‘దాడి చేస్తే శిక్ష తప్పదు.. ఓ సెల్‌ ఏర్పాటు చేశాం’

18 Apr, 2020 11:45 IST|Sakshi

రాష్ట్ర వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రాణాలకు పణంగా పెట్టి కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్యులపై దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. నారాయణగూడలోని ఐపీఎంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన శనివారం సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కరోనా నుంచి కోలుకున్న బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ తనకు ఏ దేవుడు లేడు.. వైద్యుడే దేవుడు అన్నాడు. అలాంటి వైద్యులపై కొందరు మూర్ఖులు, శాడిస్టులు దాడి చేస్తున్నారు.
(చదవండి: గ్రేటర్‌ టెన్షన్‌..!)

వైద్యులపై దాడి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. డాక్టర్లు వారి ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు. వాళ్ల కుటుంబాల్ని పక్కనపెట్టి విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్లపై దాడి చేసిన పేషంట్లను శిక్షించేందుకు ప్రత్యేకంగా ఓ సెల్ ఏర్పాటు చేశాం. కరోనా సోకినవారిలో కొందరు తలసేమియా వంటి వ్యాధులతో బాధ పడుతున్నారు. వారికి రక్తం అవసరం. రక్తం కొరత రాకుండా బ్లడ్‌ డొనేట్‌ చేసేందుకు చాలామంది ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే టీఎన్‌జీవో ఆధ్వర్యంలో రెండు వందల మందికి పైగా రక్తదానం చేశారు’అని మంత్రి పేర్కొన్నారు.
(చదవండి: తెలంగాణలో పెరుగుతున్న పాజిటివ్‌లు)

మరిన్ని వార్తలు