కరోనా కేసుల్లో లక్షణాలు లేనివారే అధికం

28 May, 2020 02:36 IST|Sakshi

80 % లక్షణాల్లేకుండానే చికిత్స పొందుతున్న కరోనా రోగులు

పాజిటివ్‌ వ్యక్తులతో సన్నిహితంగా మెలిగారనే పరీక్షలు..

జలుబు, దగ్గు, జ్వరం వంటివి లేకుండానే వస్తున్న కేసులు..

ఎవరికి కరోనా ఉందో చెప్పలేని పరిస్థితి...తస్మాత్‌ జాగ్రత్త.. 

హైదరాబాద్‌ జిల్లా మాదన్నపేట్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లోని కుటుంబం పుట్టినరోజు వేడుకలు నిర్వహించింది. దీనికి అందులోని వివిధ కుటుంబాలకు చెందిన పిల్లలంతా హాజరయ్యారు. అప్పటికే ఆ అపార్ట్‌మెంట్‌లోని ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ తేలడం, పుట్టినరోజు వేడుకలు కూడా జరగడంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అందులోని వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. అపార్ట్‌మెంట్‌లో దాదాపు 40 మంది వరకు వైరస్‌ బారిన పడినట్లు నిర్ధారణ అయింది. వారిలో ఇద్దరు ముగ్గురికి మినహా ఎవరికీ లక్షణాలు లేవు. 

వికారాబాద్‌ జిల్లా బండివెల్కచర్లలో ఒక ఇంట్లో జరిగిన ఒడి బియ్యం కార్యక్రమానికి హాజరైన వారిలో8 మందికి కరోనా వైరస్‌ సోకింది. ఈ కార్యక్రమానికి షాద్‌నగర్‌ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్‌ లక్షణాలు బయటపడగా.. తీగ లాగితే ఇప్పటికి 8 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో ఒకరికి తప్ప మిగిలిన వారికి లక్షణాలు లేవు. 

సాక్షి, హైదరాబాద్‌: జలుబు, దగ్గు, జ్వరం... ఇవీ కరోనా లక్షణాలు. ఇవి ఉంటే వైరస్‌ అనుమానితులుగా భావించి పరీక్షలు చేస్తారు. కానీ ఇప్పుడు లక్షణాలు లేకున్నా పాజిటివ్‌ వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఎవరికి పాజిటివ్‌ ఉందో ఎవరికి లేదో గుర్తించడం కష్టంగా మారింది. కేవలం పాజిటివ్‌ ఉన్న వ్యక్తులతో కలిసిమెలిసి తిరుగుతున్న వారినే గుర్తించి పట్టుకోగలుగుతున్నాం. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో కొందరు విందులు, వినోదాలు, పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారు. వారిలో కొందరు తమకు పాజిటివ్‌ ఉన్నా తెలియక పాల్గొంటున్నారు. దీంతో తర్వాత పరిస్థితి అత్యంత తీవ్రంగా మారుతోంది. అందుకు పైన పేర్కొన్న కేసులే ఉదాహరణ. దీంతో ప్రతి ఒక్కరూ   ఒళ్లు దగ్గర పెట్టుకొని మసలుకోవాలని, లాక్‌డౌన్‌ సడలింపులంటే స్వేచ్ఛగా తిరగడం కాదని వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
 
లక్షణాలు లేనివారు 80 శాతం...
రాష్ట్రంలో మంగళవారం నాటికి 1991 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో మొత్తం 57 మంది మృతి చెందారు. 650 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైరస్‌ ప్రారంభ సమయంలో నమోదైన కేసుల్లో చాలా వరకు లక్షణాలు కనిపించగా, ఇప్పుడు నమోదవుతున్న కేసుల్లో 80 శాతం వరకు ఎలాంటి లక్షణాలు లేకుండానే వైరస్‌ బారిన పడుతున్నారని వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎవరికి వైరస్‌ ఉందో.. ఎవరికి లేదో.. ప్రాథమికంగా గుర్తించడం కష్టంగా మారింది. మొత్తం ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో సగం మందికిపైగా లక్షణాలు లేనివారే ఉన్నారు. ప్రస్తుతం (మంగళవారం నాటికి) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 650 మందిలో 520 మంది అంటే 80 శాతం మందికి అసలే లక్షణాలే కనిపించలేదని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు విశ్లేషించాయి. మిగిలినవారిలో దాదాపు 30 మంది ఐసీయూలో ఉన్నారని, కొందరికి ఇతరత్రా వైద్యం జరుగుతుందని చెబుతున్నారు. 520 మందికైతే ఎలాంటి లక్షణాలు, ప్రత్యేక వైద్యం కూడా అందించడం లేదని గాంధీ ఆసుపత్రికి చెందిన ఒక సీనియర్‌ వైద్యుడు వ్యాఖ్యానించారు. వారిని తమ అధీనంలో ఉంచుకొని పరిశీలనలో ఉంచామని అంటున్నారు. అందువల్ల లక్షణాలు లేవని ఎవరికివారు ఇష్టారాజ్యంగా తిరగవద్దని, ఇతరులకు లక్షణాలు లేవన్న భావనతో వారితో అతిగా కలిసిమెలిసి సన్నిహితంగా ఉండొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మరణాలు తక్కువ... కోలుకునేవారు ఎక్కువ
మంగళవారం నాటి బులిటెన్‌ ప్రకారమే.. 1,991 మంది కరోనాకు గురవగా, అందులో ఇప్పటివరకు 1,284 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 57 మంది మరణించారు. మరణాల శాతం తక్కువగా ఉండటం గమనార్హం. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల్లో మరణాలు 2.86 శాతమే. ఇక నమోదైన కేసుల్లో ఇప్పటివరకు కోలుకున్న వారు కూడా 64.49 శాతం ఉన్నారు. కాబట్టి కరోనాతో భయపడాల్సిన పనిలేదని వైద్యులు చెబుతున్నారు. కానీ లక్షణాలు లేకుండా వైరస్‌ చాపకింద నీరులా పాకుతుండటాన్ని అందరూ గుర్తించాలని, జాగ్రత్తగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ సూచిస్తోంది. వైరస్‌ విషయంలో పక్కనున్న స్నేహితుడు, ఇతరులు కూడా శత్రువులేనని డాక్టర్‌ కిరణ్‌ అభిప్రాయపడ్డారు. భౌతికదూరం పాటించాలని, మాస్క్‌లు ధరించాలని, తరచుగా చేతులను శుభ్రపరచుకోవాలని సూచిస్తున్నారు. ఈ మూడే మనకు శ్రీరామ రక్ష అని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు