గాంధీ ఆస్పత్రిలో సమ్మె విరమణ

17 Apr, 2020 10:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రి అవుట్‌ సోర్సింగ్‌ నర్సింగ్‌ సిబ్బంది సమ్మె విరమించారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో జరిపిన చర్చలు ఫలవంతం కావడంతో విధులకు హాజరైనట్టు అవుట్‌ సోర్సింగ్‌ స్టాఫ్‌నర్సుల యూనియన్‌ ప్రతినిధులు తెలిపారు. దశలవారీగా హామీలను నెరువేరుస్తామని మంత్రి హామీయిచ్చారని వెల్లడించారు.

పదమూడేళ్లుగా గాంధీ ఆస్పత్రిలో  212 మంది స్టాఫ్‌నర్సులు అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిన పనిచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిని కోవిడ్‌ నోడల్‌ కేంద్రంగా ప్రకటించడంతో వారంతా ప్రాణాలకు తెగించి విధులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో రెగ్యులరైజ్‌ చేయాలని లేకుంటే ప్రభుత్వం తరపున కాంట్రాక్టు పద్ధతిలోనైనా తమను తీసుకోవాలని కోరుతూ ఈనెల 15 నుంచి సమ్మె బాట పట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్టు ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రతినిధుల బృందం నర్సింహ, మేఘమాల తదితరులు గురువారం మంత్రి ఈటల రాజేందర్‌ను కలిశారు.

తమ డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించారని భేటీ అనంతరం వారు ప్రకటించారు. ఈనెల 1న తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్‌ 6 ద్వారా 1,640 నర్సింగ్‌ సిబ్బందిని అవుట్‌సోర్సింగ్‌ ద్వారా తీసుకోవాలని, వారికి నెలకు రూ.25 వేలు వేతనం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. కరోనా రేగుల మధ్య విధులకు నిర్వహిస్తున్న తమకు కేవలం రూ.750 మాత్రమే ప్రోత్సాహం వస్తోందని, ఒక నెల జీతం ఇన్సెంటివ్‌గా ప్రకటించాలని మంత్రిని కోరగా సానుకూలత వ్యక్తం చేశారని వెల్లడించారు. నర్సులు సమ్మె విరమించడంతో వైద్యులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

చదవండి: కరోనా.. మరో రెండేళ్లు ఇదే కథ

మరిన్ని వార్తలు