భయం గుప్పిట్లో మెతుకు సీమ

5 Apr, 2020 12:44 IST|Sakshi
మెదక్‌లోని అజంపురా వీధిలో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణం స్ప్రే చేస్తున్న దృశ్యం

సాక్షి, మెదక్‌: జిల్లాలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొని వచి్చన జిల్లా కేంద్రానికి చెందిన 56 ఏళ్ల వ్యక్తికి ఇది వరకే పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా.. ఆ వ్యక్తి నుంచి అతడి భార్య, కూతురు, కోడలికి సోకింది. ఈ మేరకు ఏడుపాయలలోని ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రంలో ఉన్న వారిని.. జిల్లా వైద్య శాఖ అధికారులు శుక్రవారం రాత్రి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.  

కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. గత నెల 22న ఒక్కరోజు పాటు జనతా కర్ఫ్యూ చేపట్టగా.. 23 నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగనుంది. లాక్‌డౌన్‌ను జిల్లాలో అధికార యంత్రాంగం వీటిని పకడ్బందీగా అమలు చేస్తోంది. అయితే.. ఢిల్లీ నిజాముద్దీన్‌ ప్రార్థనలు జిల్లాలో ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించాయి. అక్కడికి వెళ్లి వచి్చన వారు జిల్లాలో 14 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే వారిని వైద్య చికిత్సల కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇందులో మెదక్‌ పట్టణంలోని అజంపురాకు చెందిన 56 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది.

అతడు ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అతడి కుటుంబ సభ్యులు 11 మందిని పాపన్నపేట మండలం ఏడుపాయలలోని ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. వ్యాధి నిర్ధారణ కోసం రక్తనమూనాలను హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఫలితాలు శుక్రవారం రాగా.. బాధితుడి కుటుంబ సభ్యులు ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ప్రజల్లో భయం నెలకొంది.  

నేడు సమగ్ర సర్వే 
కరోనా బారిన పడిన నలుగురు సన్నిహితులు ఎవరెవరు ఉన్నారు.. వారు ఎక్కడెక్కడ తిరిగారు వంటి వాటిపై దృష్టి సారించిన అధికారులు.. ఆ దిశగా ఆరా తీస్తున్నారు. అంతేకాదు.. వైద్య శాఖ ఆధ్వర్యంలో శనివారం ఆయా వార్డులు, కాలనీల్లో సమగ్ర సర్వే చేపట్టేందుకు సిద్ధమయ్యారు. పూర్తి వివరాలను సేకరించేందుకు మూడు వైద్య బృందాలు రంగంలోకి దిగనున్నాయి.  

పూర్తి స్థాయిలో శానిటైజేషన్‌.. 
కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆజంపురలోని ప్రతీ ఒక్క కాలనీలో ఫైరింజన్‌ సాయంతో హైడ్రోజన్‌ క్లోరైడ్, బ్లీచింగ్‌ పౌడర్‌ ద్రావణం పిచికారీ చేశారు. మెదక్‌ మున్సిపల్‌ అధికారుల ఆధ్వర్యంలో ఆజంపురతోపాటు పట్టణ వ్యాప్తంగా పారిశుధ్య చర్యలు చేపట్టారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను అదనపు కలెక్టర్‌ నగేష్‌ స్వయంగా పరిశీలించి.. సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు.  

ఇక మరింత కట్టడి 
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రేషన్‌ బియ్యం పంపిణీ జరుగుతోంది. కూపన్ల పద్ధతిన పంపిణీ చేస్తున్నప్పటికీ పలు షాపుల వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించడం లేదు. ఈ క్రమంలో ‘ఢిల్లీ’ ఘటనతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో మరింత కట్టడి దిశగా పోలీస్‌ అధికారులు సమాయత్తమవుతున్నారు. రోడ్లపై కనిపిస్తే తమదైన పద్ధతిలో ట్రీట్‌మెంట్‌ ఇచ్చే దిశగా ముందుకు సాగుతున్నారు.

నాగ్సాన్‌పల్లిలో కలకలం
పాపన్నపేట(మెదక్‌): 
సంగారెడ్డి నుంచి అమ్మగారి ఇంటికొచ్చిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌ తేలడంతో నాగ్సాన్‌పల్లిలో కలకలం మొదలైంది. ప్రత్యక్షంగా. పరోక్షంగా అతడితో కాంట్రాక్ట్‌లో ఉన్న సభ్యులను  మండల అధికారులు గుర్తించారు. దీంతో 12 కుటుంబాలకు చెందిన 39 మంది వ్యక్తులు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి గ్రామానికి చెందిన ఓ మహిళను సంగారెడ్డికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. ఆమె కొడుకు మార్చి 24న అమ్మమ్మగారి ఇంటికి వచ్చాడు. కొంత మంది గ్రామçస్తులు, అనుమానించి  స్వగ్రామానికి వెళ్లాల్సిందిగా కోరడంతో మార్చి 27న సంగారెడ్డి వెళ్లిపోయాడు. అయితే మార్చి రెండో వారంలో ఢిల్లీలో జరిగిన మత సమ్మేళనానికి ఆ యువకుడు హాజరైనట్లు అధికారులు గుర్తించారు.

దీంతో యువకుడికి కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ తేలింది. వెంటనే సంగారెడ్డి జిల్లా అధికారులు మెదక్‌ జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వడంతో శుక్రవారం తహసీల్దార్‌ బలరాం, పొడిచన్‌పల్లి డాక్టర్‌ విశాల్‌రాజు, ఎస్సై ఆంజనేయులు,సర్పంచ్‌ సంజీవరెడ్డి తదితరులు గ్రామంలో సర్వే నిర్వహించారు. పాజిటివ్‌ వచ్చిన యువకుడితో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న 12 కుటుంబాలకు చెందిన 39 మందిని గుర్తించారు. వారందరిని స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశించారు.  ఇంకా ఎవరైనా అతడితో కలసి గడిపినట్లయితే ధైర్యంగా ముందుకొచ్చి తమకు తెలపాలని మైక్‌ల ద్వారా కోరారు.  తమ మధ్య గడిపిన యువకుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో నాగ్సాన్‌పల్లి గ్రామంలో ఆందోళన నెలకొంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు