జడ్చర్లలో కరోనా కలకలం?

30 May, 2020 13:20 IST|Sakshi
వికాస్‌నగర్‌లో స్ప్రే చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది

మహారాష్ట్ర వెళ్లి వచ్చిన వ్యక్తికి లక్షణాలు

ఐసోలేషన్‌కు తరలింపు

జడ్చర్ల టౌన్‌: జడ్చర్ల గ్రామ పంచాయతీలో మరోమారు కరోనా కలకలం రేగింది. ఉమ్మడి జిల్లాలో తొలి రెండు కేసులు కావేరమ్మపేటలో నమోదైన విషయం తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర వెళ్లి వచ్చిన వ్యక్తికి పాజిటివ్‌ లక్షణాలు కనిపించటంతో జిల్లాకేంద్రంలోని ఐసోలేషన్‌కు తరలించారు. పూర్తి వివరాలు.. పోలేపల్లి ఫార్మసెజ్‌ కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగి జడ్చర్ల గ్రామపంచాయతీ పరిధిలోని వికాస్‌నగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. ఈ నెల 23న తన తల్లిని మహారాష్ట్రలోని స్వగ్రామంలో వదిలి 24వ తేదీ రాత్రి తిరిగి జడ్చర్లకు చేరుకున్నాడు. ఈ నెల 28న గురువారం అస్వస్థతకు గురికావటంతో అర్బన్‌ హెల్త్‌సెంటర్‌ వైద్యాధికారి డా.శివకాంత్‌ను సంప్రదించాడు. కరోనా లక్షణాలు కనిపించటంతో అతడిని జిల్లా ఆస్పత్రికి రెఫర్‌ చేయగా అక్కడి ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్నారు. గురువారం రాత్రి రక్త నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. విషయం తెలుసుకున్న పరిసర కాలనీవాసులతో పాటు గ్రామపంచాయతీ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం రాత్రి నెగెటివ్‌ ఫలితం వచ్చినట్లు ఈఓ రహ్మత్‌ తెలిపారు.

ముందస్తు చర్యలు..
శుక్రవారం వికాస్‌నగర్, లక్ష్మీనగర్‌ కాలనీల్లో కార్యదర్శి రహ్మత్‌ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు. రెండుకాలనీల్లోని రోడ్లు, కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి ఇంటి పరిసరాల్లో రసాయనాలు పిచికారీ చేయించారు. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించారు. ఆయా కాలనీల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు.

మరిన్ని వార్తలు