హాట్‌స్పాట్‌!

10 Jul, 2020 03:24 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్‌ కేసులు ఏకంగా 21.91 శాతం

జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో 3 రెట్లు అధికంగా కరోనా తీవ్రత

ఇప్పటివరకు బయటపడ్డ పాజిటివ్‌లలో 51.13 శాతం కేసులు ఈ 10 రోజుల్లోనే

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా తీవ్రరూపం దాలుస్తోంది. ప్రతిరోజూ వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. తెలంగాణలో తొలి పాజిటివ్‌ కేసు మార్చి 2న నమోదవగా ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 30 వేలు దాటింది. కరోనా లాక్‌డౌన్‌ కాలంలో జనజీవనం స్తంభించడం వల్ల వైరస్‌ అదుపులో ఉన్నప్పటికీ ప్రభుత్వ సడలింపులతో వైరస్‌ వ్యాప్తి విస్తృతమైంది. ప్రస్తుతం రోజుకు రెండు వేలకు చేరువలో పాజిటివ్‌ కేసులు నమో దవుతున్నాయి. రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తిని పరిశీలిస్తే ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 51.13 శాతం కేసులు గత పది రోజుల్లోనే నమోదు కావడం గమనార్హం. పరీక్షల సంఖ్య పెంచుతున్న కొద్దీ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న తీరు ఎలా ఉందో స్పష్టమవుతోంది.

పది రోజుల్లో 29 శాతం పాజిటివ్‌...
రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల వేగాన్ని భారీగా పెంచింది. ఈ క్రమంలో పాజిటివ్‌ కేసుల నమోదు కూడా అదే స్పీడ్‌లో ఉంది. గత పది రోజుల్లో (జూన్‌ 29–జూలై 8 వరకు) రాష్ట్రవ్యాప్తంగా 52,163 మంది నుంచి శాంపిల్స్‌ తీసుకొని ఆర్‌టీ–పీసీఆర్‌ పద్ధతిలో పరీక్షలు జరపగా ఇందులో 15,117 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన పరీక్షలు చేసిన శాంపిల్స్‌లో 29 శాతం పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు స్పష్టమవుతోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నాటికి 1,34,801 నమూనాలను పరీక్షించారు.

వాటిలో 29,536 నమూనాలు పాజిటివ్‌గా నిర్ధారణయ్యాయి. ఈ లెక్కన రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల శాతం 21.91గా ఉంది. జాతీయ స్థాయిలో పరీక్షలు, పాజిటివ్‌ కేసుల నమోదును పరిశీలిస్తే దేశవ్యాప్తంగా 1.07 కోట్ల శాంపిల్స్‌ పరిశీలించగా 7.67 లక్షల మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ లెక్కన జాతీయ సగటు పాజిటివ్‌ రేటు 7.1 శాతంగా ఉంది. జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్ర సగటు మూడు రెట్లు అధికంగా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

‘గ్రేటర్‌’ గజగజ...
రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో 80 శాతానికిపైగా పాజిటివ్‌ కేసులు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే బయటపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 30 వేల పాజిటివ్‌ కేసులు నమోదైతే అందులో రెండొంతులకు పైగా పాజిటివ్‌లు జీహెచ్‌ఎంసీ ఏరియాలో ఉన్నాయి. దీంతో గ్రేటర్‌ ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గ్రేటర్‌ తర్వాత రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో వైరస్‌ బారిన పడుతున్న వారు అధికంగా ఉన్నారు. వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, నిజామాబాద్, కరీంగనర్‌ సంగారెడ్డి జిల్లాల్లోనూ వైరస్‌ ప్రభావం తీవ్రంగానే ఉంది.

గత 10 రోజులుగా రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు, పాజిటివ్‌ కేసులు
తేదీ        పాజిటివ్‌    పరీక్షలు
జూన్‌ 29        975        2,468    
జూన్‌ 30        945        3,457    
జూలై 1        1,018        4,234    
జూలై 2        1,213        5,356    
జూలై 3        1,892        5,965    
జూలై 4        1,850        6,427    
జూలై 5        1,590        5,290    
జూలై 6        1,831        6,383    
జూలై 7        1,879        6,220    
జూలై 8        1,924        6,363 

మరిన్ని వార్తలు