్తో కూస్తో సమయం కేటాయించేది కేవలం సెలవు దినాల్లోనే.. ఇలా బిజీ లైఫ్‌ నేపథ్యంలో కరోనా కలకలంతో కాస్త విరామం లభించింది. ఇంటి పట్టున ఉండటానికి ఆసక్తి చూపని ‘సిటీ’జనులు.. ఇప్పుడు గడప దాటేందుకు జంకుతున్నారు. కుటుంబానికి సమయం ఇవ్వకుండా.. ఆధునిక జీవన శైలికి అలవాటు పడిన ప్రజలు ప్రస్తుతం ఇంటి జపం చేస్తున్నారు. గతంలో విరివిగా ఉన్న ఉమ్మ డి కుటుం బాలు జాడ మచ్చుకైనా కనిపిం చడం లేదు. వివాహం కాగానే వేరు కాపురం పెట్టడానికే మొగ్గు చూపుతున్నారు. కాపురాల విషయమే కాదు..పండుగలు పబ్బాల వేళ అలా వచ్చి ఇలా పోవడమే తప్ప కుటుంబంతో కుదురుగా గడుపుతున్న ఘటనలు అరుదనే చెప్పొచ్చు.  

కోవిడ్‌ కొరివితో ఒంటరి జీవితాలకు బ్రేక్‌ వేసింది. వసుధైక కుటుంబాన్ని ఒక చోట చేర్చింది. ఈ నెల 31వరకు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో చిన్నాపెద్దా అంతా ఇంటికే పరిమితమయ్యారు. బయటకు వెళ్లడానికి నిషేధాజ్ఞలు విధించడంతో ఇళ్లలోనే గడపాల్సిన పరిస్థితి అనివార్యమైంది. ఇన్నాళ్లూ అడపాదడపా ఇంటి దగ్గర ఉండే కుటుంబ సభ్యులు.. ఇప్పుడు అంతా కలసి కబుర్లు చెప్పుకోవడం, కష్ట సుఖాలు పంచుకోవడం, బంధాలు.. అనుబంధాలు.. గత స్మృతులు.. బాల్య స్నేహాలను నెమరువేసుకోవడం వంటి వాటిని గుర్తు చేసుకుంటున్నారు. ఆ పరిణామాలతో కొంత మానసిక ఆనందాన్ని పొందుతున్నారు.

సొంతూరు బాట!
ఉపాధి, ఉద్యోగ రీత్యా నగరాలు, పట్టణాల్లో స్థిరపడ్డ పల్లె ప్రజలు.. ఇప్పుడు సొంతూరు బాట పట్టారు. ఇప్పట్లో పరిస్థితులు సద్దుమణిగే పరిస్థితి లేకపోవడంతో సొంతూళ్లకు వెళ్లడమే మంచిదని భావిస్తున్నారు. కరోనా వైరస్‌ విస్తృతి తగ్గకపోవడంతో లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశమున్నట్లు వెలువడుతున్న సంకేతాలు కూడా పల్లెటూరుకు కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే గత నాలుగు రోజులుగా సొంతూళ్లకు వెళ్లిన వారి సంఖ్య లక్షల్లో ఉంది. జనసమ్మర్థం గల పట్టణాల్లో ఉండటం కన్నా జన సంచారం తక్కువగా ఉండే పల్లెలకు వెళ్లడం మంచిదని, అంతేగాకుండా ఎవరి ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు ఎక్కడ ఉంటారనే సమాచారం కూడా ఇట్టే తెలిసిపోతుంది కనుక గ్రామాలే సురక్షితమనే భావన వినిపిస్తోంది.

కేవలం దసరా, సంక్రాంతి, ఇతరత్రా శుభకార్యాలకు సొంతూరు బాట పట్టే పెద్దలు ఇప్పుడు పిల్లాజెల్లతో బయలుదేరుతున్నారు. మరోవైపు లాక్‌డౌన్‌తో పరిశ్రమలు, విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు తదితర సంస్థలు మూసివేయడమేగాకుండా.. పిల్లలకు సెలవులు కూడా ప్రకటించడంతో కుటుంబ సమేతంగా ఇంటిబాట పట్టేందుకు ఒక కారణమవుతోంది. ఏదీఎమైనా ఇన్నాళ్లూ ఒంటరి జీవితంతో విసిగి వేసారిన వారికి ఇప్పుడు కరోనా పుణ్యమా అని ఉమ్మడి కుటుంబం అప్యాయతలు, అనురాగాలు తెలుసుకునే అవకాశం లభించింది. 

మరిన్ని వార్తలు