కంటైన్మెంట్‌ జోన్లలో ప్రభుత్వ ఉద్యోగులపై ఆంక్షలు

22 Apr, 2020 01:40 IST|Sakshi

స్థానిక అధికారుల అనుమతి మేరకే విధుల్లోకి వెళ్లాలి

తాజా మార్గదర్శకాలు జారీచేసిన కేంద్ర ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కంటైన్మెంట్‌ జోన్లలో నివసిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై కేంద్రం ఆంక్షలు విధించింది. స్థానిక అధికారుల మార్గదర్శకాలను అనుసరించాలని సూచించింది. అధికారుల అనుమతి మేరకు, సడలింపు ఇచ్చినప్పుడు మాత్రమే విధుల్లోకి వెళ్లాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ముందు జాగ్రత్త చర్యలను కచ్చితంగా పాటించాలని సూచించింది. ‘కార్యాలయంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ను ధరించాలి. తరచూ పరిశుభ్రత ఉండేలా చూసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత, శారీరక దూరాన్ని పాటించాలి’అని కోరింది. 

ఇవీ మార్గదర్శకాలు.. 

► ప్రభుత్వ కార్యాలయాలు, గదుల్లో క్రిమిసంహారక ప్రొటోకాల్‌ను పాటించాలి. 
► సబ్బు, నీటితో తరచుగా చేతులు కడుక్కోవాలి. 
► ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్లను వాడండి. 
► గదుల్లోని అధికారుల మధ్య తగినంత దూరం ఉండేలా సీటింగ్‌ ఏర్పాట్లు చేయాలి. 
► క్యాంటీన్లలో గుమిగూడటం మానుకోవాలి. 
► కార్యాలయంలోని ఏ ప్రదేశంలోనైనా 5 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడకూడదు. 
► కార్యాలయ సముదాయంలో సందర్శకుల ప్రవేశాలను తగ్గించాలి. సందర్శకుల తాత్కాలిక పాస్‌లను ఇప్పటికే నిలిపివేశాం.
► ఆఫీసర్‌ అనుమతి ఉన్న సందర్శకులను, వారు కలవాలనుకునే వారిని మాత్రమే సరిగ్గా పరీక్షించిన తరువాతే లోనికి అనుమతించాలి. 
► సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాత్రమే నిర్వహించాలి. 
► అధికారిక ఈ–మెయిల్‌లో అవసరమైన కరస్పాండెన్స్‌ జరపాలి. ఫైళ్లు, పత్రాలను ఇతర కార్యాలయాలకు పంపించకుండా చూసుకోవాలి. 
► అధికారులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. 
► జ్వరం, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు అనారోగ్యంగా అనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. వారిని వెంటనే ఇంటికి పంపించాలి. 
► గర్భిణీ ఉద్యోగులు, ఇతరత్రా అనారోగ్యంతో బాధపడుతున్నవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. 
► వీళ్లు ప్రజలతో ప్రత్యక్ష సంబంధముండే పనుల్లోకి రాకూడదు. అవసరమైతే హోం క్వారంటైన్‌కు పరిమితం కావాలి. 

>
మరిన్ని వార్తలు