ఉలికిపడిన మల్లెబోయిన్‌పల్లి

3 Jun, 2020 11:13 IST|Sakshi
అనుమానిత వ్యక్తిని జిల్లా ఆస్పత్రికి తరలిస్తున్న వైద్యసిబ్బంది

కరోనా సోకిన వ్యక్తి ఆర్‌ఎంపీగా చికిత్సలు

ఆందోళనలో గ్రామస్తులు

జడ్చర్ల: మండలంలోని మల్లెబోయిన్‌పల్లికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఆ వ్యక్తి జిల్లా ఆస్పత్రిలో కాంట్రాక్ట్‌ పద్ధతిన హెల్త్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తుండటంతో పాటు గ్రామంలో ప్రైవేట్‌ క్లినిక్‌ను నడుపుతున్నాడు. అస్వస్థతకు గురైనా ఏమీ కానట్లుగా 10 రోజులుగా విధులకు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సుమారు 100 మందికిపైగా చికిత్సలు అందించినట్లు సమాచారం. సోమవారం ఆ వ్యక్తి వైద్యులను సంప్రదించగా రక్తనమూనాలను ల్యాబ్‌కు పంపారు. ఇన్ని రోజులుగా ఎవరెవరికి చికిత్సలు అందించారని తెలుసుకునే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు.

కంటైన్మెంట్‌ జోన్‌గా..
గ్రామాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా గుర్తించిన అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించారు. డీఎంహెచ్‌ఓ డా. కృష్ణ, తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ, మండల వైద్యాధికారిణి సమత తదితరులు గ్రామానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కుటుంబంతో మాట్లాడి వివరాలు సేకరించారు. భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులను హోం క్వారంటైన్‌ చేశారు. వారికి కూడా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 14 రోజుల పాటు గ్రామస్తులు ఊరు దాటి రావద్దని హెచ్చరించారు. రహదారులను మూసివేశారు.

సల్కర్‌పేట్‌లో..
గండేడ్‌: మండలంలోని సల్కర్‌పేట్‌లో భార్యాభర్తలకు కరోనా సోకిందనే అనుమానంతో గండేడ్‌ ఆసుపత్రికి తీసుకొచ్చి పరీక్షల నిమిత్తం మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. భార్యాభర్తలిద్దరూ బతుకుదేరువు కోసం కొంతకాలంగా హైదరాబాద్‌లె ఉంటున్నారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించటంతో మార్చిలో ఇంటికి వచ్చారు. కుటుంబం గడవకపోవటంతో 20 రోజుల క్రితం భర్త తిరిగి హైదరాబాద్‌కు కూలీ పనికి వెళ్లాడు. అక్కడ తీవ్రమైన దగ్గు, జలుబు, జ్వరం రావటంతో వారం రోజుల కిందట గ్రామానికి వచ్చాడు. చుట్టుపక్కల వారు సమాచారం ఇవ్వటంతో మంగళవారం వైద్యసిబ్బంది వచ్చారు. పరీక్షల నిమిత్తం 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు వైద్యాధికారి సునీత తెలిపారు.

మరిన్ని వార్తలు