ఆధునీకరణ ఆందోళన

8 Jun, 2020 12:21 IST|Sakshi
కేటీపీఎస్‌ 5వ దశ కర్మాగారం

కరోనా విస్తరిస్తున్న క్రమంలో ఇతర రాష్ట్రాలవారితో పనులు

300 మంది టెక్నీషియన్లు రానుండటంతో     కేటీపీఎస్‌ ఉద్యోగుల్లో భయం

5వ దశలో రూ.100 కోట్లతో ప్రారంభించిన బీహెచ్‌ఈఎల్‌ సంస్థ

పాల్వంచ: కేటీపీఎస్‌ 5వ దశ కర్మాగారంలో ఆధునీకరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో కరోనా వైరస్‌ భయం పట్టుకుంది. బీహెచ్‌ఈఎల్‌ కంపెనీ ఆధ్వర్యంలో రూ.100 కోట్లతో కర్మాగారంలోని 9,10 యూనిట్లను ఆధునీకరించనున్నారు. ఇందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లు, టెక్నీషియన్లు సుమారు 300 మంది రానున్నారు. వారంతా విమాన ప్రయాణాలు, రైళ్లు, ఇతర వాహనాల్లో ఇక్కడికి చేరుకోనున్నారు. 50 రోజులపాటు పనులు జరుగుతాయి. కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల వారు ఇక్కడికి వస్తుండడంతో కేటీపీఎస్‌ ఉద్యోగులు, పట్టణ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆర్థికభారం పడుతుందని..
కర్మాగారాల్లోని ప్రతి యూనిట్‌ లైఫ్‌ టైం 25 ఏళ్లు ఉంటుంది. ఈ క్రమంలో 15 ఏళ్లు దాటిన అనంతరం పునఃరుద్ధరణ, ఆధునీకరణ(రెన్నోవేషన్‌ అండ్‌ మోడర్నైజేషన్‌–ఆర్‌అండ్‌ఎం) పనులు చేపడతారు. ఈ పనులు సకాలంలో చేపట్టకపోతే అనుకున్న స్థాయిలో విద్యుదుత్పత్తి రాదు. బొగ్గు వినియోగం కూడా పెరుగుతుంది. ఫలితంగా జెన్‌కో సంస్థకు ఆర్థిక భారం పడుతుంది. అయితే 9,10 ఈ యూనిట్లు అందుబాటులోకి వచ్చి 22 ఏళ్లు అవుతోంది. దీంతో యాజమాన్యం ఆధునీకరణ పనులకు మొగ్గు చూపింది. సోమవారం నుంచి పనులు చేపట్టాలని యోచించగా, బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీ కారణంగా 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 9వ యూనిట్‌లో ఉత్పత్తిని నిలిపి వేసి గత గురువారం నుంచే ప్రారంభించారు. కర్మాగారంలో కంట్రోల్‌ అండ్‌ ఇనుస్ట్రమెంటేషన్‌ (సీఅండ్‌ఐ)కి రూ.70 కోట్లు, ఎయిర్‌ హీటర్లకు రూ.20కోట్లు, ఇతర పనులకు రూ.10 కోట్ల చొప్పున మొత్తం రూ.100 కోట్లుకేటాయించారు. అవసరమైన మెటీరియల్‌ను వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించి కర్మాగారంలో నిల్వ ఉంచారు.

పలు రాష్ట్రాల నుంచి టెక్నీషియన్లు...
ఆధునీకరణ పనుల చేసేందుకు పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, హరిద్వార్‌ తదితర ప్రాంతాలకు చెందిన టెక్నీషియన్లు, ఇంజనీర్లు విమాన, రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో రానున్నారు. వీరంతా నేటి నుంచి దఫదఫాలుగా చేరుకుంటారు. వారికి వసతి సౌకర్యంతోపాటు క్యాంటీన్లలో భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. సుమారు రెండు నెలలపాటు జరిగే ఈ పనుల్లో స్థానిక కేటీపీఎస్‌ ఉద్యోగులు, ఇంజనీర్లతో కలిసి పని చేస్తారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారితో కలిసి పనిచేయాలంటే స్థానిక ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో కూడా వీరి రాకపోకలు ఉంటాయి. ఈ క్రమంలో పట్టణ ప్రజల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఆధునీకరణ పనులను మరికొంత కాలం వాయిదా వేయాలని ఉద్యోగ సంఘాల నేతలు, కార్మికులు కోరుతున్నారు. 9,10 యూనిట్‌లు ప్రస్తుతం రికార్డ్‌ స్థాయిలో ఉత్పత్తి అందిస్తున్నాయని, 9వ యూనిట్‌ 100 రోజులపాటు నిరంతరాయంగా విద్యుదుత్పత్తి సాధించి రికార్డ్‌ సృష్టించిందని చెబుతున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని పనుల నిర్వహణపై యాజమాన్యం పునరాలోచించాలని కోరుతున్నారు. కాగా ఇప్పటికే పనులు మూడుసార్లు వాయిదాపడ్డాయని, ఇంకా వాయిదా వేయలేమనే రీతిలో జెన్‌కో యాజమాన్యం వ్యవహరిస్తోంది.

రక్షణ చర్యలు తీసుకుంటాం
కేటీపీఎస్‌ 5వ దశ నిర్మించి 22 సంవత్సరాలు పూర్తికావొస్తోంది. ఈ తరుణంలో పునఃరుద్ధరణ, ఆధునీకరణ పనులను రూ.100 కోట్లతో బీహెచ్‌ఈఎల్‌ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టాం. విద్యుత్‌ అవసరాలు కీలకం కానున్న క్రమంలో ఆధునీకరణ పనులు చేయాల్సి వస్తోంది. కరోనా వైరస్‌ నియంత్రణకు రక్షణ చర్యలు తీసుకుంటాం.–కె.రవీంద్ర కుమార్, కేటీపీఎస్‌ 5,6 దశల సీఈ

>
మరిన్ని వార్తలు