ఈ నెలా జీతాల కోత!

28 May, 2020 01:23 IST|Sakshi

ఉద్యోగుల మే నెల వేతనాలపై ప్రభుత్వ నిర్ణయం

రూ.12,000 కోట్లకు రూ.3,100 కోట్లే వచ్చాయి

12 కిలోలు వచ్చేనెలా  ఉచిత బియ్యంపంపిణీ కొనసాగింపు

రూ.1,500 నగదు పంపిణీ నిలిపివేత

అప్పుల రీషెడ్యూల్‌పై స్పందించని కేంద్రం

 రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

నిరాడంబరంగా రాష్ట్ర అవతరణ వేడుకలు 

సాక్షి, హైదరాబాద్ ‌: లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించినా రాష్ట్ర ఖజానాకు పెద్దగా ఆదాయం సమకూరకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మే నెల వేతనాల్లోనూ కోత విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించిన నేపథ్యంలో కార్మికులు, కూలీలకు పనులు దొరికే పరిస్థితి ఉన్నందున, ప్రతి కుటుంబానికి నెలకు రూ.1,500 ఇచ్చే కార్యక్రమాన్ని జూన్‌ నెల నుంచి నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించి, ఖజానాకు ఆదాయం తగ్గిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఆసరా పింఛన్లను యథావిధిగా అందించడంతో పాటు, పేదలకు ఒక్కొక్కరికీ 12 కిలోల బియ్యాన్ని జూన్‌లోనూ పంపిణీ చేయాలని సీఎం నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోతలు కొనసాగించాలని నిర్ణయిస్తూ.. ప్రజాప్రతి నిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసు ఉద్యోగుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం, ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం చొప్పున మే నెల వేతనంలో కోత విధిస్తామని సీఎం ప్రకటించారు.

వచ్చింది రూ.3,100 కోట్లే..
‘రాష్ట్రానికి ప్రతి నెలా రూ.12 వేల కోట్ల మేర ఆదాయం రావాల్సి ఉండగా, లాక్‌డౌన్‌ కారణంగా ఆదాయం పూర్తిగా పడిపోయింది. మే నెలకు సంబంధించిన కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా రూ.982 కోట్లు కలుపుకొంటే మొత్తంగా రాష్ట్ర ఖజానాకు రూ.3,100 కోట్లు సమకూరింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనల్లో కొన్నింటిని సడలించినా రిజిస్ట్రేషన్లు, రవాణా తదితర రంగాల్లో ఆదాయం పెద్దగా రాలేదు. కొద్ది మొత్తంలో వచ్చిన ఆదాయంతోనే అవసరాలు తీర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు అప్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.37,400 కోట్లు కిస్తీల కింద క్రమం తప్పకుండా చెల్లించాల్సి ఉంది. అప్పులను రీషెడ్యూలు చేయాలని కేంద్రాన్ని కోరినా స్పందించక పోవడంతో కిస్తీలు తప్పనిసరిగా కట్టాల్సిన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచినా కేంద్రం విధించిన షరతులతో అదనపు రుణాలు సమకూర్చుకునే పరిస్థితి రాష్ట్రానికి లేదు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపునకు రూ.3 వేల కోట్లకు పైగా ఖర్చవుతుంది. వేతనాలు పూర్తిగా చెల్లిస్తే ఖజానా ఖాళీ కావడంతో పాటు ఇతర చెల్లింపులకు అవకాశం ఉండదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తగిన వ్యూహం అనుసరించాలి’అని అధికారులకు సీఎం నిర్దేశించారు. 

హైదరాబాద్‌లో అన్ని షాప్‌లకూ ఓకే..
రాజధానిలో గురువారం నుంచిమాల్స్‌ మినహా అన్ని రకాల షాపులు తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం నగరంలో ఒక షాపు తప్పించి మరో షాపు (సరి–బేసి) తెరిచే వెసులుబాటు కల్పించింది. దీంతో ఒకే షాపులో ఎక్కువ మంది గుమిగూడే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఎక్కువ షాపులు తెరిచి, తక్కువ మంది వచ్చే విధానం అనుసరించాలని నిర్ణయించింది. 

అవతరణ వేడుకలకు దూరంగా..
కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెలంగాణ అవతరణ వేడుకలను ఈసారి నిరాడంబరంగా జరపాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించడం, జాతీయ పతాకావిష్కరణ మాత్రమే జరపాలని సూచించారు. ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించొద్దని చెప్పారు.

  • మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు,ఇతర ప్రజాప్రతినిధులు తమ కార్యాలయాల్లోనే జాతీయ పతాకావిష్కరణ జరుపుతారు.
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి, ప్రగతి భవన్‌లో పతాకావిష్కరణ చేస్తారు.
  • అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ముందు అమరవీరులకు నివాళి అర్పించి, పతాకావిష్కరణ చేస్తారు. జిల్లా కేంద్రంలో ముఖ్యమైన అధికారులతో చిన్నపాటి ఎట్‌ హోమ్‌ నిర్వహిస్తారు.
మరిన్ని వార్తలు