మూడో వారంలో మెట్రో పరుగు!

3 Jun, 2020 03:52 IST|Sakshi

త్వరలో గ్రీన్‌సిగ్నల్‌ వచ్చే చాన్స్‌: మెట్రో వర్గాలు 

కోచ్‌లు, ఎస్కలేటర్లు, లిఫ్ట్‌ బటన్లలో మార్పులు

చేతితో తాకే అవసరంలేని ‘చెన్నై మోడల్‌’ టెక్నాలజీ అమలుకు యోచన

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో మెట్రో రైళ్లు ఈనెల మూడోవారం నుంచి మళ్లీ కూతపెట్టే అవకాశాలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ నిబంధనలను క్రమంగా సడలిస్తోన్న క్రమంలో త్వరలో వీటి రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలున్నట్లు మెట్రోరైలు వర్గాలు తెలిపాయి. ఎల్బీనగర్‌ – మియాపూర్, జేబీఎస్‌–ఎంజీబీఎస్, నాగోల్‌ – రాయదుర్గం రూట్లలో 69 కిలోమీటర్ల మేర మెట్రో రైలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. మూడు బోగీలు గల మెట్రో రైలులో పూర్తిస్థాయిలో వెయ్యిమంది ప్రయాణించవచ్చు. కరోనా నేపథ్యంలో విధిగా భౌతికదూరం పాటించాల్సి ఉండడంతో 50 – 60 శాతం ప్రయాణికులతోనే ఇవి రాకపోకలు సాగించే అవకాశముంది. అంటే ఒక్కో రైలులో 500 నుంచి 600మందిని మాత్రమే అనుమతిస్తారు. బోగీల్లో భౌతికదూరం పాటించేందుకు వీలుగా తెల్లటి రౌండ్‌ సర్కిల్స్‌ ఏర్పాటుకు యోచిస్తున్నారు. 

కాలివేళ్లతో టచ్‌ చేస్తే చాలు!
మెట్రో స్టేషన్లలో ఎస్కలేటర్లు, లిఫ్టుల బటన్లను చేతితో తాకే అవసరం లేకుండా కాలివేళ్లతో టచ్‌చేస్తే పనిచేసే ఆధునిక టెక్నాలజీ వినియోగించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే చెన్నై మెట్రో ప్రాజెక్టులో చేతితో లిఫ్టు బటన్లను తాకే అవసరం లేకుండా కాలివేళ్లతో టచ్‌చేసేలా సాంకేతికత అందుబాటులో ఉంది. ఇక్కడా అటువంటి ఏర్పాట్లు చేయనున్నట్టు సమాచారం. మరోవైపు బోగీల్లో ప్రయాణికులు పట్టుకొని నిల్చునే హ్యాండిల్స్‌ను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయనున్నారు. స్టేషన్‌లోకి వచ్చే ప్రయాణికులకు శానిటైజర్లు అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఉప్పల్, మియాపూర్‌ మెట్రో డిపోలకే పరిమితమైన రైళ్లకు రోజువారీగా స్పీడ్, లోడ్, ఇతర నిర్వహణ సామర్థ్యపరమైన మరమ్మతులు, పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మెట్రో రైలు వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు