ఆ 17 దేశాల్లో మనం

26 Apr, 2020 04:18 IST|Sakshi

భారత్‌లో 20 వేలు దాటిన కరోనా కేసులు

తొలి 100 కేసుల నమోదులో 16.1% చొప్పున పెరుగుదల

20 వేలకు చేరే సరికి 8.7 శాతానికి తగ్గుదల

సాక్షి, హైదరాబాద్‌: కరోనా పాజిటివ్‌ కేసులు 20వేలు దాటిన దేశాల జాబితాలో భారత్‌ కూడా చేరింది. ప్రపంచ వ్యాప్తంగా 200కు పైగా దేశాల్లో ఈ మహమ్మారి కలవరపెడుతుండగా 17 దేశాల్లో మాత్రం బాధితుల సంఖ్య 20 వేలు దాటింది. ఈ జాబితాలో తొలి కేసు వెలుగు చూసిన చైనా, అత్యధిక పాజిటివ్‌లు నమోదవుతున్న అమెరికా, మరణాల రేటు ఎక్కువగా ఉన్న ఇటలీ, మొదట్లో విజృంభించి.. తర్వాత తగ్గు ముఖం పట్టిన ఇరాన్‌ కూడా ఉన్నాయి. అయితే, మన దేశంలో పాజిటివ్‌లు నమోదైన తొలినాళ్లలో వైరస్‌ వ్యాప్తి ఇతర దేశాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగానే కనిపించినా లాక్‌డౌన్‌ తర్వాత పరిస్థితులు మెరుగుపడి తగ్గుదల నమోదైంది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే వారం ముగిసేలోపు ఈ సంఖ్య 33 వేల వరకు చేరుతుందని అంచనా.

తగ్గుతూ... పెరుగుతూ..: మన దేశంలో కరోనా వ్యాప్తిని పరిశీలిస్తే... హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తొలి 100 కేసులు వచ్చే సమయంలో రోజుకు సగటున 16.1 శాతం పెరుగుదల కనిపించింది. ఆ తర్వాత 100–500 మాత్రం శరవేగంగా 22.3 శాతం పెరుగుదల నమోదైంది. ఆ తర్వాత 500–1000 కేసులు 13.6 శాతం వేగంతో, 1,000–5,000 కేసులు 20.6 శాతం, 5,000–10,000 కేసులు 12.9 శాతం సగటున పెరిగాయి. ఇక 10 వేల నుంచి 20 వేలు చేరేందుకు మాత్రం అతి తక్కువ సగటు నమోదైంది. రోజుకు 8.7 శాతం సగటుతో ఈ 10వేల కేసులు నమోదయ్యాయి. అయితే, తొలినాళ్లలో కేసుల విషయంలో మన దేశ సగటుతో సమానంగా ఉన్న అమెరికా ఆ తర్వాత వేగంగా వెళ్లిపోయింది. ప్రపంచ గణాంకాల ప్రకారం.. శనివారం ఉదయానికి అమెరికా 9 లక్షలు దాటి కరోనా కేసుల్లోనూ అగ్రరాజ్యంగానే నిలిచింది. ఈ వైరస్‌ వ్యాపిస్తున్న కేసుల సగటు ఆధారంగా ఆ తర్వాతి స్థానాల్లో జర్మనీ, చైనా, స్పెయిన్, టర్కీ, ఇటలీ, యూకే, ఫ్రాన్స్, రష్యా, బ్రెజిల్, కెనడా, భారత్, బెల్జియం, ఇరాన్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, పోర్చుగల్‌ దేశాలున్నాయి.

మరిన్ని వార్తలు