మార్కెట్లకు తాకిన వైరస్‌

8 Jul, 2020 13:43 IST|Sakshi
మార్కెట్‌లో భౌతిక దూరం పాటించని వ్యాపారులు (ఫైల్‌)

కూరగాయలు, పండ్లు, వ్యవసాయ

మార్కెట్లలో వ్యాపారులకు కరోనా లక్షణాలు

జ్వరాలతో ఇంటికే పరిమితమైన పలువురు

అయినా యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన

వరంగల్‌: వరంగల్‌లోని వ్యవసాయ, కూరగాయలు, పండ్ల మార్కెట్లకు చెందిన పలువురు వ్యాపారులు కొద్ది రోజులుగా జ్వరాలతో బాధపడుతుండడంతో కరోనా లక్షణాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి శరవేగంగా వ్యాపిస్తుండడంతో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నారు. జ్వరాల బారిన పడిన వ్యాపారులు ఇళ్లకే పరిమితం కావడంతో మిగిలిన వారు బిక్కుబిక్కుమంటూ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. వరంగల్‌ లక్ష్మీపురంలోని కూరగాయల మార్కెట్‌లో నిత్యం కూరగాయలు కొనుగోలు చేసే ములుగు జిల్లా మంగపేట మండలానికి చెందిన వ్యాపారికి నాలుగు రోజుల క్రితం పాజిటివ్‌గా తేలడంతో మిగతా వారు ఆందోళన చెందుతున్నారు. లాక్‌డౌన్‌ తొలినాళ్లలో లక్ష్మీపురం మార్కెట్‌ను “ఓ’ సిటీ మైదానానికి మార్చగా, కొద్దిరోజులకే తిరిగి పాత స్థలంలో ఏర్పాటుచేశారు. ఈ సమయంలో మార్కెట్‌లో క్రమం తప్పకుండా శానిటేషన్‌ చేస్తామని, భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరిస్తేనే అనుమతిస్తామని చెప్పిన అధికారులు, ప్రజాప్రతినిధులు వాటిని మరిచిపోయారు. మార్కెట్ల పునః ప్రారంభానికి ముందు రోజు సోడియం హైపో క్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయగా దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఆ జాడే కానరావడం లేదు. దీనికి వ్యాపారులు, కొనుగోలుదారులు పలువురు మాస్క్‌లు లేకుండా క్రయవిక్రయాలు సాగిస్తుండడం గమనార్హం.

కొత్తిమీర వ్యాపారికి?
వ్యవసాయ మార్కెట్‌లోని కొందరు అడ్తివ్యాపారుల్లో కరోనా లక్షణాలు బయటపడ్డాయని సమాచారం. అదే విధంగా కూరగాయల మార్కెట్‌లోని ఓ కొత్తిమీర హోల్‌సేల్‌ వ్యాపారికి కరోనా లక్షణాలు ఉండడంతో ఇంటికే పరిమితమైనట్లు తెలుస్తోంది. ఈ వ్యాపారి వారం క్రితం దామెర గుట్టల్లో జరిగిన విందులో పాల్గొన్నట్లు సమాచారం. దీనికి తోడుగా పలువురు హమాలీలు తరచుగా జ్వరాల బారిన పడుతున్నా మార్కెట్‌ వస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికైనా పాలనాయంత్రాంగం కూరగాయల మార్కెట్‌పై దృష్టి సారించకుంటే కరోనా మరికొందరికి సోకే ప్రమాదముందని చెప్పొచ్చు.

చాంబర్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం..
మార్కెట్లలోని కొందరికి కరోనా లక్షణాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైద్య పరీక్షలు నిర్వహిస్తే అసలు విషయం బయటపడుతుంది. పలువురు వ్యాపారులు జ్వరాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, మార్కెటింగ్‌ శాఖ అధికారులు, కూరగాయలు, పండ్ల మార్కెట్ల వర్తక సంఘాలతో చర్చించి మార్కెట్ల నిర్వహణ, జాగ్రత్తలపై నిర్ణయం తీసుకుంటాం.– చింతం సదానందం, వరంగల్‌ మార్కెట్‌ చైర్మన్‌

మరిన్ని వార్తలు