తెలంగాణలో ఇంటింటి సర్వే

24 Mar, 2020 12:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపడుతోంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలతో సమాచార సేకరణ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్య పరిస్థితిపై వీరు పూర్తి స్థాయి రిపోర్ట్‌ అందించనున్నారు. అలాగే జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటితో బాధపడుతున్న వారి వివరాలు సేకరించనున్నారు. రాష్ట్రంలోని 27 వేల ఆశావర్కర్లు, 8 వేల మంది ఏఎన్‌ఎంల సేవలను ఈ సర్వే కోసం వినియోగించుకోనున్నారు.

మరోవైపు నేటి నుంచి గాంధీ, ఫీవర్‌, చెస్ట్‌, కింగ్‌ కోఠి ఆస్పత్రుల్లో ఓపీ సేవలను నిలిపివేశారు. ఇప్పటికే అత్యవసరం కానీ ఆపరేషన్లు నిలిపివేశారు. అలాగే లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కాగా, ఇప్పటివరకు తెలంగాణలో 33 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే  ఆరుగురికి కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయింది.
 
మధ్యాహ్నం లాక్‌డౌన్‌పై కేసీఆర్‌ సమీక్ష..
తెలంగాణలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఉన్నతస్థాయి అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వైద్యారోగ్య శాఖ, పోలీసు, రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయ, ఆర్థిక శాఖతో పాటు తదితర శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి  తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉత్పన్నమైన పరిస్థితిని ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే రేషన్‌ పంపిణీకి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

చదవండి : వైరస్‌పై నిర్లక్ష్యంగా ఉంటే భారీ మూల్యం తప్పదు

మరిన్ని వార్తలు