సాధాసీదాగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పెళ్లి 

21 Mar, 2020 08:23 IST|Sakshi

సాక్షి, పోచంపల్లి : అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న యువకుడితో తన కుమార్తెకు పెండ్లి సంబంధం కుదిరింది. వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించాలని అనుకున్న వధువు తండ్రికి నిరాశే మిగిలింది.  కరోనా పుణ్యమా అని కుటుంబసభ్యులు, బంధవులు అందరూ ముఖానికి మాస్క్‌లు ధరించి సాధాసీదాగా పెళ్లి జరిపించాల్సి వచ్చింది.   వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ ఇటీవల ఇంటికి వచ్చిన వలిగొండకు చెందిన యువకుడు మిర్యాల భానుచందర్‌ వివాహం పోచంపల్లికి చెందిన శరణ్యతో శుక్రవారం పోచంపల్లిలో వధువు ఇంటి ఆవరణలో కరోనా ఎఫెక్ట్‌ పుణ్యమా అని ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా జరిగింది.  

కలెక్టర్‌ అనితారామచంద్రన్, ఇతర అధికారుల సూచనల మేరకు పెళ్లి కుమారుడు, పెళ్లికుమార్తె, కుటుంబసభ్యులు, వారి తరఫున వచ్చిన ముఖ్య బంధువులు, పురోహితుడితో సహా అందరూ   మాస్క్‌లు ధరించి పెండ్లికి హాజరయ్యారు.  పెండ్లికి సంబంధించిన వివరాలను కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ఎప్పటికప్పుడు స్థానిక తహసీల్దార్‌ దశరథనాయక్‌తో ఫోన్‌లో మాట్లాడి తెలుపుకున్నారు.  అదేవిధంగా రెవిన్యూ అధికారులు, మెడికల్‌ సిబ్బంది పెళ్లి జరిగేంత వరకు అక్కడే ఉన్నారు. వరుడికి మరోసారి పరీక్షలు నిర్వహించారు. మూతికి మాస్క్‌లు ధరించి పెళ్లి ఫోటోలు, వీడియో తీసుకోవాల్సి వస్తుందని అనుకోలేదని ఇరు కుటుంబాల బంధువులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు