సన్నిహితంగా మెలిగిన 25 మందికి క్వారంటైన్‌ 

12 Apr, 2020 12:03 IST|Sakshi
సంగారెడ్డిలోని మాధవనగర్‌లో హాట్‌స్పాట్‌గా గుర్తించిన ప్రాంతంలో రాకపోకలు నిషేధిస్తూ తాళ్లతో కట్టిన దృశ్యం 

సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో కరోనా వైరస్‌ మరోసారి కలకలం రేపింది. అంతా సద్దుమణుగుతుందకున్న సమయంలో జహీరాబాద్‌కు చెందిన వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడం స్థానికంగా కలకలం రేపింది. ఈ వ్యక్తి కూడా ఢిల్లీ నిజామొద్దీన్‌ తబ్లిగీ జమాత్‌ మర్కత్‌కు చెందినవారు కావడం గమనార్హం. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఢిల్లీ వెళ్లొచ్చిన వెంటనే పది రోజుల క్రితం గత నెల 31వ తేదీన ఇతనితో పాటుగా మరో నలుగురికి తీవ్రమైన దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు ఉండడంతో వీరిని గాంధీ ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం వారు గాంధీ ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉన్నారు. తొలిసారి జరిపిన పరీక్షల్లో ఈ ఐదుగురికి నెగెటివ్‌ రావడంతో పరిశీలనలో ఉంచి మరోసారి గురువారం శాంపిల్స్‌ సేకరించారు. దీంతో జహీరాబాద్‌లోని గడిమేహల ప్రాంతానికి చెందిన వృద్ధుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. 

25 మందికి క్వారంటైన్‌.. 
కరోనా పాజిటివ్‌గా వచ్చిన జహీరాబాద్‌కు చెందిన వ్యక్తి కుటుంబసభ్యులతో పాటుగా అతనితో సన్నిహితంగా ఉన్న, స్థానికంగా వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, సిబ్బందని వెంటనే క్వారంటైన్‌కు తరలించారు. వీరిని ప్రభుత్వ ఆదీనంలోని పాటి సమీపంలోని నారాయణ కాలేజీ క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు చేస్తున్నారు. వీరి శాంపిల్స్‌ను సేకరించి సీసీఎంబీ (సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయోలజీ) హైదరాబాద్‌ కేంద్రానికి తరలించారు. ఈ 25 మందిలో 13 మంది కుటుంబ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన కుటుంబీకులు ఉన్నారు. నలుగురు సభ్యులు ఇతని వద్ద పనిచేసే వారు ఉన్నారు. ఢిల్లీ వచ్చిన వెంటనే జలుబు, దగ్గు, జ్వరం ఉండడంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. దీంతో ఆ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యునితో పాటు మరో ముగ్గురు సిబ్బందిని కూడా ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్‌కు తరలించారు. ఇంకా నలుగురు పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి బంధువులు కావడం గమనార్హం.  

జిల్లాలో 7 హాట్‌స్పాట్‌లు.. 
పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తుల నివాస ప్రాంతాలలో సుమారుగా కిలోమీటరు దూరం పరిధిలోని పరిసర ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించారు. జిల్లాలోని సంగారెడ్డి పట్టణంలో వీరభద్రనగర్, ఉస్మాన్‌పుర, మంజీరానగర్‌లను ఒక హాట్‌స్పాట్‌గా, పాత బస్టాండ్‌ పరిసర ప్రాంతంలోని మాధవనగర్‌ను ఒక హాట్‌స్పాట్‌గా, అంగడిపేట మొత్తాన్ని ఒక హాట్‌స్పాట్‌గా, కొండాపూర్‌లో ఒక హాట్‌స్పాట్, జహీరాబాద్‌లోని బృందావన్‌ కాలనీలో ఒక హాట్‌స్పాట్, గడిమహేలను ఒక హాట్‌స్పాట్‌గా, రాంచంద్రాపురంలోని మయూరీనగర్‌ను ఒక హాట్‌స్పాట్‌గా ప్రకటించారు. ఈ ప్రాంతాలలో రాకపోకలను పూర్తిగా నిషేధించారు. ఆయా ప్రాంతాలలో సోడియం హైపోక్లోరైడ్, బ్లీచింగ్‌ పౌడర్, తదితర రసాయనిక ద్రావణాలతో పరిసరాలలో పిచికారీ చేయడంతో పాటుగా పరిశుభ్రం చేస్తున్నారు. ఆయా పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా కూరగాయలు నిత్యావసర వస్తువులు, మందులు, తదితర సామగ్రి అంతటిని ఇంటివద్దకే అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.  

రెడ్‌జోన్‌గా గడి కాలనీ 
జహీరాబాద్‌: పట్టణంలోని గడి కాలనీని రెడ్‌ జోన్‌గా ప్రకటించారు. తాజాగా కాలనీకి చెందిన ఓ వ్యక్తికి కరోనా వైరస్‌ పాజిటీవ్‌గా రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. శుక్రవారం కాలనీని పూర్తిగా దిగ్బంధం చేశారు. గడి కాలనీ చుట్టూ కిలో మీటర్‌ మేర రెడ్‌ జోన్‌గా ప్రకటించినట్లు తహసీల్దార్‌ నాగేశ్వరరావు, డీఎస్పీ గణపత్‌జాదవ్, మున్సిపల్‌ కమిషనర్‌ విక్రంసింహారెడ్డిలు పేర్కొన్నారు. రెడ్‌ జోన్‌గా ప్రకటించిన ప్రాంతంలో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వేను నిర్వహిస్తున్నారు. 15వ వార్డు నుంచి 24వ వార్డు వరకు ఎవరు కూడా తమ ఇళ్ల  నుంచి బయటకు రావొద్దని సూచించారు.

అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే మున్సిపల్‌ సిబ్బంది సహకారం అందిస్తారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే విపత్తుల నిర్వహణ చట్టం 1897 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఇతర ప్రాంతాల వారు సైతం రెడ్‌ జోన్‌ పరిధిలోకి ప్రవేశించరాదని సూచించారు. కరోనా పాజిటీవ్‌ వచ్చినందున సదరు వ్యక్తిని, కుటుంబ సభ్యులను, వారిని కలిసిన వ్యక్తులను సైతం చికిత్స, వైద్య పరీక్షల నిమిత్తం హయ్యర్‌ సెంటర్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.  

అదనపు కలెక్టర్‌ పర్యటన..
కరోనా వైరస్‌ పాజిటీవ్‌ వచ్చిన జహీరాబాద్‌ పట్టణంలోని గడి కాలనీ, పరిసర వార్డుల్లో అదనపు కలెక్టర్‌(లోకల్‌ బాడీస్‌) రాజర్షిషా పర్యటించారు. శుక్రవారం సాయంత్రం రెడ్‌జోన్‌గా ప్రకటించిన వార్డుల్లో అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా సర్వే నిర్వహిస్తున్న ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లతో చర్చించారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించాలని సూచించారు. కరోనా కట్టడికి అనుసరించాల్సిన వ్యూహంపై సూచనలు చేశారు. వ్యాధి విస్తరించకుండా చేపట్టాల్సిన చర్యలు, జాగ్రత్తల గురించి వివరించారు. ఆర్డీఓ రమేష్‌బాబు, మున్సిపల్‌ కమిషనర్‌ విక్రంసింహారెడ్డి, ఎస్‌ఐ వెంకటేష్‌లతో పాటు వైద్యాధికారులు, సిబ్బంది, ఆయా శాఖల అధికారులు ఆయన వెంట ఉన్నారు. 

నియంత్రణకు అన్ని చర్యలు 
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు జిల్లాలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి నుంచి ఎవరికి కూడా ఈ వైర స్‌ వ్యాపించిన దాఖలాలు లే వు. ఢిల్లీకి వెళ్లొచ్చిన వారందరి నీ వెంటనే గుర్తించి ఐసోలేషన్‌లో ఉంచడం జరిగింది. తాజాగా పాజిటివ్‌గా వచ్చిన వ్యక్తిని 10 రోజుల క్రితమే గాంధీకి తరలించాం. ముందు జాగ్రత్త చర్యగా వారి కుటుంబీకులు, అతను సన్నిహితంగా మెలిగిన వారందరినీ క్వారంటైన్‌లో ఉంచాం. దీంతో ఢిల్లీ వెళ్లొచ్చిన వా రందరి కుటుంబీకుల ప్రభుత్వ క్వారంటైన్‌ ముగిసిన వె ంటనే ఈనెల 21 వరకు హోం క్వారంటైన్‌కు తరలించాం. ఇలా కరోనా వ్యాప్తి కట్టడికి అన్ని చర్యలు చేపట్టాం. – మోజీరాం రాథోడ్, డీఎంహెచ్‌ఓ

మరిన్ని వార్తలు