లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశం

9 Apr, 2020 02:48 IST|Sakshi
ఆశా వర్కర్లకు శానిటైజర్లను పంపిణీ చేస్తున్న మంత్రి హరీశ్‌రావు

అందరూ సహకరించాలి: మంత్రి హరీశ్‌రావు 

ఆశా వర్కర్లకు శానిటైజర్లు, హెల్త్‌ కిట్స్‌ పంపిణీ

సాక్షి సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన అంతా ప్రజల క్షేమం కోసమేనని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. లాక్‌ డౌన్‌ను మరికొద్ది రోజులు పొడిగించే అవకాశం ఉందని, అందుకు అందరూ సహకరించాలని కోరారు. ఇదంతా మన మంచి కోసమేనని పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేట, వివిధ మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. నర్సరీలను పరిశీలించారు. ఆశ వర్కర్లకు శానిటైజర్లు, హెల్త్‌ కిట్స్‌ అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు స్వీయ గృహ నిర్బంధమే శరణ్యమని పేర్కొన్నారు.

వైరస్‌ ప్రబలకుండా ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభినందిస్తున్నారని చెప్పారు. వైరస్‌ నివారణకు అహర్నిశలు కృషి చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పోలీసులు, మున్సిపల్‌ తదితర సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఇప్పటికే నిజాముద్దీన్‌ సభకు హాజరైన వారిని గుర్తించామని, వారిలో పాజిటివ్‌ వచ్చిన వారికి ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉం డాలని ఆయన కోరారు. ప్రాణా ల కంటే ఎక్కువ ఏదీ కాదని, ప్రభుత్వ ఆదేశాలను శిరసావహించాలని ప్రజలను కోరారు. 

ప్రజలకు ఇబ్బందుల్లేవ్‌..
ప్రజల అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు లేవని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తెల్లరేషన్‌ కార్డు కలిగిన వారితో పాటు వలస కూ లీలకు ఒక్కొక్కరికి 12 కిలోల ఉచిత బియ్యం, నగదు అందించామన్నారు. రబీ ఉత్పత్తులు వచ్చిన నేపథ్యంలో అన్ని జిల్లాల్లో రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. సిద్ధిపేట, ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు కూరగాయలను తరలిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు