మాయదారి మహమ్మారి

31 Mar, 2020 03:08 IST|Sakshi

కరోనా ధాటికి రోజుకు సగటున 459 మంది మృత్యువాత

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 35,349 మంది బలి

అత్యంత భయంకర వ్యాధుల జాబితాలో చోటు

అగ్రస్థానంలో టీబీ, హెపటైటిస్, న్యుమోనియా, ఎయిడ్స్‌

ఇలాగే కొనసాగితే కరోనాదే తొలిస్థానం!  

సాక్షి, హైదరాబాద్‌: కరోనా.. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న భయంకరమైన వైరస్‌.. దీని దెబ్బకు ప్రపంచమే చిగురుటాకులా వణుకుతోంది. రోజుకు 459 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రెండు నెలల్లోనే ప్రపంచంలోని టాప్‌ 10 భయంకర వ్యాధుల జాబితాలో కరోనా వైరస్‌ చేరిందంటే దీని ప్రతాపం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ ఆరో గ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాల ప్రకారం ఇప్పటివరకు క్షయ (టీబీ) అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. దీని దెబ్బకు రోజు భూమిపై 3014 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో హెపటైటిస్‌ (2430 మంది), న్యుమోనియా (2215 మంది), హెచ్‌ఐవీ (2110 మంది), మలేరియా (2002 మంది) నిలిచాయి. ఇందులో టీబీ, హెపటైటిస్, న్యుమోనియా లాంటి చాలా వ్యాధులు క్రీస్తు పూర్వం నుంచి ఉన్నవే. కానీ కరోనా (కోవిడ్‌–19) ఉనికి బయట పడిన రెండు నెలల్లోనే ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. ప్రస్తుతం ఈ వైరస్‌ ప్రపంచాని వణికిస్తున్న అతి భయంకరమైన వ్యాధుల్లో ఒకటిగా ఆవిర్భవించడం దీని తీవ్రతకు అద్దం పడుతోంది.

వాటిని ఎప్పుడో దాటేసింది..  
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భయంకర వ్యాధుల్లో డెంగీ, ఆటలమ్మ, పొంగు, ఎబోలా, సార్స్, మెర్స్‌ వ్యాధులను కరోనా ఎప్పుడో దాటేసింది. వీటి వల్ల రోజుకు చనిపోతున్న వారి సంఖ్య రెండు నుంచి 50 మంది ఉండగా, కరోనా వల్ల రోజుకు ప్రపంచవ్యాప్తంగా సగటున 459 మంది మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 440 మందిని బలి తీసుకునే వూఫింగ్‌ కఫ్, 396 మందిని బలితీసుకున్న టైఫాయిడ్‌లను కూడా కరోనా దాటేయడం గమనార్హం. ఐరోపా, అమెరికా దేశాల్లో కరోనా జడలు విప్పింది. కానీ ఉష్ణ దేశాల్లో పరిస్థితి కాస్త ఆశాజనకంగానే ఉంది.

మొదటి స్థానానికి ఎగబాకుతుందా..? 
జనవరి ఆఖరి వారంలో కరోనా వైరస్‌ కారణంగా మరణ మృదంగం మొదలైంది. రోజురోజుకు మరణాల సంఖ్య తీవ్రమవుతోంది. తొలివారంలో కేవలం 20 మరణాలు సంభవించాయి. ఈ వ్యాధి ప్రపంచదేశాలకు విస్తరించిన దరిమిలా కొన్ని దేశాల్లో రోజుకు 600 నుంచి 800 మందికి పైగా ప్రజల ప్రాణాలకు హరించేస్తోంది. ఇప్పటిదాకా ఈ కరోనా వైరస్‌ 35,349 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ కరోనా వైరస్‌ సాగిస్తున్న మరణ మృదంగం ఇలాగే కొనసాగితే త్వరలోనే అతి భయంకరమైన వ్యాధుల జాబితాలో మొదటి స్థానానికి ఎగబాకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ లోపు వ్యాధి నియంత్రణ, వ్యాక్సిన్‌ అందుబాటులోకివస్తే ఈ మరణాలకు అడ్డుకట్ట వేయొచ్చు. అందరం ఊపిరి పీల్చుకోవచ్చు.

పలు వ్యాధుల వల్ల ప్రపంచవ్యాప్తంగా రోజువారీ మరణాలు..

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు