19 విమానాలు.. 1,600 మంది ప్రయాణికులు

26 May, 2020 02:42 IST|Sakshi
ఎయిర్‌పోర్ట్‌ అధికారులతో మాట్లాడుతున్న సీఎస్‌

శంషాబాద్‌ నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం

లగేజీ, ట్రాలీ వాహనాల శానిటైజేషన్‌కు ప్రత్యేక టన్నెల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ను సందర్శించిన సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌/శంషాబాద్‌ : కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా 2 నెలలుగా నిలిచిన దేశీయ విమానాల రాకపోకలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయంలో ఏర్పాట్లు పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ పలువురు ఉన్నతాధికారులతో కలసి సందర్శించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ప్రయాణికుల లగేజీతో పాటు ట్రాలీ వాహనాలను కూడా పూర్తిగా శానిటైజ్‌ చేసేందుకు ప్రత్యేక టన్నెల్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశంలోని పలు ప్రధాన నగరాల నుంచి హైదరాబాద్‌కు, నగరం నుంచి దేశంలోని ఇతర నగరాలకు 19 విమానాలు రాకపోకలు సాగిస్తాయని పేర్కొన్నారు. ప్రయాణికుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల శరీర ఉష్ణోగ్రతలను పరీక్షిం చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే నిబంధనల మేరకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా సెన్సర్లు ఏర్పాటు చేశామన్నారు. విదేశీ విమానాల టెర్మినళ్లను కూడా సీఎస్‌ సందర్శించారు. ఎయిర్‌పోర్టు అథారిటీ సూచించే సూచనలు, సలహాలు పాటించాలన్నారు.

ఆరోగ్య సేతు ఉంటేనే అనుమతి
రక్షణ, ఆరోగ్యం పరంగా శంషాబాద్‌ విమానాశ్రయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆరోగ్య సేతు యాప్‌ ఉన్న వారినే ప్రయాణానికి అనుమతి ఇస్తున్నారు. తొలి రోజు సుమారు 1,600 మంది శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించగా, ప్రయాణికులు లేని విమానాలను రద్దు చేస్తున్నారు. విమానాశ్రయంలో ప్రవేశించింది మొదలు విమానంలోకి వెళ్లేంత వరకు భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మంగళవారం నుంచి విమానాలు, ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్‌ అధికారులను ఆదేశించారు. ఎయిర్‌పోర్టును సందర్శించిన వారిలో సీఎస్‌తో పాటు జీఏడీ కార్యదర్శి వికాస్‌ రాజ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌ ఉన్నారు.

భారీగా రద్దయిన విమానాలు
దేశీయ సర్వీసులు ప్రారంభమైన తొలిరోజే భారీగా రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి తొలి విమానం ఉదయం 8.06 గంటలకు ట్రూజెట్‌ 2టీ 623 కేవలం 12 మంది ప్రయాణికులతో ఇక్కడి నుంచి కర్నాటకలోని విద్యానగర్‌కు బయల్దేరింది. అలాగే బెంగళూరు నుంచి బయల్దేరిన ఎయిర్‌ ఏషియాకు చెందిన 1576 విమానం 104 మంది ప్రయాణికులతో ఉదయం 8.20 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండైంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా సర్వీసులు రద్దు చేయడంతో ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాబ్‌ల చార్జీలు పెట్టుకుని ఎయిర్‌పోర్టు వరకు వచ్చాక చెప్పడమేంటని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సర్వీసులు పూర్తిగా రద్దు కాగా.. పలు ముంబై, ఢిల్లీ సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతోనే పలు ఎయిర్‌లైన్స్‌లు తమ సర్వీసులను రద్దు చేసినట్లు సమాచారం.

స్వీయ రక్షణ..
విమానంలో భౌతిక దూరం లేదేమోనని ప్రయాణికులు కొందరు స్వీయరక్షణ చర్యల్లో భాగంగా ప్రత్యేక సూట్లను ధరించి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులకు డిపార్చర్‌ ప్రవేశమార్గాల్లోనే వీరికి థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించడంతో పాటు కెమెరా స్కానింగ్‌ ద్వారానే పత్రాలను పరిశీలించి లోపలికి పంపారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రయాణికులకు సైతం ఎయిర్‌పోర్టు థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించి పంపారు.

మరిన్ని వార్తలు