గ్రేటర్‌లో కరోనా విజృంభణ.. జనం హైరానా 

4 Jul, 2020 10:46 IST|Sakshi

సాక్షి, హైదారాబాద్‌ : కరోనా వైరస్‌ నగరంలో విస్తరిస్తోంది.  జీహెచ్‌ఎంసీ పరిధిలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ అధికం అవుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. రికార్డు స్థాయితో మహమ్మారి కేసులు వెలుగుచూస్తున్నాయి. మరణాలూ చోటుచేసుకుంటుండటం మరింత  ఆందోళన కల్గిస్తోంది.

ఎల్‌బీనగర్‌ : ఎల్‌బీనగర్‌ నియోజకవర్గం పరిధిలో కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతుండంపై సర్వత్రా ఆందోళన నెలకొంటోంది. శుక్రవారం ఒక్కరోజే జీహెచ్‌ఎంసీ ఎల్‌బీనగర్‌ మూడు సర్కిళ్ల పరిధిలో 56 కేసులు నమోదు కావడం గమనార్హం. ఆయా సర్కిళ్ల అధికారులు సైతం కరోనా కేసుల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. మహమ్మారి కాలనీలు, బస్తీలనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలను చుట్టేస్తున్నది. అయినా ఆయా కాలనీలో ఎలాంటి నివారణ చర్యలు తీసుకోకపోవడం, రాకపోకలపై నియంత్రణ చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవంటూ స్థానికులు మండిపడుతున్నారు. (24 గంటల్లో.. 22,771 కరోనా కేసులు)

11 డివిజన్ల పరిధిలో... 
మూడు సర్కిళ్ల పరిధిలోని 11 డివిజన్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా శుక్రవారం 56 కేసులు నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ ఇన్ని కేసులు నమోదు కాలేదని అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు. రోజుకు మూడు సర్కిళ్ల పరిధిలో 20 నుంచి 30 వరకు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నయి. సర్కిళ్ల వారీగా కేసుల వివరాలను పరిశీలిస్తే... ఎల్‌బీనగర్‌ సర్కిల్‌–3లో 19, ఎల్‌బీనగర్‌–4లో 9, సర్కిల్‌–5లో 28 కేసులు నమోదు కావడం విశేషం. 

ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు... 
కరోన బారిన పడిన పేషెంట్ల ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు. వారి ఇళ్లకు తాళాలు వేసి అక్కడికి ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొంటున్నారు. ఇక మందులు కూడా మెడికల్‌ ఆశ వర్కర్లు, వలీంటర్ల సహకారంతో ఇళ్ల వద్దకే పంపిణీ చేస్తున్నామన్నారు. 

మేడిపల్లి శ్రీనివాస్‌నగర్‌లో... 
మేడిపల్లి: పిర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని మేడిపల్లి శ్రీనివాస్‌నగర్‌లో ఉంటున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. హైదరాబాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌లో పోలీసు కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఆయనతోపాటు కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌లో ఉంచారు. 

కాప్రాలో... 
కాప్రా: కాప్రా సర్కిల్‌ పరిధిలో కొత్తగా 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో సర్కిల్‌ పరిధిలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 110కి చేరింది. కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ఇప్పటి వరకు 39 మంది డిశ్చార్జ్‌ కాగా, 68 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇదిలా ఉండగా కరోనా వైరస్‌తో ఇప్పటి వరకు సర్కిల్‌ ముగ్గురు మృతి చెందారు. 

మల్కాజిగిరిలో... 
మల్కాజిగిరి: మల్కాజిగిరిలో 10 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దేవీనగర్‌కు చెందిన కిరాణా దుకాణం నిర్వాహకుడు(59), గాంధీ            ఆస్పత్రిలో పనిచేసే వ్యక్తి(55), జేజేనగర్‌కు చెందిన వ్యక్తి(31), పీవీఎన్‌ కాలనీకి చెందిన వ్యక్తి(35), మౌలాలి ఈస్ట్‌ప్రగతినగర్‌కు చెందిన వృద్ధుడు(59), ఏపీఐఐసీ కాలనీకి చెందిన యువకుడు(22) మీర్జాలగూడకు చెందిన వృద్ధురాలు(59), అనంతసరస్వతీనగర్‌కు చెందిన యువకుడు(29), బృందావన్‌కాలనీకి చెందిన మహిళ(40), మల్లికార్జునగర్‌కు        చెందిన వృద్ధుడి(66)కి కరోనా సోకింది. 

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో... 
వెంగళరావునగర్‌: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ పరిధిలో 36 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని జీహెచ్‌ఎంసీ సర్కిల్‌–19 డీసీ ఎ.రమేష్‌ తెలిపారు. యూసుఫ్‌గూడ డివిజన్‌లో 15 మందికి, ఎర్రగడ్డ డివిజన్‌లో ఏడుగురికి, రహమత్‌నగర్‌ డివిజన్‌లో ఒక్కరికి, వెంగళరావునగర్‌ డివిజన్‌లో నలుగురికి, బోరబండ డివిజన్‌లో తొమ్మిది మందికి కరోనా నిర్ధారణ అయిందన్నారు. 

బోడుప్పల్‌లో... 
బోడుప్పల్‌: బోడుప్పల్‌ పరిధిలో ముగ్గురికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. బాలాజీహిల్స్‌కు చెందిన ఓ వ్యక్తి, వాసవీనగర్‌కు చెందిన ఇద్దరు మహిళలకు కరోనా పాజిటివ్‌ రాగా హోం క్వారంటైన్‌లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు.  

ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిలో... 
ఉప్పల్‌: ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిలో 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉప్పల్‌ న్యూ విజయపురి కాలనీ, సర్వే ఆఫ్‌ ఇండియా, రామంతాపూర్‌ రాంరెడ్డినగర్, రాజేంద్రనగర్, టీవీ కాలనీ, చిలుకానగర్, హబ్సిగూడ తదితర ప్రాంతాలలో కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. 

అడ్డగుట్టలో... 
అడ్డగుట్ట: అడ్డగుట్టలోని వేర్వేరు ప్రాంతాల్లో నివాసముండే ఇద్దరు వ్యక్తులు ఒకరు(40), మరొకరు(54) కరోనా బారిన పడ్డారు. వారితో పాటు కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌ చేశారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు