జిల్లాలో కలకలం రేపిన తొలి ‘కరోనా’ కేసు

30 Mar, 2020 13:32 IST|Sakshi
ఆర్మూర్‌లో కరోనా అనుమానితుడిని క్వారంటైన్‌కు తరలిస్తున్న వైద్యసిబ్బంది

వైరస్‌ సోకిన వ్యక్తితో కలిసి 39 మంది ఢిల్లీకి..

వారి కోసం అధికారుల వేట

పలువురిని గుర్తించి క్వారంటైన్‌ కేంద్రాలకు తరలింపు

సోషల్‌ డిస్టెన్స్‌ పాటించకపోతే తీవ్ర పరిణామాలు

ఇళ్లకే పరిమితం కావడం తప్పనిసరి

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: కరోనా ముప్పు ముంచుకొస్తోంది.. పంజా విసిరేందుకు వైరస్‌ కాచుకుని కూర్చొంది.. ఇన్నాళ్లు కోవిడ్‌–19 ఆనవాళ్లు మన దగ్గర లేకపోవడంతో ఇందూరు ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారు. కాని తొలి పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఒక్కసారిగా కలకలం రేగింది. కరోనా సోకిన వ్యక్తితో కలిసి వివిధ మండలాలకు చెందిన 39 మంది ఢిల్లీకి వెళ్లి వచ్చినట్లు తెలియడంతో కలవరం మొదలైంది. వారిని గుర్తించే పనిలో పడిన అధికార యంత్రాంగం ఇప్పటికే కొందరిని గుర్తించి క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించింది. మరి కొందరి కోసం వేట కొనసాగుతోంది.

కోవిడ్‌–19 లక్షణాలు కనిపించిన వారిని అధికార యంత్రాంగం గుర్తించి కొందరికి జిల్లా కేంద్రంలోని ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స అందిస్తోంది. మరి కొందరిని గాంధీ ఆస్పత్రికి పంపింది. ఈ క్రమంలో గాంధీ ఆస్పత్రికి పంపిన వారిలో నిజామాబాద్‌ నగరంలోని ఖిల్లా ప్రాంతానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఢిల్లీలో జరిగిన ప్రార్థన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లి వచ్చిన ఆయనతో పాజిటివ్‌ రావడంతో శనివారం ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను మాక్లూర్‌ నర్సింగ్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్వారంటైన్‌ కేంద్రానికి తరలించిన విషయం విదితమే. తాజాగా కరోనా సోకిన వ్యక్తితో కలిసి ఢిల్లీకి వెళ్లి వచ్చిన సుమారు 39 మంది కోసం అధికార యంత్రాంగం వేట కొనసాగిస్తోంది. ఇప్పటికే కొందరిని గుర్తించి ఆదివారం క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. 

భీమ్‌గల్‌ పట్టణానికి చెందిన ఓ వ్యక్తిని కూడా మాక్లూర్‌ క్వారంటైన్‌ కేంద్రానికి పంపించారు. బాన్సువాడ పట్టణానికి చెందిన మరో ముగ్గురిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కామారెడ్డి పట్టణానికి చెందిన ఇద్దరు, పిట్లంకు చెందిన మరొకరిని కూడా ఐసోలేషన్‌కు తరలించారు. అలాగే ఆర్మూర్‌లో ఒకరిని, బాల్కొండలో మరో ఇద్దరిని, మాక్లూర్‌కు చెందిన ముగ్గురిని గుర్తించిన అధికారులు వారిని కూడా క్వారంటైన్‌ కేంద్రానికి పంపించారు. సిరికొండ మండలంలో రావుట్ల గ్రామానికి చెందిన భార్యభర్తలను కూడా క్వారంటైన్‌కు తరలించారు. వీరికి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించాక వైద్యాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కుమార్తె మోస్రాలో నివాసముంటుంది. ఆమె ఇటీవల తన తండ్రి (కరోనా పాజిటివ్‌ వ్యక్తి) ఇంటికి వెళ్లి వచ్చారు. దీంతో అధికారులు ఆ మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఆరుగురిని కూడా క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తితో కలిసి ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన బోధన్‌కు చెందిన ఐదుగురిని కూడా రెంజల్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రానికి పంపించారు.

ఆయా మండలాల్లో ఆందోళన
జిల్లాలో ఇన్నాళ్లు కేవలం కరోనా వైరస్‌ జాడ లేకపోవడంతో జనమంతా హాయిగా ఉన్నారు. అయితే తొలి పాజిటివ్‌ కేసు వెలుగు చూడడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. అదే సమయంలో కరోనా సోకిన వ్యక్తితో కలిసి 39 ప్రయాణం చేసినట్లు వెలుగు చూడడంతో మరింత కంగారు మొదలైంది. ఆ 39 మందిలో ఆర్మూర్, భీమ్‌గల్, బాల్కొండ, మాక్లూర్, బోధన్, కామారెడ్డి, పిట్లం మండలాలకు చెందిన వారు ఉన్నారు. దీంతో ఆయా మండలాల ప్రజలు ఒక్కసారిగా ఉలికి పడ్డారు. ఢిల్లీ నుంచి వచ్చాక ఆ 30 మంది ఎక్కడెక్కడకు వెళ్లి వచ్చారు.. ఎవరెవరిని కలిశారనే దానిపై స్థానికులు చర్చించుకుంటున్నారు.

ఖిల్లా ప్రాంతంలో ఇంటింటి సర్వే..
కరోనా సోకిన వ్యక్తి నివసించే నగరంలోని ఖిల్లా ప్రాంతంలో వైద్యాధికార యంత్రాంగం ఆదివారం ఇంటింటి సర్వే చేపట్టింది. వైద్యారోగ్యశాఖ, పోలీసు, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది ఈ ప్రాంతంలో తిరిగి ప్రజల ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఎవరెవరిని ఎక్కువగా కలిశాడు, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎక్కడెక్కడ తిరిగారు.. వంటి వాటిపై ఆరా తీస్తున్నారు. అలాగే ఈ వ్యక్తి ద్వారా కరోనా ఎవరికైనా సోకిందా.. ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం ఉన్నాయా? అంటూ ఇంటింటికి తిరిగి వివరాలను సేకరించారు. కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి.పాటిల్, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్, డీఎంహెచ్‌వో సుదర్శనం, ఆర్డీవో వెంకటయ్య తదితరులు ఈ సర్వే జరుగుతున్న ప్రాంతంలో పర్యటించారు. ఎంతో ధైర్యంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న సిబ్బందిని కలెక్టర్, కమిషనర్‌ అభినందించారు.

మేల్కొనకపోతే కష్టమే..
కలవరం రేపుతోన్న కరోనాను నిలువరించడం మన చేతుల్లోనే ఉంది. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారిని కట్టడి చేయాలంటే మనమంతా స్వీయ నియంత్రణ పాటించాల్సిందే. ఇప్పటికైనా ప్రజలు ఇళ్లకే పరిమితమై బాధ్యతగా వ్యవహరిస్తేనే ముప్పు ను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

మరిన్ని వార్తలు