ప్రభుత్వ ఆస్పత్రులకు మంచి రోజులు 

4 Feb, 2020 04:26 IST|Sakshi
గాంధీలో వైరాలజీ ల్యాబ్‌ ప్రారంభం సందర్భంగా రక్షణ మాస్క్, దుస్తులను ధరించిన మంత్రి ఈటల రాజేందర్‌

అందుబాటులో పేదలకు అధునాతన వైద్యసేవలు: మంత్రి ఈటల

ఇక గాంధీలోనే కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు

గాంధీ, ఉస్మానియా తదితర ఆస్పత్రుల్లో పలు ప్రారంభ కార్యక్రమాలు

సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రులకు మంచి రోజులు వచ్చాయని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రా జేందర్‌ అన్నారు. పేదలకు ఖరీదైన వైద్యసేవలను మరింత మెరుగ్గా అందించే ఆలోచనతో ప్రభుత్వం ఆయా ఆస్పత్రుల ను ఆధునీకరిస్తుందని చెప్పారు. ఇప్పటికే ఖరీదైన, అధునాతన వైద్య పరికరాలను సమకూర్చి కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రులను తీర్చిదిద్దిందని స్పష్టం చేశారు. నగరంలోని గాంధీ, ఉస్మానియా, ఇతర ప్రతిష్టాత్మక ప్రభుత్వాస్పత్రుల్లో పలు నిర్మాణాలకు శంకుస్థాపనలు, అత్యాధునిక వైద్యపరికరాలు, కొత్త భవనాల ప్రారంభాలతో సోమవారం ఆయన బిజీగా గడిపారు.

కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రభుత్వపరంగా చేసిన ముందస్తు ఏర్పాట్లు, అందించే వైద్యసేవలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఇప్పటి వరకు 20 అనుమానిత కేసులు నమోదయ్యాయని, వీటిలో 19 నెగెటివ్‌ రిపోర్ట్‌లు వచ్చాయని, మరొకటి రావాల్సి ఉందన్నారు. తెలంగాణలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని, మన వాతావరణం లో ఆ వైరస్‌ బతికే అవకాశం లేదన్నారు. ఇప్పటి వరకు రిపోర్టుల కోసం పుణే వైరాలజీ ల్యాబ్‌పై ఆధారపడాల్సి వచ్చేదని, ఇకపై గాంధీలోనే కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు.

గాంధీలో ‘కరోనా’ టెస్ట్‌ ల్యాబ్‌.. ఎంఎన్‌జేలో పెట్‌స్కాన్‌
►గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్‌ టెస్ట్‌ లేబొరేటరీ, డెర్మటాలజీ విభాగంలో అత్యాధునిక లేజర్‌ యూనిట్, గాంధీ మెడికల్‌ కాలేజీలో రూ.10 కోట్లతో నిర్మించిన లైబ్రరీ బిల్డింగ్‌ సహా ఎగ్జామినేషన్‌ హాల్‌ను మంత్రి ఈటల ప్రారంభించారు. అనంతరం కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డును సందర్శించారు. పుట్టుకతోనే వినికిడి లోపాన్ని గుర్తించే పరికరాలను ఆయన ఆస్పత్రికి అందజేశారు. 
►ఎంఎన్‌జే ఆస్పత్రిలో రూ.15 కోట్ల ఖరీదైన పెట్‌స్కాన్‌ను రోగులకు అంకితం చేశారు. కేన్సర్‌తో బాధపడుతూ పీడియాట్రిక్‌ వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారుల వార్డును సందర్శించి, వారిని పలకరించారు. వైద్య సేవలపై రోగి బంధువులను ఆరా తీశారు. 
►సుల్తాన్‌బజార్‌ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో రూ.17.6 కోట్లతో 150 పడకల సామర్థ్యంతో ఏర్పాటుచేసిన అదనపు బ్లాక్‌ను ప్రారంభించారు. 
►ఉస్మానియా ఆస్పత్రి ఆర్ధోపెడిక్‌ విభాగంలో కొత్తగా రూ.1.96 కోట్లతో నిర్మించనున్న అకడమిక్‌ బ్లాక్‌కు శంకుస్థాపన చేశారు. జనరల్‌ సర్జరీ విభాగంలో రూ.15 లక్షలతో సమకూర్చిన లేజర్‌ మిషన్‌ను ప్రారంభించారు. పలువురు వైద్యులు మంత్రి దృష్టికి సమస్యలను తెచ్చారు.
►ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రిలో రూ.56.25 లక్షలతో కొత్తగా ఏర్పాటు చేసిన వీఐపీ బ్లాక్‌ను ప్రారంభించారు. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఇక్కడ మరింత మెరుగైన వైద్యసేవలు అందుతాయని చెప్పారు.

మరిన్ని వార్తలు