కరోనా: కాస్త తగ్గుముఖం 

19 May, 2020 07:11 IST|Sakshi

తగ్గిన కరోనా పాజిటివ్‌ కేసులు 

గ్రేటర్‌ పరిధిలో కాసింత ఊరట  

గ్రేటర్‌ పరిధిలో సోమవారం కరోనా పాజిటివ్‌ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ప్రతిరోజూ సుమారు 40పైనే పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండగా సోమవారం 26 కేసులు నమోదయ్యాయి. దీంతో కాసింత ఊరట లభించినట్లయ్యింది. 

సాక్షి,  హైదారాబాద్‌: గ్రేటర్‌ పరిధిలో సోమవారం కరోనా పాజిటివ్‌ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ప్రతిరోజూ సుమారు 40పైనే పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండగా.. ఆ సంఖ్య తగ్గడంతో కాసింత ఊరట లభించినట్లయ్యింది. అమీర్‌పేటలోని నేచర్‌క్యూర్‌ ఆస్పత్రిలో 82 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 26 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మిగిలిన వారి రిపోర్టులు రావాల్సి ఉంది. నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రికి 14 మంది అనుమానితులు రాగా, వారిని ఐసోలేషన్‌ వార్డులో అడ్మిట్‌ చేశారు. వీరి నుంచి స్వాబ్స్‌ సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపారు. కింగ్‌కోఠి ఆస్పత్రి ఓపీకి 91 మంది రాగా, వీరిలో 33 మంది నుంచి నమూనాలు సేకరించారు. 14 మందిని అడ్మిట్‌ చేశారు. ఒకరికి పాజిటివ్‌ రావడంతో గాంధీకి తరలించారు. ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో ఒకరికి పాజిటివ్‌ రాగా అతడిని గాంధీకి తరలించారు. నెగిటివ్‌ వచ్చిన మరో 8 మందిని డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఇద్దరు ఉన్నారు.  (అన్ని దుకాణాలకు ఓకే)

చైతన్యపురిలో ఒకరికి పాజిటివ్‌ 
చైతన్యపురి: చైతన్యపురి డివిజన్‌లో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యింది. మలక్‌పేట గంజ్‌లో వ్యాపారం చేస్తున్న వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు పరీక్షలు నిర్వహించారు. కరోనా పాజిటివ్‌ రావడంతో సోమవారం అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాలనీని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. సోమవారం నోడల్‌ ఆఫీసర్‌ రాణి,  డిప్యూటి కమిషనర్‌ కృష్ణయ్య, కార్పొరేటర్‌ జిన్నారం విఠల్‌రెడ్డి  కాలనీలో పర్యటించారు.  ఆశా వర్కర్లు, వైద్యశాఖ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించి  క్వారంటైన్‌కు తరలించారు.   (కరోనాను జయించిన 9 నెలల చిన్నారి)

ఆఫ్టల్‌నగర్‌లో మరో పాజిటివ్‌ కేసు  
మలక్‌పేట: సలీంనగర్‌ ఆఫ్టల్‌నగర్‌లో సోమవారం మరో పాజిటివ్‌ కేసు నమోదైంది. ఈనెల 15న ఓ వృద్ధుడికి(69) కరోనా పాజిటివ్‌ రావడంతో అతడి కుటుంబ సభ్యులు ఆరుగురిని పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారిలో వృద్ధుని కోడలు (25)కు పాజిటివ్‌ వచ్చినట్లు  అధికారులు తెలిపారు. 

పాపిరెడ్డికాలనీలో యువకుడికి.. 
చందానగర్‌: శేరిలింగంపల్లి నియోజకవర్గం, పాపిరెడ్డికాలనీకి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా అధికారులు నిర్దారించారు. స్థానిక బీరప్పగుడి ప్రాంతంలో ఇంటింటి తనిఖీలు నిర్వహిస్తున్న ఆశావర్కర్లు కాలనీకి చెందిన వ్యక్తి(28) జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించి  జీహెచ్‌ఎంసీ అధికారులకు సమాచారం అందించారు. అతడిని ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. అతను ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరిని కలిశాడు అనే వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. అతడి ఇంటి చుట్టుపక్కల ఉంటున్న వారిని,  కుటుంబçసభ్యులను పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.   

ఒకే కుటుంబంలో ముగ్గురికి.. 
జియాగూడ: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. సోమవారం జీహెచ్‌ఎంసీ అధికారులు వివరాలు వెల్లడించారు. ఇటీవల లక్ష్మీనరసింహనగర్‌లో ఉంటున్న మేకలమండి కమీషన్‌ ఏజెంట్‌(65)కు కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అతని ఇంటి వాచ్‌మెన్‌ కుటుంబ సభ్యులను కింగ్‌ కోఠి ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వాచ్‌మెన్‌తో పాటు అతడి భార్య, కుమార్తెకు  కరోనా సోకినట్లు వెల్లడైంది. దీంతో వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.  

గోషామహల్‌ సర్కిల్‌లో మరో నలుగురికి.. 
అబిడ్స్‌: గోషామహాల్‌ జీహెచ్‌ఎంసీ 14వ సర్కిల్‌ పరిధిలో కరోనా విజృంభిస్తోంది. సోమవారం సర్కిల్‌ పరిధిలోని ధూల్‌పేట్‌ శివలాల్‌నగర్‌లో మరో నలుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వారం రోజుల క్రితం అదే ప్రాంతానికి చెందిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగికి (60)కు పాజిటివ్‌ రావడంతో ఆమె కుటుంబసభ్యులు 20 మందిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. వారికి పరీక్షలు నిర్వహించగా ఆమె ఇద్దరు కోడళ్లు (28), (25), కుమార్తె(26), మనుమరాలి(10) కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.   

కుర్మగూడలో 5 పాజిటివ్‌ కేసులు నమోదు... 
యాకుత్‌పురా: జీహెచ్‌ఎంసీ చార్మినార్‌ సర్కిల్‌ పరిదిలోని కుర్మగూడలో సోమవారం ఐదు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జీహెచ్‌ఎంసీ చార్మినార్‌ జోన్‌ సర్కిల్‌–7 డిప్యూటీ కమిషనర్‌ అలివేలు మంగతాయారు తెలిపారు. సోమవారం ఆమె అధికారులతో కలిసి పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఇప్పటి వరకు సర్కిల్‌ పరిధిలో మొత్తం 110 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయన్నారు. వారిలో 54 మంది డిశ్చార్జి కాగా,  ఐదురుగు వ్యక్తులు మృతి చెందారన్నారు. సోమవారం కుర్మగూడ ప్రాంతంలో ఐదు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో మాదన్నపేట్, కుర్మగూడ, రెయిన్‌బజార్, డబీర్‌పురా ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనుమానితులను  క్వారంటైన్‌ చేస్తున్నట్లు తెలిపారు. 

కరోనాతో మరొకరు మృతి 
జియాగూడ: సబ్జిమండికి చెందిన కూరగాయల వ్యాపారి (75) సోమవారం కరోనాతో మృతి చెందాడు. మార్కెట్‌లో కూరగాయలు విక్రయిస్తున్న వ్యక్తి పక్కన ఉండే వ్యక్తి ద్వారా  కరోనా సోకింది. గతవారం రోజులుగా జ్వరం, జలుబుతో బాధపడుతున్న అతను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లాడు. కరోనా లక్షణాలు ఉండటంతో వైద్యులు  అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.
 

మరిన్ని వార్తలు