కరోనాకు చెక్‌.. ఫలించిన ప్లాస్మా థెరపీ

1 Jun, 2020 09:20 IST|Sakshi

సంపూర్ణ ఆరోగ్యంతో బాధితుడి డిశ్చార్జ్‌

చికిత్సతో కోలుకుంటున్న మరో ఇద్దరు

రెట్టించిన ఉత్సాహంతోగాంధీ ఆస్పత్రి వైద్యులు

హైదరాబాద్‌: ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతకమైన కరోనా మహమ్మారికి ప్లాస్మాథెరపీతో చెక్‌ పెట్టారు. ప్రాణాపాయస్థితిలో వెంటిలేటర్‌పై ఉన్న బాధితునికి ప్లాస్మా థెరపీ చికిత్స అందించి పునర్జన్మ ప్రసాదించారు గాంధీ ఆస్పత్రి వైద్యులు. వివరాలివీ... కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా «థెరపీ చికిత్స నిర్వహించేందుకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) మే నెలలో అనుమతి ఇచ్చింది. గాంధీఆస్పత్రిలో చికిత్స పొందుతు ప్రాణాపాయస్థితిలో ఉన్న ఆరుగురి కరోనా బాధితుల కేస్‌షీట్లతోపాటు పూర్తి వివరాలను ఐసీఎంఆర్‌కు పంపగా ముందుగా థెరపీ చికిత్స కోసం ఒకరిని సెలెక్ట్‌ చేసింది.

ఐసీఎంఆర్‌ నిపుణుల సూచనల మేరకు మే 14వ తేదీన చావుబతుకుల మధ్య వెంటిలేటర్‌పై ఉన్న పాతబస్తీకి చెందిన 44 ఏళ్ల వయసు గల కరోనా బాధితునికి 200 ఎంఎల్‌ ప్లాస్మా ద్రావణాన్ని ఎక్కించారు. సదరు రోగి ఆరోగ్యం కొంతమేర మెరుగుపడటంతో రెండు రోజుల తర్వాత 16వ తేదీన మరో 200 ఎంఎల్‌ ప్లాస్మాను ఎక్కించారు. బాధితుడు పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత మరో వారం రోజులు పాటు అబ్జర్వేషన్‌లో ఉంచి ఇక ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావని భావించి ఈ నెల 30వ తేదీన డిశ్చార్జ్‌ చేసినట్లు తెలిసింది.  ఐసీఎంఆర్‌ ఆదేశాల మేరకు మరో ఇద్దరు కరోనా బాధితులకు ప్లాస్మా థెరపీ చికిత్సలు అందించగా ఇరువురు కోలుకుంటున్నారని, రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జ్‌ చేస్తామని, ప్లాస్మాథెరపీ చికిత్సలు పూర్తిస్థాయిలో విజయవంతం కావడంతో గాంధీ వైద్యుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోందని ఓ వైద్యాధికారి సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు