కరోనా: తెలంగాణలో కొత్తగా 27 కేసులు

20 May, 2020 20:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. బుధవారం రాష్ట్రంలో 27 కోవిడ్‌ కేసులు నమోదయినట్టు తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 15 కేసులు నమోదు కాగా, 12 మంది వలస శ్రామికులు కరోనా వైరస్‌ బారిన పడినట్టు తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 1661 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 89 మంది వలసజీవులు ఉన్నారని వెల్లడించింది. కోవిడ్‌ బాధితుల్లో ఇప్పటివరకు 1,013 మంది కోలుకున్నారని, ప్రస్తుతం 608 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. కరోనాతో ఇవాళ ఇద్దరు మృతి చెందడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 40కి చేరింది. వరంగల్‌ రూరల్‌, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు. మరో 25 జిల్లాల్లో గత 14 రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదని హెల్త్‌బులెటిన్‌లో ప్రభుత్వం తెలిపింది.

జగిత్యాల జిల్లాలో కరోనా కలకలం
జగిత్యాల జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 8 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ వెల్లడించారు. వీరంతా ముంబై నుంచి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. జగిత్యాల కృష్ణానగర్‌కు చెందిన ఒకరు, గొల్లపల్లి మండలం చందోలి గ్రామానికి చెందిన ముగ్గురు.. భీముడి దిబ్బ గ్రామానికి చెందిన ఇద్దరు.. బుగ్గారం మండలానికి చెందిన ఇద్దరు కరోనా బారిన పడినట్టు తేలింది. (కరోనా: మనదేశానికి ఊరట!)

>
మరిన్ని వార్తలు