భిక్కనూరులో కరోనా కలకలం

19 Apr, 2020 11:07 IST|Sakshi

‘‘మా బంధువు మర్కజ్‌కు వెళ్లి వచ్చాడు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం బాగాలేదు.. అతడిని చూసేందుకు హైదరాబాద్‌కు వెళ్లి వచ్చాను’’ అన్న ఆ కార్మికుడి మాటలు భిక్కనూరులో కలకలం రేపాయి. కరోనా భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపేలా చేశాయి. అధికారులు అతడి కుటుంబాన్ని క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు.

సాక్షి, భిక్కనూరు : భిక్కనూరుకు చెందిన ఓ వ్యక్తి మండల కేంద్రానికి సమీపంలోకి కెమికల్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అతడు 25 రోజులుగా విధులకు హజరుకావడం లేదు. శనివారం ఫ్యాక్టరీకి వెళ్లాడు. ఇన్ని రోజులు ఎందుకు రాలేదని ఫ్యాక్టరీ ఇన్‌చార్జి ప్రశ్నించారు. దీంతో తన బంధువు మర్కజ్‌కు వెళ్లి కరోనా బారినపడ్డాడని, అతడిని చూసేందుకు హైదరాబాద్‌కు వెళ్లి లాక్‌డౌన్‌తో అక్కడే చిక్కుకుపోయానని తెలిపాడు. ఫ్యాక్టరీ ప్రతినిధులు వెంటనే ఆవరణను సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేయించారు. ఈ విషయం దావానలంలా మండలమంతా వ్యాపించింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యా రు. భిక్కనూరు సర్పంచ్‌ వేణు వెంటనే ప్రభుత్వ వైద్యుడు రవీందర్, ఎస్సై నవీన్‌కుమార్‌లకు సమాచారం అందించారు. ప్రభుత్వ వైద్యుడు రవీందర్‌ సదరు కార్మికుడి కుటుంబంలోని నలుగురు వ్యక్తులకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని అంబులెన్స్‌లో తెలంగాణ యూనివర్సిటీ సౌత్‌ క్యాంపస్‌లో ఉన్న క్వారంటైన్‌ సెంటర్‌కు పంపించారు. నలుగురి రక్తనమూనాలను కరోనా పరీక్షకు పంపిస్తామని వైద్యుడు రవీందర్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు